ఆ మహిళ భర్త డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరి మధ్య ఫిబ్రవరి 11న వివాదం జరిగింది. ఈ నేపధ్యంలో ఆ మహిళ ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో భర్త ఆమె కోసం గాలించాడు. నాలుగు రోజుల తరువాత ఆ మహిళ తిరిగి ఇంటికి వచ్చి... తనను ఇద్దరు వ్యక్తులు బలవంతంగా వారితో పాటు తీసుకువెళ్లారని, నాలుగు రోజుల పాటు బంధించివుంచారని భర్తకు తెలిపింది. ఆ మహిళ పార్ధీ సముదాయానికి చెందినది. ఈ సముదాయంలోని వారు భగవంతుని పేరిట ప్రమాణం చేసేందుకు మరుగుతున్న నూనెలోని నాణాన్ని తీసే దురాచారాన్ని అవలంబిస్తుంటారు. ఈ సమయంలో వారు అబద్ధం చెబితే చేయి కాలుతుందని, లేని పక్షంలో చేయి కాలదని నమ్ముతుంటారు. దీనిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఆ మహిళకు భర్త అగ్ని పరీక్ష పెట్టాడు. తన భార్య చెప్పేది నిజమో కాదో తేల్చుకునేందుకే ఈ పరీక్ష పెడుతున్నట్లు సదరు భర్త ఆ వీడియోలో చెప్పాడు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ నీలం గోర్హే దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ఆదేశాలు జారీ చేశారు.