
కోల్కతా: కేంద్రం ప్రకటించిన స్వల్పకాలిక ఆర్మీ రిక్రూట్మెంట్ పథకంపై పశ్చిమబెంగాల్లో శనివారంనాడు కూడా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ పథకానికి వ్యతిరేకంగా నార్త్ 24 పరిగణాల జిల్లాలోని బరాక్పోర్ రైల్వే స్టేషన్ వద్ద కొందరు యువకులు వినూత్న తరహాలో నిరసనలు తెలిపారు. సామూహికంగా పుషప్స్ చేస్తూ యువశక్తిని ప్రదర్శించారు.
ఇవి కూడా చదవండి
రైల్వే ట్రాక్లను దిగ్బంధం చేస్తూ వినూత్న తరహాలో యువకులు నిరసనలు తెలపడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రోజువారీ ప్రయాణికులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం తలెత్తింది. కొందరు ప్రయాణికులైతే ఒక వర్గం మీడియాను తప్పుపట్టారు. అనవసరంగా నిరసనలను హైలైట్ చేస్తున్నారని, నిరసనకారులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని నిరసన కారులను ట్రాక్ విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకారులు వినిపించుకోకపోవడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి జరిపారు. దాదాపు రెండు గంటల అనంతరం దిగ్బంధాలను పోలీసులను తొలగించడంతో రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.