అగ్నిపథ్‌ ఆర్మీ ర్యాలీ ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-15T06:26:40+05:30 IST

ర్మీ నియామకాలకు సంబంధించి విశాఖలో అగ్నిపథ్‌ ర్యాలీని ప్రారంభించారు.

అగ్నిపథ్‌ ఆర్మీ ర్యాలీ ప్రారంభం
పరుగు పోటీ పూర్తయిన తరువాత స్టేడియం నుంచి బయటకు వస్తున్న అభ్యర్థులు

తొలిరోజు 2,700 మంది హాజరు


మహారాణిపేట (విశాఖ సిటీ), ఆగస్టు 14:  ఆర్మీ నియామకాలకు సంబంధించి విశాఖలో అగ్నిపథ్‌ ర్యాలీని ప్రారంభించారు. ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రారంభమైన ఈ ర్యాలీ ఆదివారం తెల్లవారుజామున ముగిసింది. మొదటి రోజు సుమారు 2700 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఒక్కో బ్యాచ్‌కు 200 మంది చొప్పున అభ్యర్థులను 14 బ్యాచ్‌లుగా విడదీసి, 1,600 మీటర్ల పరుగు పోటీ నిర్వహించారు. దీనిలో అర్హత సాధించిన సుమారు 450 మందిని తదుపరి ప్రక్రియకు ఎంపిక చేశారు.  


రేపు సీఎం జగన్‌ రాక

అచ్యుతాపురం సెజ్‌లో టైర్ల ఫ్యాక్టరీకి ప్రారంభోత్సం

విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంరఽధజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మంగళవారం జిల్లాకు రానున్నారు. 16వ తేదీ ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 10.20 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఇక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌కు వెళతారు. అక్కడ ఏటీసీ టైర్ల కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తిరిగి అక్కడ నుంచి మధ్యాహ్నం 12.50 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో మర్రిపాలెంలోని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ ఇంటికి వెళతారు. ఎమ్మెల్యే కుమారుడు, కోడలను ఆశీర్వదిస్తారు. 1.35 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరం వెళతారు. 


అన్నాచెల్లెళ్ల ఆత్మహత్య... టౌన్‌ కొత్తరోడ్డులో విషాదం

మహారాణిపేట, ఆగస్టు 14: వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధి టౌన్‌ కొత్తరోడ్డు సమీపంలో ఒక ఇంట్లో నివసిస్తున్న అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన మునిపాత్రుని రాంబాబు (51), అతని చెల్లెలు మునిపాత్రుని భాగ్యలక్షి(48)లు 2019లో విశాఖ వచ్చి స్థిరపడ్డారు. వారు టౌన్‌ కొత్తరోడ్డు వద్ద ఒక పురాతన భవనం పెంట్‌ హౌస్‌లో నివాసం ఉంటున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆదివారం వీరు విషం సేవించి ఇంట్లోనే  పడి ఉన్నారు. సాయత్రం 4:30 గంటల సమయంలో వీరికి తెలిసిన వారు ఇంటికి వెళ్లిచూడగా,  నిద్రిస్తున్నట్టు కనిపించడంతో తిరిగి వెళ్లిపోయారు. మరలా రాత్రి  7 గంటల సమయంలో వెళ్లి చూడగా అదేవిధంగా ఉండడంతో అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి పరిశీలించారు. ఇద్దరూ నోటి నుంచి నురగలు కక్కుకుని ఉండడాన్ని గమనించి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి వన్‌టౌన్‌ పోలీసులు చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. కేజీహెచ్‌ వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించడంతో మృతదేహాలను మార్చురీకి తరలించారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.



Updated Date - 2022-08-15T06:26:40+05:30 IST