హైదరాబాద్‌లో కనపడని భారత్ బంద్ ప్రభావం

ABN , First Publish Date - 2022-06-20T18:56:08+05:30 IST

హైదరాబాద్: అగ్నిపథ్ ద్వారా సైన్యంలోకి ప్రవేశాలకు సంబంధించి చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో కనపడని భారత్ బంద్ ప్రభావం

హైదరాబాద్: అగ్నిపథ్ స్కీమ్ ద్వారా సైన్యంలోకి ప్రవేశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే హైదరాబాద్‌లో భారత్ బంద్ ప్రభావం ఎక్కడా కనపడలేదు. మేడ్చల్, జీడిమెట్ల, సుచిత్ర, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, మియాపూర్, కుకట్‌పల్లి, బాలానగర్, అమీర్‌పేట్, ఎల్ బి నగర్, వనస్థలిపురం, చార్మినార్, బాలాపూర్, కోఠి, నాంపల్లి, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో బస్సులు, ఆటోలు యధావిధిగా నడుస్తున్నాయి. కార్యాలయాలు, షాపులు, వ్యాపార సంస్థలు, హోటళ్ళు  తెరిచారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. 


మరోవైపు ఈ నెల 17న హింస జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఈ నెల 17న పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మరణించడంతో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తపడుతున్నారు.


హింసాత్మక  ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించడంతో రాష్ట్ర రాజధానిలో బంద్‌కు సంబంధించి ఎలాంటి ప్రభావమూ కనపడలేదు. 

Updated Date - 2022-06-20T18:56:08+05:30 IST