అధిక ధరకు ఎరువులను అమ్మితే సస్పెన్షన్లే..

ABN , First Publish Date - 2022-08-18T05:54:12+05:30 IST

ఎరువులను ఎక్కువ ధరకు విక్రయిస్తే ఆ ప్రాంతంలో పనిచేసే అగ్రి అధికారులు, ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని అగ్రి కమిషనర్‌ సిహెచ్‌ హరికిరణ్‌ ఆదేశించారు.

అధిక ధరకు ఎరువులను అమ్మితే సస్పెన్షన్లే..
పెదకాకానిలోని ఎరువుల గిడ్డంగుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న జేడీ నున్నా, ఏడీ శ్రీనివాసరావు

అధికారులకు అగ్రి కమిషనర్‌ హరికిరణ్‌ హెచ్చరిక

గుంటూరు,ఆగస్టు17 (ఆంధ్రజ్యోతి): ఎరువులను ఎక్కువ ధరకు విక్రయిస్తే ఆ ప్రాంతంలో పనిచేసే అగ్రి అధికారులు, ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని అగ్రి కమిషనర్‌ సిహెచ్‌ హరికిరణ్‌ ఆదేశించారు. బుధవారం కలక్టరేట్‌లోని వ్యవసాయశాఖ కార్యాలయంలో అగ్రి, ఉద్యానశాఖ జిల్లా అధికారులతో రాష్ట్ర కార్యాలయం నుంచి ఆయన జూమ్‌కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ-పంట నమోదుపై ఆర్బీకేల నుంచి ప్రతిరోజు నివేదికలు తెప్పించాలన్నారు. రెవెన్యూ, అగ్రి ఉద్యోగులు సమన్వయంతో ఈ-పంట నమోదు చేయాలని, దీనిపై ఏవోలు మండలం యూనిట్‌గా సమీక్షించాలన్నారు. రాష్ట్ర కార్యాలయం నుంచి జేడీ కృపాదాస్‌, డీడీలు స్వర్ణ, జగ్గారావు తదితరులు వివిధ అంశాలను సమీక్షించారు. సమావేశంలో జేడీ నున్నా వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ డీడీ సుజాత, మార్క్‌ఫెడ్‌ డీఎం కృష్ణారావు, ఏడీలు శ్రీనివాసరావు (గుంటూరు), వెంకటరావు (తెనాలి), ఏవోలు సునీల్‌, గౌతమ్‌ ప్రసన్న, శ్రీ నివాసరావు, నాయక్‌ తదతరులు పాల్గొన్నారు.

ఎరువుల గిడ్డంగుల్లో అగ్రి జేడీ తనిఖీలు..

 పెదకాకాని మండలం అవంతి గిడ్డంగుల్లో మార్క్‌ఫెడ్‌, కోరమండల్‌, క్రిబ్‌కో, ఇఫ్‌కో, ఎన్‌ఎఫ్‌సీఎల్‌, ఆర్‌సీఎఫ్‌ తదితర కంపెనీల ఎరువుల నిల్వలను అగ్రిజేడీ నున్నా వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేశారు. అలాగే  బుడంపాడులో ఎరువుల గిడ్డంగులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, ఇతర జిల్లాలకు ఎరువులను సరఫరాచేసినా అట్టి వ్యాపారులపై కఠినచర్యల తీసుకుంటామని  హెచ్చరిం చారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ డీఎం కృష్ణారావు, గుంటూరు ఏడీ శ్రీనివాస రావు, పెదకాకాని ఎంఏవో సంధ్యారాణి, ప్రకాశ్‌రెడ్డి, పున్నారావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-18T05:54:12+05:30 IST