రైతుల ఖాతాల్లో పడని రాయితీ

ABN , First Publish Date - 2021-01-22T06:11:50+05:30 IST

పంట రుణాలకు వర్తించే సున్నా, పావలా వడ్డీ పథకాల అమలులో ప్రభుత్వం అలసత్వం వహి స్తోంది.

రైతుల ఖాతాల్లో పడని రాయితీ

పంట రుణాల రాయితీ ఊసెత్తని ప్రభుత్వం

జిల్లాలో 3.73 లక్షల మంది రైతులకు బకాయి 

నూతన విధానంతో అన్నదాతలపై ఆర్థిక భారం

పంట రుణాలకు వడ్డీ చెల్లించండి.. మేం మీ ఖాతాల్లో ఆ మొత్తం వేస్తాం.. అని ప్రభుత్వం ప్రకటించింది. పాలకుల మాటలు నమ్మిన రైతులు వడ్డీ చెల్లించారు. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి తమ ఖాతాల్లో పడాల్సిన వడ్డీ రాయితీ పడక రైతులు ఆందోళన చెందుతున్నారు. సున్నా, పావలా వడ్డీ పథకాలకు సంబంధించి జిల్లాలో సుమారు 3.73 లక్షల మంది రైతులకు ప్రభుత్వం వడ్డీ బకాయి చెల్లించాలి. అయితే ఈ వడ్డీ రాయితీల ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. దాదాపు 2.50 లక్షల మంది రైతులకు పావలా వడ్డీ పథకాన్ని అమలు చేయాలి. సున్నా వడ్డీ పథకం 32 శాతం మంది రైతులకు మాత్రమే అందింది. ఈ రెండు పథకాల కింద రుణాలకు తాము చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లించాలని రైతులు కోరుతున్నా వీరి మొర ఆలకించే నాథుడే కరువయ్యాడు. 

నరసరావుపేట, జనవరి 21: పంట రుణాలకు వర్తించే సున్నా, పావలా వడ్డీ పథకాల అమలులో ప్రభుత్వం అలసత్వం వహి స్తోంది.  ఎన్నో ఏళ్ళుగా రైతులకు మేలు చేకూర్చిన వడ్డీ రాయితీ పథకాల అమలులో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వడ్డీ రాయితీ విధానాన్ని కాదని ప్రస్తు త ప్రభుత్వం నూతన విధానం ప్రవేశ పెట్టింది. అయితే ఈ విధా నం రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టి వేస్తున్నది. రైతు తీసుకున్న అప్పునకు వడ్డీతో చెల్లిస్తే ఆ వడ్డీ మొత్తాన్ని వారి ఖాతాకు నేరుగా జమ చేస్తామ ని ప్రభుత్వం నూతన విధానంలో ప్రకటించింది. జిల్లాలో 5,98,974 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో 3,48,415 మంది రైతులు లక్ష, అంతకన్నా తక్కువగా పంట రుణా న్ని పొందారు. సున్నా వడ్డీ పథకం కింద 1,84,660 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వీరందరూ గడువులోపు తీసుకున్న పంట రుణాన్ని వడ్డీ సహా చెల్లించారు. వీరందరికీ సున్నా వడ్డీ పథకం కింద వారు చెల్లించిన 7 శాతం వడ్డీని తిరిగి ప్రభుత్వం చెల్లించాలి. సున్నా వడ్డీ అర్హత పొందిన రైతులకు రూ.62.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందుకుగాను 60,006 మంది రైతులకు మాత్రమే రూ.15.80 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఈ పథకం కింద ఇంకా 1,23,654 మంది రైతులకు రూ.46.74 కోట్లు చెల్లించాలి. ఎప్పటికీ వడ్డీ బకాయిలను విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.  

పాత విధానమే మేలంటున్న రైతులు


గత ప్రభుత్వం అమలు చేసిన వడ్డీ రాయితీ పథకాలే మేలని రైతులు చెబుతున్నారు. గతంలో రూ.లక్షలోపు పంట రుణాన్ని వడ్డీ లేకుండా చెలించేవారమని, నూతన విధానం వల్ల 7 శాతం వడ్డీతో చెల్లించాల్సి వస్తుందన్నారు. వడ్డీ రాయితీ పాత విధానంలో రూ.2 లక్షల రుణం తీసుకున్న రైతు రూ.4 వేలు వడ్డీ చెల్లించే వారు. నూతన విఽధానంలో రూ.14 వేలు చెలించాల్సి వస్తున్నది. నూతన విధానంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. పావలా వడ్డీ పథకాన్ని సక్రమంగా అమలు చేయడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రాయితీ పథకాలను పాత విధానంలోనే అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. రైతు భరోసా సొమ్ము పంట రుణాల వడ్డీ చెల్లింపునకు సరిపోతున్నదని రైతులు చెబుతున్నారు. 

Updated Date - 2021-01-22T06:11:50+05:30 IST