మాదీ వ్యవసాయ ఆధారిత కుటుంబమే

ABN , First Publish Date - 2022-10-01T05:42:53+05:30 IST

‘మాదీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబమే. లింగన్నపేటలో పుట్టడం నా అదృష్టం. మా ఊరికి వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎంత గొప్పనో.. మాకు హైకోర్టు కూడా అంతే గొప్ప. ఓ దేవాలయంగా బావిస్తాం’ అని హైకోర్టు జడ్జి జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాసరావు అన్నారు.

మాదీ వ్యవసాయ ఆధారిత కుటుంబమే
జడ్జి శ్రీనివాసరావుకు పూల మొక్క అందజేస్తున్న ఎస్పీ

గంభీరావుపేట, సెప్టెంబరు 30 : మాదీ పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబమే. లింగన్నపేటలో పుట్టడం నా అదృష్టం. మా ఊరికి వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎంత గొప్పనో.. మాకు హైకోర్టు కూడా అంతే గొప్ప. ఓ దేవాలయంగా బావిస్తాం’ అని హైకోర్టు జడ్జి జస్టిస్‌  జగ్గన్నగారి శ్రీనివాసరావు అన్నారు.  శుక్రవారం తన స్వగ్రామమైన గంభీరావుపేట మండలంలోని లింగన్నపేటకు వచ్చారు. హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత  మొదటి సారిగా  స్వగ్రామానికి వచ్చిన ఆయన ముందుగా వేంకటేశ్వరస్వామి దేవాలయంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం విలేకరులతో మాట్లాడుతూ లింగన్నపేటలో ఒకటి రెండు కుటుంబాలు మినాహా అన్నీ వ్యవసాయంపైన ఆధారపడి జీవించాయన్నారు. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ గ్రామంలోనే చదవుకున్నట్లు, తరువాత 85, 86, 87 సంవత్సరంలో గంభీరావుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలో విద్యను అభ్యసించినట్లు చెప్పారు. గంభీరావుపేట జూనియర్‌ కళాశాలలో శర్మ, శాస్ర్తీ అనే ఉపాధ్యాయులు తనను చాలా ప్రోత్సహించారన్నారు. కాలేజీ చదువు అనంతరం తన అన్న య్య రామచందర్‌రావు హైదరాబాద్‌కు తీసుకెళ్లారని, చిన్నపాటి ఉద్యోగంతో మొదలైన తన జీవితం ఈ స్థాయికి చేరుకుందని అన్నారు. అంతకుముందు జడ్జి శ్రీనివాసరావును ఎస్పీ రాహుల్‌ హెగ్డే మర్యాద పూర్వకంగా కలిశారు. జూనియర్‌ సివిల్‌ జడ్జి సౌజన్య, డీఎస్పీ విశ్వప్రసాద్‌, సీఐ మొగిలి, తహసీల్దార్‌ మధుసూదన్‌రెడ్డి, ఎస్సైలు మహేష్‌, శేఖర్‌ ఉన్నారు.  సర్పంచ్‌ కటకం శ్రీదర్‌పంతులు, పలువురు జడ్జి శ్రీనివాసరావును సన్మానించారు. ఉపసర్పంచ్‌ రాజు, నాయకులు దయాకర్‌రావు, సురేందర్‌రెడ్డి, కృష్ణమూర్తి, వెంకట్రావ్‌ ఉన్నారు. 

హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయవాదులు

సిరిసిల్ల క్రైం : జిల్లాలోని గంభీరావుపేట మండలంలోని లింగన్నపేటకు వచ్చిన రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ శ్రీనివాస రావును శుక్రవారం సిరిసిల్ల బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజన్న ప్రసాదం అందజేసి సన్మానించారు.కార్యక్రమంలో ఏజీపీ రవీందర్‌రావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వసంతం, కార్యదర్శి అనిల్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T05:42:53+05:30 IST