ఆదాయం ఫుల్‌... అభివృద్ధి నిల్‌

ABN , First Publish Date - 2022-08-19T06:08:50+05:30 IST

ఆదాయం ఫుల్‌... అభివృద్ధి నిల్‌

ఆదాయం ఫుల్‌... అభివృద్ధి నిల్‌
మహబూబాబాద్‌ మార్కెట్‌కు వచ్చిన మిర్చి రాబడులు, సరుకులతో కళకళలాడుతున్న కేసముద్రం మార్కెట్‌

సమస్యల నిలయాలుగా వ్యవసాయ మార్కెట్లు

అప్‌ గేడ్ర్‌కు నోచుకోని మానుకోట మార్కెట్‌

సెలక్షన్‌ గ్రేడ్‌ కానీ కేసముద్రం మార్కెట్‌

తొర్రూరు మార్కెట్‌ అంతంతే...

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, ఆగస్టు 18 : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. మార్కెట్‌కు వచ్చే ఆదాయ వనరుల ప్రకారం చూస్తే.. మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ ఏనాడో సెలక్షన్‌ గ్రేడ్‌స్థాయికి ఎదగాలి.. కానీ ప్రభుత్వం పట్టించకోకపోవడంతో కనీసం స్పెషల్‌ గ్రేడ్‌స్థాయి అటు ఉంచి ఇంకా గ్రేడ్‌-1 స్థాయిలోనే కొట్టుమిట్టాడుతోంది. పీఎం ఎక్స్‌లెన్సీ అవార్డు సాధించి జాతీయస్థాయిలో గుర్తింపు కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ సెలక్షన్‌ గ్రేడ్‌స్థాయికి ఎదగాలి కానీ దాన్ని సైతం అప్‌గ్రేడ్‌ చేయకుండా పక్కకు పెట్టారు. తొర్రూరు మార్కెట్‌కు కూడా ఆదాయ వనరులు సమృద్ధిగా సమకూరుతున్నా దాని అభివృద్ధికి, గ్రేడ్‌-1 స్థాయికి గానీ పెంచడం లేదు. మహబూబాబాద్‌ మార్కెట్‌కు ఏటా రూ.3కోట్ల నుంచి రూ.4కోట్ల వరకు ఆదాయం వస్తున్న ఈ మార్కెట్‌లో యార్డు సరిపోక అధికారులు, వ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.


మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌..

మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ 1960లోనే ప్రారంభమైంది. 1979లో ఇల్లందు రోడ్‌లో 9.6 ఎకరాల స్థలంలో పక్క భవనాలు, షెడ్లు నిర్మించి మార్కెట్‌ యార్డును ప్రారం భించారు. ఈ మార్కెట్‌కు రాష్ట్రస్థాయిలో మిర్చి మార్కెట్‌గా ప్రత్యేక గుర్తింపు పొందింది. మిర్చితోపాటు పత్తి, అపరాలు, ధాన్యం ఈ మార్కెట్‌కు వస్తున్నప్పటికీ కొన్నేళ్ల క్రితం నుంచి యార్డు లోపలి భాగం నుంచి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం జరుపడంతో యార్డుకు ఉన్న స్థలం ఇరుకుగా మారింది. సరుకులు అధికంగా రావడం, యార్డు సరిపోక అధికారులు, వ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌కు వచ్చిన సరుకులు ఖాళీ అయ్యేంత వరకు మూడు నుంచి నాలుగు రోజుల పాటు మార్కెట్‌ బంద్‌ చేయాల్సిన పరిస్థితి ఉంది. గత కొద్దికాలం క్రితం మార్కెట్‌ స్థలం సరిపోవడం లేదని, మోడల్‌ మార్కెట్‌ నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని కోరడంతో 27 ఎకరాల భూమిని మార్కెట్‌కు కేటాయించారు. మోడల్‌ మార్కెట్‌ నిర్మాణానికి పాలకమండలి విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ మార్కెట్‌కు 2013-14 నుంచి రూ.2.5 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. 2016-17 సంవత్సరంలో రూ.3 కోట్లకు పైగా ఆదాయం రాగా, 2020-21 వరకు రూ.3.86 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. కరోనా సంక్షోభం, మార్కెట్‌ లలో దేశమంతట ఒకే మార్కెట్‌ విధానం కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రయత్నించింది. ఆ సమయంలో రూ.2.46కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం పరంగా చూస్తే 2014-15లోనే ఈ మార్కెట్‌ స్పెషల్‌ గ్రేడ్‌ సాధించాలి. అప్పటి ప్రజాప్రతినిధులు పట్టించుకోపోవడం ద్వారా గ్రేడ్‌-1 స్థాయిలో ఉండిపోయింది. వాస్తవానికి పరిశీలిస్తే ఈ మార్కెట్‌ సెలక్షన్‌ గ్రేడ్‌స్థాయికి ఎదగాల్సి ఉంది. 


కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌.. 

కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ప్రత్యక్ష కొనుగోళ్లు నుంచి ఈ-నామ్‌ మార్కెట్‌ వరకు ఎదిగింది. ఏటా రూ.2కోట్ల నుంచి రూ.3కోట్లకు పైగా ఆదాయం వస్తున్న ఈ మార్కెట్‌కు 2002లో ప్రత్యేక హోదా కార్యదర్శి స్థాయికి ఎంపిక చేశారు. సరుకుల రాబడిలో.. పసుపు రాబడిలో నిజామాబాద్‌ మార్కెట్‌ తర్వాత స్థానం కేసముద్రం మార్కెట్‌దే. ప్రత్యేకంగా ఈ మార్కెట్‌లో ఈ-నామ్‌ అమలు చేస్తుండడంతో ప్రధాన మంత్రి ఎక్స్‌లెన్సీ అవార్డుకు పోటీ పడి దేశంలోనే అన్ని మార్కెట్‌ల కంటే ఈ మార్కెట్‌ అవార్డు సాధించింది. గతేడాది సుమారు రూ.3 కోట్లు ఆదాయం వస్తున్నా సెలక్షన్‌ గ్రేడ్‌ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేయకుండా అలాగే ఉండిపోయింది. 


తొర్రూరు మార్కెట్‌.. 

ఏడు ఎకరాల స్థలంలో తొర్రూరు వ్యవసాయ మార్కెట్‌ ప్రారంభమైంది. గతంలో మార్కెట్‌ వివిధ సరుకులు వచ్చి వ్యాపారులు ప్రత్యక్ష కొనుగోళ్లు చేపట్టేవారు. అలాంటిది కొన్నేళ్ల క్రితం నుంచి ఈ మార్కెట్‌ ప్రత్యక్ష కొనుగోళ్లు లేకుండపోయాయి. మార్కెట్‌ యార్డుకు ఒక బస్తా కూడా సరుకు రాకుండ నిలిచిపోయింది. వ్యాపారులు రాకపోవడం, అధికారులు పట్టించుకోపోవడంతో కేవలం తొర్రూరు పాలకేంద్రం, దంతాలపల్లి చెక్‌ పోస్టులపైనే ఆధారపడి మార్కెట్‌ నడుస్తోంది. కేవలం చెక్‌ పోస్టుల ద్వారానే ఏటా రూ.1.50కోట్ల నుంచి రూ.2.30కోట్ల వరకు ఆదాయం సాధిస్తుంది. ప్రస్తుతం గ్రేడ్‌-2 స్థాయిలో కొనసాగుతున్న ఈ మార్కెట్‌ను గ్రేడ్‌-1 స్థాయికి అప్‌గ్రేడ్‌ చేసి తిరిగి రైతులు మార్కెట్‌కు సరుకులు తీసుకువచ్చి వ్యాపారులతో ప్రత్యక్ష కొనుగోళ్లు చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు బానోత్‌ శంకర్‌నాయక్‌, డీఎస్‌.రెడ్యానాయక్‌లు ఉన్నారు. ఈ ప్రజా ప్రతినిధులు మార్కెట్‌ల అప్‌గ్రేడ్‌, అభివృద్ధికి పాటుపడాలని రైతులు కోరుతున్నారు. 


కనీసం స్పెషల్‌ గ్రేడ్‌ స్థాయికి పెంచాలి : బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి, మార్కెట్‌ చైర్‌పర్సన్‌, మహబూబాబాద్‌ 

ఈ మార్కెట్‌కు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా మార్కెట్‌స్థాయిని పెంచడం లేదు. నిజానికి సెలక్షన్‌ గ్రేడ్‌స్థాయిలో ఉండాల్సి ఉండగా గ్రేడ్‌-1 స్థాయిలోనే ఉంది. కనీసం స్పెషల్‌ గ్రేడ్‌స్థాయికి కూడా పెంచడం లేదు. మిర్చి యార్డు కోసం కొత్త మోడల్‌ మార్కెట్‌ను నిర్మించాల్సిన అవసరం ఉంది.


నెల్లికుదురు వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలి : పసుమర్తి శాంతసీతారాములు, మార్కెట్‌ చైర్‌పర్సన్‌, తొర్రూరు 

తొర్రూరు మార్కెట్‌లో క్రయ విక్రయాలు జరుగడం లేదు. మార్కెట్‌ భవనాలు, షెడ్లు ఖాళీగానే ఉంటున్నాయి. కేవలం చెక్‌ పోస్టుమీదనే ఆదాయం గణనీయంగా వస్తోంది. ఆదాయం పరిశీలిస్తే గ్రేడ్‌-1 స్థాయికి మార్కెట్‌ను పెంచాల్సి ఉంది. నెల్లికుదురు వద్ద మరో చెక్‌పోస్టు పెట్టి ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేస్తే ఆదాయం మరింత పెరుగుతుంది. 


సెలక్షన్‌ గ్రేడ్‌స్థాయికి పెంచాలి : మర్రి నారాయణరావు, మార్కెట్‌ చైర్మన్‌, కేసముద్రం 

దేశంలోనే ఈ నామ్‌ అమలు చేస్తూ ప్రధానమంత్రి ఎక్స్‌లెన్సీ అవార్డు దక్కించుకున్నాం. గతేడాది సుమారు రూ.3కోట్ల ఆదాయం వచ్చింది. సెలక్షన్‌ గ్రేడ్‌స్థాయికి మార్కెట్‌ హోదాను పెంచితే మరింత మార్కెట్‌ అభివృద్ధి చెందనుంది.

Updated Date - 2022-08-19T06:08:50+05:30 IST