పరిహారం స్వాహా!

ABN , First Publish Date - 2020-11-23T06:16:49+05:30 IST

ప్రకృతి వైపరీత్యాలు ఈ ఏడాది రైతన్నను కోలుకోలేని దెబ్బ తీశాయి.

పరిహారం స్వాహా!

అధికారపార్టీ నేతల చేతివాటం..

రూ.కోట్ల నిధులు పక్కదారి

అర్హులకు మొండిచెయ్యి

భూమి లేనివారికి పరిహారం పంపిణీ

ఎ.కొండూరు మండలంలోనే రూ.10 లక్షలు స్వాహా

జిల్లావ్యాప్తంగా కోట్లలో అనర్హులకు పరిహారం

అన్నీ తానై చక్రం తిప్పిన అధికార పార్టీ నేత


ప్రకృతి వైపరీత్యాలు ఈ ఏడాది రైతన్నను కోలుకోలేని దెబ్బ తీశాయి. జూలై నుంచి అక్టోబరు వరకు కురిసిన భారీ వర్షాలు కొంత పంటను దెబ్బతీయగా, చేతికొచ్చిందనుకున్న మరికొంత పంటను వరదలు ముంచెత్తాయి. జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో వరి దెబ్బతింది. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పంట నష్టం నమోదులో అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా చలామణి అవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. వారు చెబితే సెంటు భూమి లేని వారి పేరు కూడా పరిహారం జాబితాలోకి చేరిపోతోంది. వారు కాదంటే ఎకరాలకు ఎకరాలు పంటను కోల్పోయిన రైతుల పేర్లు జాబితాలోకే చేరడం లేదనే ఆరోపణలు బలంగా వినవస్తున్నాయి.


(ఆంధ్రజ్యోతి - విజయవాడ/ఎ.కొండూరు)

వర్షాలు, వరదలకు జిల్లావ్యాప్తంగా 29 మండలాల్లోని 86 గ్రామాల్లో వరి పంట దెబ్బతినగా, సుమారు రూ.33 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే అధికార పార్టీ నేతల అండ ఉన్న అనర్హుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ కాగా, అర్హులైన రైతుల పంట నష్టాన్ని నమోదు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అధికార పార్టీ నేతలు పరిహారం పంపిణీలో చేతివాటం చూపారని, కోట్లలోనే పరిహారాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి.


ఎవరి అండా లేకుంటే ఇలా.. 

మచిలీపట్నం మండలం చిన్నాపురానికి చెందిన 400 మంది రైతులకు మాజేరులో వరి పొలాలున్నాయి. ఇటీవల వర్షాలకు పైరు నీట మునిగింది. కంకులకు మొలకెత్తుతున్నాయని, నష్టం అంచనా వేయాలని రైతులు వ్యవసాయశాఖ అధికారులకు విన్నవించుకుంటే 70 శాతం నష్టం జరిగితేనే నమోదు చేస్తామన్నారు. ఆర్డీవో, ఇతర అధికారులు ఆదేశించినా, స్థానిక అధికారుల్లో చలనం లేదు. ‘ఆంధ్రజ్యోతి’ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ఎట్టకేలకు శనివారం పంట నష్టాన్ని నమోదు చేశారు.  


రాజకీయ అండ ఉంటే ఇలా..

ఎ.కొండూరు మండలం రేపూడి గ్రామంలో సెప్టెంబరు - అక్టోబర్లలో వచ్చిన వరదల వల్ల పెద్దగా పంట నష్టం వాటిల్లలేదు. కానీ సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు రాసుకున్నారు. డబ్బులు కూడా చెల్లించేశారు. కాస్తోకూస్తో నష్టపోయిన రైతులు సుమారు 350 మంది ఉన్నారు. వారెవరికీ నయాపైసా నష్ట పరిహారం ఇవ్వలేదు. అర్హులకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. అనర్హులకు పంటనష్ట పరిహారం చెల్లించడంపై స్థానికులు కలెక్టర్‌కు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా స్పందన శూన్యం. రేపూడి గ్రామంలో విప్లవ వాగు పొంగడంతో పక్కనే ఉన్న కొన్ని వరి పొలాలకు స్వల్ప నష్టం వాటిల్లింది. వాగుకు దూరంగా ఉన్న పొలాల్లో మంచి దిగుబడి వచ్చింది. ఆ గ్రామ వ్యవసాయ శాఖ సిబ్బంది, స్థానిక వైసీపీ నాయకుడితో కుమ్మక్కై నష్టపోయిన పేర్లు నమోదు చేశారని, వారిలో అత్యధికంగా ఆ నేత కుటుంబ సభ్యులు, ఫార్మా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల పేర్లు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. భూమి లేనివారికి కూడా పరిహారం అందజేసినట్టు తెలుస్తోంది. వ్యవసాయ, రెవెన్యూ అఽధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా, సుమారు 100 ఎకరాల్లో 49 మంది రైతులకు చెందిన వరి పంట దెబ్బతిన్నదని అంచనాలు తయారుచేసి, సుమారు రూ.10 లక్షల పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదించారు. ఇటీవల ఆ రైతుల ఖాతాల్లో నగదు కూడా జమయింది. దీంతో అర్హులైన రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలకు పరిశీలించకుండా, అర్హులైన రైతులను గుర్తించకుండా, నిధులు స్వాహా చేసినట్టు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.  విప్లవ వాగు పక్కనే మూడు ఎకరాలు సాగు చేస్తున్న ఊటూకూరి వెంకయ్య మాట్లాడుతూ.. వాగు పక్కనే ఉన్న తన మూడెకరాల భూమిలోని పంట ఇటీవల వరదలకు దెబ్బతిన్నదని, కానీ అధికారులు దెబ్బతిన్న తన పొలంలోని పంటను పరిశీలించలేదని తెలిపారు. తన పేరు నమోదు చేయమని కోరగా అధికారులు తిరస్కరించారని, అదే సమయంలో గ్రామంలో సెంటు భూమి లేని వారి పేర్లు కూడా జాబితాలో పెట్టి, పరిహారం అందించారని ఆరోపించారు. 

Updated Date - 2020-11-23T06:16:49+05:30 IST