వార్షికోత్సవంలో మాట్లాడుతున్న నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు
వ్యవసాయ కళాశాల వార్షికోత్సవంలో నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు
వరంగల్ సిటీ, జూన్ 25: విద్యార్థులు సృజనాత్మకతను జోడించి వినూత్న ఆవిష్కరణల వైపుగా అడుగులు వేయాలని, అందుకు పరిశోధనలపై దృష్టి సారించాలని విద్యార్థులకు నిట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణారావు అన్నారు. శనివారం ములుగురోడ్‌లోని వ్యవసాయ కళాశాల 5వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారితమైన దేశం కావడంతో వ్యవసాయదారులకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని, అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ డీన్ డాక్టర్ సీమ, డీన్ ఆఫ్ స్టూడెంట్ ఎఫైర్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ మాట్లాడుతూ... వరంగల్ వ్యవసాయ కళాశాల మొదటి సారే ఏ+గ్రేడ్ సాధించడంతోపాటు ఐకార్(ఐసీఏఆర్) గుర్తింపు సాధించడం ఆనందంగా ఉందన్నారు. కళాశాలలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.బలరామ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి పాల్గొన్నారు.