ఆశలు నీరుగారాయి

ABN , First Publish Date - 2021-11-06T05:52:19+05:30 IST

ఆశలు నీరుగారాయి

ఆశలు నీరుగారాయి

దాళ్వా పంటకు సాగునీటి విడుదల లేనట్టే..

మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ నిర్ణయం

పులిచింతల ప్రాజెక్టు గేట్లకు మరమ్మతుల కారణంగానే..

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : రబీ సీజన్‌లో కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయకూడదని పాలకులు, జిల్లా యంత్రాంగం నిర్ణయించారు. ఈ విషయంపై మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ, పెడన, కైకలూరు, పామర్రు ఎమ్మెల్యేలు విజయవాడలో కలెక్టర్‌ నివాస్‌, నీటిపారుదలశాఖ అధికారులతో గత బుధవారం రాత్రి సమావేశమయ్యారు. రబీలో ఈ ఏడాది సాగునీటి విడుదలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. త్వరలో అధికారికంగా స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పారు.

రైతులకు స్పష్టత

రబీ సీజన్‌కు సాగునీరు విడుదల చేస్తారా లేదా అనే  అంశంపై కొద్దిరోజులుగా రైతులు సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు స్పష్టత రావడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్‌ వరి కోతలు ప్రారంభమయ్యాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ఐదారు రోజులుగా ఆకాశం మబ్బులు కమ్మడంతో ముందస్తుగా వరినాట్లు వేసిన పొలాల్లో రైతులు కోతలను నిలిపివేశారు. వాతావరణం అనుకూలిస్తే వారంలో కోతలు ఊపందుకుంటాయి. కంకిపాడు తదితర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రబీకి  సాగునీటిని విడుదలను నిలిపివేసే నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 

రైతుల విముఖత

రబీలో వరిసాగు (దాళ్వా)పై రైతులు విముఖంగానే ఉన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో రబీలో వరిసాగు వద్దని ఇప్పటికే రైతులు ప్రకటించారు. బుధవారం రాత్రి జరిగిన సమావేశంలో కైకలూరు, పెడన, మచిలీపట్నం ప్రాంతాల్లో వరిసాగుకు నీటిని విడుదల చేయాలనే ప్రతిపాదన వచ్చినా అనుమతించలేదు. గత ఏడాది రబీలో వరి తెగుళ్ల బారిన పడటం, పురుగు మందులు పిచికారీ చేసినా మొవ్వ తెగులు వంటివి అదుపులోకి రాకపోవడం, ధాన్యానికి సరైన మద్దతు ధర లభించకపోవడం, రైతులకు ధాన్యం బిల్లులు మూడు నెలలు ఆలస్యంగా జమ కావడంతో అన్నదాతలు వరిసాగుపై విముఖంగానే ఉన్నారు. బందరు డివిజన్‌లోని పలు పంచాయతీల నుంచి దాళ్వా పంటకు సాగునీరు విడుదల చేయవద్దని  తీర్మానాలు చేసి పంపినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. 

కాల్వల ఆధునికీకరణ జరిగేనా?

ఖరీఫ్‌ సీజన్‌కు వ్యవసాయ పనులు పూర్తవుతాయి. జనవరి నుంచి కాల్వల్లో నీటి విడుదలను నిలిపివేసే అవకాశం ఉంది. వైసీపీ అధికారం చేపట్టిన రెండున్నరేళ్లలో డెల్టా ఆధునికీకరణ పనులను పక్కనే పెట్టేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదు. సుమారు రూ.4వేల కోట్ల విలువైన డెల్టా ఆధునికీకరణ పనులు నిలిచిపోయాయి. జనవరి నుంచి జూలై వరకు దాదాపు ఏడు నెలలు కాల్వలు ఖాళీగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో అవసరమైన ప్రాంతాల్లో కనీస మరమ్మతులైనా చేపడితే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. 


వరి వేస్తే ఉరేనా? : మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ 

కంకిపాడు : దాళ్వాలో వరి వేస్తే ఉరి తీసేలా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. కంకిపాడులోని టీడీపీ మండల కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దాళ్వాలో వరి వేస్తే ఉరేనంటూ నేరుగా ప్రకటించలేని రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులపై ఒత్తిడి తెస్తోందన్నారు. ఎటువంటి ముందస్తు ప్రకటన చేయకుండా దాళ్వాలో వరి వేయకుండా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడమేంటంటూ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి ముఖ్యమంత్రితో మాట్లాడి ఈసారి దాళ్వాలో వరి సాగు చేసేలా అనుమతి తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ దేవినేని రాజా, మాజీ జడ్పీటీసీ గొంది శివరామకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు సుదిమళ్ల రవీంద్ర, టీడీపీ నాయకులు రంజిత్‌, విక్రమ్‌, షేక్‌ బాజీ, డీఎన్నార్‌, వెంకటరమణ, బొప్పూడి శివరామకృష్ణ, అన్నే రామారావు, మన్నే వాసు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-06T05:52:19+05:30 IST