పంట రుణాలు.. 38 శాతమే

ABN , First Publish Date - 2022-09-23T05:52:00+05:30 IST

వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం.. రైతులు ఇబ్బందులు పడకుండా సాగు పెట్టుబడికి అవసరమైన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ఇప్పిస్తాం.. వ్యవసాయ సీజన్‌ ఆరంభంలోనే బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం.. అని ప్రకటించి ఆర్భాటంగా వ్యవసాయ రుణ ప్రణాళికను ఘనమైన లక్ష్యంతో జారీ చేశారు.

పంట రుణాలు.. 38 శాతమే

లక్ష్యం ఘనం.. ఆచరణ నామమాత్రం

వ్యవసాయ రుణ ప్రణాళిక అమల్లో విఫలం

ఖరీఫ్‌ ముగుస్తున్నా స్పందించని బ్యాంకులు

ప్రైవేట్‌ అప్పులపై ఆధారపడుతున్న అన్నదాత

కౌలు రైతులకు మొండిచేయితో అప్పులు పాలు

నరసరావుపేట, సెప్టెంబరు 22:  వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం.. రైతులు ఇబ్బందులు పడకుండా సాగు పెట్టుబడికి అవసరమైన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ఇప్పిస్తాం.. వ్యవసాయ సీజన్‌ ఆరంభంలోనే బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం.. అని ప్రకటించి ఆర్భాటంగా వ్యవసాయ రుణ ప్రణాళికను ఘనమైన లక్ష్యంతో జారీ చేశారు. అయితే ఖరీప్‌ సీజన్‌ ఈ నెలాఖరుతో ముగుస్తున్నా రైతుల గోడు పట్టించుకునే వారే లేరు. పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ఇంకా ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. మరికొందరైతే బ్యాంకుల చుట్టూ తిరిగలేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఖరీఫ్‌ వ్యవసాయ ప్రణాళికలో భాగంగా ఇబ్బడి ముబ్బడిగా పంట రుణాలు ఇస్తామని పాలకులు ప్రకటించారు. అయితే బ్యాంకుల గణాంకాలను పరిశీలిస్తే రుణాల పంపిణీ నామమత్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో లక్ష్యంలో ఇప్పటికి 38 శాతమే పంట రుణాల పంపిణీ జరిగినట్లు తెలుస్తుంది. ఖరీఫ్‌లో 2,745 కోట్లు పంటల రుణాలు లక్ష్యంగా లీడ్‌ బ్యాంకు ప్రకటించింది. ఇప్పటికి 1,064.40 కోట్లు రుణాలు పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ, లీడ్‌ బ్యాంకు లెక్కలు తెలియజేస్తున్నాయి. 1,23,811 మంది రైతులకు పంట రుణాలు పంపిణీ చేసినట్లు సదరు అధికారులు చెబుతున్నారు. అయితే ఖరీఫ్‌ రుణ ప్రణాళికను అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న విమర్శలున్నాయి. కౌలు రైతులకు  అయితే మొక్కుబడిగా రుణాలు పంపిణీ చేశారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కూడా రైతులు, కౌలు రైతులు ప్రైవేట్‌ అప్పులపైనే ఆఽధారపడాల్సి వస్తోంది. అధిక వడ్డీలకు అప్పులు చేసి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నా బ్యాంకులు, అధికారులు పట్టీపట్టనట్లుగా ఉంటున్నారు. రైతులు నూటికి రెండు రూపాయలు అంతకన్నా అధిక వడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తున్నా పంటలకు ఇంకా రెండు నెలల వరకు పెట్టు బడుల అవసరం ఉంటుంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ప్రణాళిక మేర బ్యాంకుల నుంచి రుణాలు అందించేందుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. 

బంగారం తనఖా ద్వారానే రుణాలు

ఈ నెలాఖరుతో ముగిసే  ఖరీప్‌ సీజన్‌కు సంబంధించి పంట రుణాలు అందక రైతులు అల్లాడుతున్నారు. పంటలకు నేరుగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఇష్టపడటంలేదు. బంగారం తనఖా ద్వారా మాత్రం పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఆశక్తి చూపుతున్నాయి. దీంతో ఈ ఏడాది బంగారం తనఖా ద్వారా బ్యాంకుల్లో రుణాలు పెరిగినట్లు సమాచారం. జిల్లాలో పత్తి, కంది, వరి మిరప సాగు విస్తృతంగా చేపట్టారు. 7.12 ఎకరాల్లో పంట సాగు లక్ష్యంగా వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇప్పటికే సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అయితే ఆ మేరకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు విఫలమయ్యాయి. 

కౌలు రైతులకు తప్పని కష్టాలు

జిల్లాలో 1.61 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా. వీరిలో కేవలం 38.946 మంది కౌలు రైతులకు సీసీఆర్‌ కార్డులు పంపిణీ చేశారు. కార్డులు ఉన్నా కూడా కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందని ద్రాక్ష చందాన ఉన్నాయి. కౌలు రైతులకు ఈ ఏడాది పెద్దఎత్తున రుణాలు ఇస్తామని చెప్పిన మాటలు అమలుకు నోచుకోలేదు. ఎంత మంది కౌలు రైతులకు రుణాలు ఇచ్చారో ఇందుకు సంబంధించిన లెక్కలు కూడా సంబంధిత అధికారులు చెప్పలేకపోతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

26న కలెక్టర్‌ సమీక్ష

ఈ నెల 26న కలెక్టర్‌ అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం జరగనున్నదని, పంట రుణాల పంపిణీపై సమీక్షించనున్నట్లు లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. రుణ ప్రణాళిక లక్ష్యం మేర ఇంకా రూ.1,681 కోట్లు రైతులకు రుణాలు పంపిణి చేయాల్సి ఉందన్నారు.  


Updated Date - 2022-09-23T05:52:00+05:30 IST