Munugodu BJP: మునుగోడులో అమిత్ షా సభ వాయిదా పడే అవకాశం.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-08-13T02:02:15+05:30 IST

తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక (Munugodu By Poll) హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి. బీజేపీ (BJP) నుంచి..

Munugodu BJP: మునుగోడులో అమిత్ షా సభ వాయిదా పడే అవకాశం.. కారణం ఏంటంటే..

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక (Munugodu By Poll) హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి. బీజేపీ (BJP) నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy) పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌కు (Congress), ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అమిత్ షా (Amit Shah) సమక్షంలో మునుగోడులో (Munugodu) భారీ బహిరంగ సభ సాక్షిగా బీజేపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే.. అమిత్ షా సభ వాయిదా పడే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ (Telangana BJP) వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల 21న మునుగోడులో బీజేపీ నిర్వహించ తలపెట్టిన అమిత్ షా సభపై స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణం. బీజేపీ ముఖ్య నేతలతో రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమావేశం అయినప్పటికీ.. కేంద్ర హోంశాఖ ఇంకా సమయం ఇవ్వలేదు. దీంతో.. అమిత్ షా సభ వాయిదా పడే అవకాశముందని బీజేపీ వర్గాల సమాచారం. ఇదే అంశాన్ని రాష్ట్ర నేతలకు తరుణ్ చుగ్ కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో.. ఈ నెల 29న అమిత్ షా సభ నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నట్లు సమాచారం.



ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికకు ఒక రకంగా సూత్రధారి బీజేపీయే. ఒక వ్యుహం ప్రకారం దక్షిణ తెలంగాణలో పాగా వేసేందుకే మునుగోడును బీజేపీ కార్యక్షేత్రంగా చేసుకుంది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, అది ఆమోదించే నాటికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ యాత్ర మునుగోడుకు చేరుకునేలా ప్లాన్‌ చేశారు. ఆ నియోజవర్గ పరిధిలోని చౌటుప్పల్‌లో సభ నిర్వహించారు. అమిత్‌ షా నుంచి బండి సంజయ్‌ వరకు ఇప్పుడు అందరూ దృష్టి మునుగోడు పైనే కేంద్రీకరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ కాషాయ జెండా రెపరెపలాడించేందుకు అవసరమైన అన్ని హంగులతో కమలదళం రంగంలోకి దిగింది.



ఉప ఎన్నిక బీజేపీ అధిష్ఠానంతో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయ జీవితానికి సవాల్‌గా మారడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనులకు శ్రీకారం చుట్టారు. బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్‌, వివేక్‌, జితేందర్‌రెడ్డి కీలక బాధ్యతలు తీసుకోనున్నారు. రాజేందర్‌ అత్తగారి ఊరు మునుగోడు మండలం పలివెల. ఈగ్రామం కేంద్రంగానే తన కార్యకలాపాలు నిర్వహించేందుకు రాజేందర్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతను మాజీ ఎంపీ వివేక్‌కు అప్పగించాల్సిందిగా రాజగోపాల్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర నేతలను కోరారు. ఎన్నికల నిర్వహణలో దిట్టగా పేరొందిన మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి త్వరలో మునుగోడులో మకాం వేయనున్నారు. ఈ ముగ్గురితోపాటు మరో ఇద్దరితో కీలక కమిటీని త్వరలో బీజేపీ ఖరారు చేయనున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-08-13T02:02:15+05:30 IST