ఇస్లామాబాద్‌లో సెక్షన్ 144 అమలు

ABN , First Publish Date - 2022-04-03T17:41:14+05:30 IST

పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై

ఇస్లామాబాద్‌లో సెక్షన్ 144 అమలు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో ఆదివారం సెక్షన్ 144 నిబంధనలను జిల్లా యంత్రాంగం అమలు చేస్తోంది. ద్విచక్ర వాహనాలపై వెనుక సీటులో కూర్చుని ప్రయాణించడాన్ని నిషేధించింది. హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. 


పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఆదివారం జరుగుతుంది. ఆదివారం ఉదయం 11.55 గంటల ప్రాంతంలో ప్రతిపక్ష సభ్యులు నేషనల్ అసెంబ్లీకి చేరుకోవడం ప్రారంభమైంది. పార్లమెంటు హౌస్ వద్ద పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. పాకిస్థాన్ ప్రతిపక్షాలతో అమెరికా కుమ్మక్కయిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఓ మెమోను కూడా ఆయన పంచిపెట్టారు. తాను అనుసరించిన విదేశాంగ విధానాలు తరచూ రష్యా, చైనాలకు అనుకూలంగా ఉండటంతో అమెరికా తనను పదవీచ్యుతుడిని చేయాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. 


ఇదిలావుండగా, అవిశ్వాస తీర్మానంపై గెలుపు తమదేనని ప్రతిపక్షాలు ధీమాగా ఉన్నాయి. అధికార కూటమిలోని పక్షాలు ఇమ్రాన్ ఖాన్‌ను వదిలిపెట్టడంతో ఆయనను పదవీచ్యుతుడిని చేయడం ఇక లాంఛనమేనని చెప్తున్నాయి. 


నేషనల్ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ నెగ్గాలంటే కనీసం 172 ఓట్లు అవసరం. అయితే తమకు 175 మంది సభ్యుల మద్దతు ఉందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. 


Updated Date - 2022-04-03T17:41:14+05:30 IST