అహ్మదాబాద్ సీరియల్ పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరిశిక్ష

ABN , First Publish Date - 2022-02-18T17:28:13+05:30 IST

అహ్మదాబాద్ సీరియల్ పేలుళ్ల కేసులో గుజరాత్ ప్రత్యేక కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది....

అహ్మదాబాద్ సీరియల్ పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరిశిక్ష

గుజరాత్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు

అహ్మదాబాద్ : అహ్మదాబాద్ సీరియల్ పేలుళ్ల కేసులో గుజరాత్ ప్రత్యేక కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. వరుస పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ఉరి శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పు చెప్పింది. ఈ పేలుళ్ల కేసుల్లో నిందితులైన మరో 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. భారతదేశంలో ఒక్క పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష విధించడం మొట్టమొదటిసారి. గుజరాత్ సీరియల్ పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే సంచలనం రేపింది.  2008వ సంవత్సరం జులై 26వతేదీన 70 నిమిషాల వ్యవధిలో అహ్మదాబాద్‌లో జరిపిన వరుస బాంబు పేలుళ్లలో 56 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. 


13 ఏళ్ల తర్వాత ప్రత్యేక కోర్టు తీర్పు


13 ఏళ్ల తర్వాత ప్రత్యేక కోర్టు గత వారం 49 మందిని దోషులుగా, 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.భారతీయ శిక్షాస్మృతి, ఉపా, పేలుడు పదార్థాల చట్టం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితులను దోషులుగా నిర్ధారించారు. ఆయుధ చట్టం కింద ఒక నిందితుడిని కూడా దోషిగా నిర్ధారించారు.ఐపీసీలోని ఇతర సెక్షన్లు 302 (హత్య), 307 (హత్య ప్రయత్నం), 121 (ఎ)  124 (ఎ) (విద్రోహం) కింద నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో 77 మంది నిందితులపై విచారణను కోర్టు ముగించింది. విచారణలో ఉన్న 78 మంది నిందితుల్లో ఒకరు అప్రూవర్‌గా మారారు.నిషేధిత స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి)కి చెందిన తీవ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం)తో సంబంధమున్న వ్యక్తులే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. 




గోద్రా అల్లర్లకు ప్రతీకారం తీర్చుకునేందుకే పేలుళ్లు

2002 గోద్రా అల్లర్ల అనంతరం ప్రతీకారం తీర్చుకునేందుకు ఐఎం ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లు జరిగిన కొన్ని రోజుల తర్వాత పోలీసులు సూరత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి బాంబులను స్వాధీనం చేసుకున్నారు. బాంబుల స్వాధీనంపై అహ్మదాబాద్‌లో 20, సూరత్‌లో 15 కేసులు నమోదు చేశారు.స్పెషల్ కోర్టు మొత్తం 35 ఎఫ్‌ఐఆర్‌లను విలీనం చేసిన తర్వాత విచారణ జరిపింది.

Updated Date - 2022-02-18T17:28:13+05:30 IST