భూ దందాను సీబీఐతో విచారణ చేయించాలి : సంపత్

ABN , First Publish Date - 2021-05-07T23:01:57+05:30 IST

పేదల భూములపై అధికార టీఆర్‌ఎస్ నేతలు గద్దల్లా వాలుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్

భూ దందాను సీబీఐతో విచారణ చేయించాలి : సంపత్

హైదరాబాద్: పేదల భూములపై అధికార టీఆర్‌ఎస్ నేతలు గద్దల్లా వాలుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కేబినెట్‌లో 12 మంది మంత్రులపై భూకబ్జా ఆరోపణలున్నాయని, టీఆర్‌ఎస్ పాలనలో 7 లక్షల ఎకరాలు కబ్జా అయినట్లు రియల్టర్ల అసోసియేషన్ ఆరోపించిందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నేతల భూకబ్జాలపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ శుక్రవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జన్వాడలో 111(జీ) లో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ ఫాంహౌజ్ కట్టుకున్నారని, దేవరాయాంజల్ లో కూడా వివాదాస్పద భూములను కేటీఆర్ కొనుక్కొన్నారని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి తన కాలేజీలను కూడా అనుమతులు లేకుండా నిర్మించారని, అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు. వీరిద్దరితో పాటు మరో మంత్రి గంగుల కమలాకర్ కాజిపూర్ సర్వే నెం 126 లో వక్ఫ్‌బోర్డు భూములను కబ్జా చేశారని, మంత్రి పువ్వాడ అజయ్ కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని తన మెడికల్ కాలేజీలో కలుపుకున్నారని సంపత్ ఆరోపించారు. 


పార్టీ ఫిరాయించినందుకే ఆయనకు సర్వే నెంబర్ 58,59 లో కోట్లు విలువ చేసే భూమిని నజరానాగా ఇచ్చారని అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి పెబ్బేరు, కొత్తపేట గ్రామాల్లో భూములను ఆక్రమించారని, మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని, ఎర్రబెల్లి, ఇంద్రకరణ్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయని వివరించారు. ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణం సర్వే 1309 లో 5 ఎకరాలను ఆక్రమించారని, ఇవేవీ కూడా సీఎంకు కనిపించడం లేదా? అని సంపత్ నిలదీశారు. మంత్రుల భూ ఆక్రమణలపై విచారణ జరగాలని, నిజాలు నిగ్గుతేల్చాలని పేర్కొన్నారు. సీబీఐతో గానీ, సెంట్రల్ విజిలెన్స్‌తో గానీ ప్రభుత్వం విచారణ జరిపించాలని సంపత్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-05-07T23:01:57+05:30 IST