Jayalalithaa Death Case: జయలలిత చికిత్సలో లోపాలు లేవు.. తేల్చేసిన ఎయిమ్స్

ABN , First Publish Date - 2022-08-21T23:42:51+05:30 IST

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa)కు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రికి ఇది ఊరటనిచ్చే

Jayalalithaa Death Case: జయలలిత చికిత్సలో లోపాలు లేవు.. తేల్చేసిన ఎయిమ్స్

న్యూఢిల్లీ: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa)కు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రికి ఇది ఊరటనిచ్చే విషయమే. ఆమెకు అందించిన చికిత్స విషయంలో ‘ఎలాంటి తప్పులు’ జరగలేదని, సరైన వైద్య విధానం ప్రకారమే ఆమెకు చికిత్స అందిందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ప్యానెల్ తన నివేదికలో స్పష్టం చేసింది. జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న అరుముగస్వామి కమిషన్‌ (Arumughaswamy Commission)కు సాయం అందించేందుకు ఎయిమ్స్ ప్యానెల్‌ను సుప్రీంకోర్టు నియమించింది. 


జయలలితకు ఆరోగ్యానికి సంబంధించిన ఫైనల్ డయాగ్నసిస్, టైమ్‌లైన్ ఈవెంట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన ప్యానల్.. అపోలో ట్రీట్‌మెంట్, డయాగ్నిసిస్‌తో పూర్తిగా ఏకీభవించింది. డిసెంబరు 2016లో జయలలిత మరణించారు. ఆ తర్వాత ఆమె మరణంపై రాజకీయాలు ఊపందుకున్నాయి. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమెకు అందించిన చికిత్సపై పలు పార్టీలు అనుమానం వ్యక్తం చేశాయి. దీంతో జయ మరణంపై విచారణ జరిపించాల్సిందిగా అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం చేసిన విజ్ఞప్తితో అరుముగస్వామి కమిషన్ ఏర్పాటైంది. 


నవంబరు 2017 నుంచి కమిషన్ పని ప్రారంభించింది. జయలలిత సన్నిహితులను, ఆమెకు చికిత్స అందించిన వైద్యులను, అప్పటి తమిళనాడు ఆరోగ్యమంత్రి విజయభాస్కర్, అప్పటి ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, ఆర్థిక మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఒ. పన్నీర్‌సెల్వం తదితరులను విచారించింది. మొత్తంగా 157 మంది కమిషన్ ఎదుట హాజరై జయలలిత మరణానికి సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించారు.


విచారణ కొనసాగుతుండగానే 2019లో అపోలో ఆసుపత్రి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి విచారణపై మధ్యంతర స్టే ఇవ్వాలని కోరింది. అయితే, పిటిషన్‌లో అపోలో ఆసుపత్రి లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చి పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో మద్రాస్ హైకోర్టు ఆర్డర్‌ను అపోలో ఆసుపత్రి సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పరిశీలించిన సుప్రీంకోర్టు.. జయలలితకు అందించిన చికిత్సను అర్ధం చేసుకునే విషయంలో అరుముగస్వామి కమిషన్‌కు తోడ్పానందించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఎయిమ్స్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. 


అపోలో మెడికల్ రిపోర్ట్స్‌‌ను పరిశీలించిన ప్యానల్ .. హార్ట్ ఫెయిల్యూర్ అయినట్టు కూడా గుర్తించింది ఆమె ఆసుపత్రిలో చేరినప్పటికే మధుమేహం నియంత్రించలేని స్థితిలో ఉందని, దానికి చికిత్స అందించారని కమిషన్ గుర్తించింది. దీనికితోడు హైపర్‌టెన్షన్, హైపర్‌థైరాయిడ్, ఆస్థమా, ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్, అటోపిక్ డెర్మాటిటిస్ ఉన్నాయని ప్యానెల్ గుర్తించింది. అపోలో ఫైనల్ డయాగ్నసిస్‌తో తాము పూర్తిగా ఏకీభవించినట్టు ఎయిమ్స్ ప్యానల్ స్పష్టం చేసింది. 


Updated Date - 2022-08-21T23:42:51+05:30 IST