చైర్మన్‌ గురిపై గురి

Published: Sat, 22 Jan 2022 00:46:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చైర్మన్‌ గురిపై గురిఆదిలాబాద్‌లోని డీసీసీబీ కార్యాలయం ఇదే..

డీసీసీబీ పీఠం ఎవరికి దక్కేను? 

చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

కాంబ్లె నాందేవ్‌ మరణంతో ఏర్పడిన ఖాళీ

ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న మంత్రి అల్లోల, మాజీ మంత్రి జోగు రామన్న

అధిష్ఠానం పెద్దల వద్దకు ఆశావహుల పరుగులు

ఉమ్మడి జిల్లాలో మళ్లీ హీటెక్కిన రాజకీయాలు

ఆదిలాబాద్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 31న చైర్మన్‌ ఎన్నికను చేపట్టేందుకు రాష్ట్ర కోఆపరేటివ్‌ సొసైటీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గతంలో చైర్మన్‌గా పని చేసిన కాంబ్లె నాందేవ్‌ గతేడు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో చైర్మన్‌ స్థానం ఖాళీ ఏర్పడింది. అప్పటి నుంచి వైస్‌ చైర్మన్‌ రఘునందన్‌రెడ్డి ఇన్‌చార్జి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఈనెల 28న ఖాళీ ఏర్పడిన ఎస్సీ డైరెక్టర్‌ స్థానం కోసం నామినేషన్లను స్వీకరించి, పోటీ అనివార్యమైతే 31న ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మొత్తం ఏ-క్లాస్‌ 16 డైరెక్టర్‌ స్థానాలు, బి-క్లాస్‌ 4 డైరెక్టర్‌ స్థానాలు కలిపి మొత్తం 20 మంది డైరెక్టర్లు చైర్మన్‌ ఎన్నికల్లో పాల్గొంటారు. నాందేవ్‌ మరణంతో ఒకస్థానం ఖాళీ ఏర్పడడంతో ప్రస్తుతం 15 ఏ-క్లాసు డైరెక్టర్లున్నారు. ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి పూర్తిస్థాయిలో మెజార్టీ ఉంది. దీంతో పార్టీ అధిష్ఠానం సూచించిన డైరెక్టరే చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ విడుదల కావడంతో మళ్లీ ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కుతున్నాయి. అయితే చైర్మన్‌ పదవి ఎవరికి దక్కుతుందోనన్న చర్చ జోరుగానే సాగుతోంది. 

ఆదిలాబాద్‌కే చైర్మన్‌ పదవి?

గతంలో డీసీసీబీ చైర్మన్‌ పదవిని ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన డైరెక్టర్‌కే కేటాయించారు. వైస్‌ చైర్మన్‌ పదవి నిర్మల్‌ జిల్లాకు దక్కింది. అలాగే డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను మంచిర్యాల, ఆసిపాబాద్‌ జిల్లాలకు చెందిన వారికి కేటాయించారు. ఇలా సామాజిక వర్గాల వారీగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల కేటాయింపు జరిగింది. ఈసారి కూడా ఇదే మాదిరిగా కేటాయిస్తే ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన డైరెక్టర్‌కు చైర్మన్‌ పదవి దక్కే అవకాశాలున్నాయి. అయితే ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పదవిని తమ గుప్పిట్లో పెట్టకునేందుకు సీనియర్‌ నేతలు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్నలు ఈ విషయాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. తమ దగ్గరి అనుచరులకు చైర్మన్‌ పదవి దక్కేలా అధిష్ఠానం పెద్దల వద్ద ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలోనే ఎవరూ ఊహించని రీతిలో పార్టీ అధిష్ఠానం చైర్మన్‌ అభ్యర్థిని ఎంపిక చేసింది. దీంతో ఈసారి పక్క ప్లాన్‌తో ముందుకెళ్తున్న ట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నిర్మల్‌ జిల్లాకు కీలకమైన మంత్రి పదవి ఉండడంతో డీసీసీబీ చైర్మన్‌ పదవిని ఆదిలాబాద్‌ జిల్లాకే కేటాయించే 

  అవకాశాలు మెండుగానే ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

బరిలో నలుగురు డైరెక్టర్లు

డీసీసీబీ చైర్మన్‌ బరిలో నలుగురు డైరెక్టర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆదిలాబాద్‌కు చెందిన ప్రస్తుత రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, బాలూరి గోవర్ధన్‌రెడ్డి, దుర్గం రాజేశ్వర్‌లతో పాటు నిర్మల్‌ జిల్లాకు చెందిన ప్రస్తుత ఇన్‌చార్జి చైర్మన్‌ రఘునందన్‌రెడ్డి కూడా చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో చివరివరకు ప్రయత్నాలు చేసిన భోజారెడ్డికి పదవి దక్క లేదు. అప్పట్లో నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నేతలు పట్టుబట్టడంతో అధిష్ఠానం మరో డైరెక్టర్‌ను చైర్మన్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం భోజారెడ్డికి జిల్లా ఎమ్మెల్యేలతో పాటు పలువురు జడ్పీ చైర్మన్ల మద్దతు ఉన్న ట్లు తెలుస్తుంది. అలాగే బాలూరి గోవర్ధన్‌రెడ్డికి అధిష్ఠానం పెద్దల ఆశీస్సులు ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ప్రస్తుత ఇన్‌చార్జి చైర్మన్‌ రఘునందన్‌రెడ్డికి మంత్రి అల్లోల అండదండలు ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరో సీనియర్‌ నాయకుడు దుర్గం రాజేశ్వర్‌ కూడా పదవిని ఆశిస్తున్నారు. అయితే బి-క్లాస్‌ డైరెక్టర్‌గా ఎన్నికైన దుర్గం రాజేశ్వర్‌ చైర్మన్‌ పదవికి అర్హత ఉంటుందో? లేదో?నన్న స్పష్టత లేదంటున్నారు. నోటిఫికేషన్‌ విడుదల కావడంతో చైర్మన్‌ పదవిని ఆశిస్తున్న వారంతా హైదరాబాద్‌ బాట పట్టారు. తమ గాడ్‌ఫాదర్‌ల ద్వారా అధిష్ఠానం పెద్దల ఆశీస్సులు పొందేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లు, సీనియర్‌ నేతల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

రఘునందన్‌రెడ్డి కొనసాగింపు లేనట్లే..

డీసీసీబీ మాజీ చైర్మన్‌ కాంబ్లె నాందేవ్‌ మరణం తర్వాత వైస్‌ చైర్మన్‌ రఘునందన్‌రెడ్డినే పూర్తికాలం చైర్మన్‌గా కొనసాగిస్తారన్న ప్రచారం ఇన్నాళ్లు జోరుగా సాగింది. అయితే తాజాగా చైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో ఆయన కొనసాగింపు ఉండదన్నట్లుగా స్పష్టమవుతోంది. ఒకవేళ ఆయననే చైర్మన్‌గా కొనసాగించాల్సి ఉంటే ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. పూర్తిస్థాయి చైర్మన్‌ పదవిని ఇతర డైరెక్టర్‌కు అప్పగించేందుకే అధి ష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది. ఇకపై రఘునందన్‌రెడ్డి వైస్‌ చైర్మన్‌ పదవిలోనే కొనసాగుతారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే చివరివరకు ఎలాంటి మార్పులు, చేర్పులు జరుగుతాయో? చెప్పలేమన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 

ఎన్నిక ప్రక్రియ ఇలా..

ఈనెల 28న ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2గంట ల నుంచి 4గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఎన్నిక అని వార్యమైతే 31న ఉదయం 9నుంచి ఒంటి గంట వరకు ఎన్నికలు జరుపుతారు. ఆ తర్వాత మరుసటి రోజు ఫలితాలను వెల్లడిస్తారు. అయితే ఎస్సీ  డైరెక్టర్‌ స్థానం ఏకగ్రీవమైతే 29న చైర్మన్‌ ఎన్నికను జరిపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాల వారీగా డైరెక్టర్ల వివరాలిలా..      

జిల్లాపేరు             ఏ-క్లాసు డైరెక్టర్లు     బి-క్లాసు డైరెక్టర్లు

ఆదిలాబాద్‌ జిల్లా          05                       03

నిర్మల్‌ జిల్లా       06                       0

మంచిర్యాల జిల్లా       03                       01

ఆసిఫాబాద్‌ జిల్లా       02                       0

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.