Advertisement

హస్తినపై గురి!

Sep 13 2020 @ 01:30AM

రాజకీయ నాయకులపై పెండింగులో ఉన్న కేసులను సత్వరమే విచారించడానికి వీలుగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపై విచారణను ఏడాదిలోగా పూర్తిచేసి జైలుకు పంపాల్సిన వాళ్లను పంపుతామని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆరేళ్లుగా ఈ విషయాన్ని ఆయన మరిచిపోయారు. తాజాగా తన పిటిషన్‌పై విచారణ జరపాల్సిందిగా అశ్వనీకుమార్‌ సుప్రీంకోర్టును కోరడాన్ని బట్టి, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి భరతం పట్టడానికి ప్రధాని మోదీ సిద్ధపడుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. బీజేపీకి చెందిన కొంతమంది నాయకులకు కూడా శిక్ష పడవచ్చు. అయితే రాజకీయాలను ప్రక్షాళన చేశామన్న కీర్తిని మాత్రం సొంతం చేసుకోవచ్చుననేది ప్రధాని మోదీ ఆలోచనగా ఉన్నట్లు భావించవచ్చు.


జాతీయ పార్టీ విషయంలో కేసీఆర్‌ ఆలోచనలు ఇంకా కార్యరూపం సంతరించుకోకపోయినా ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు.దీనికి రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మొదటిది.. కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి వీలుగా తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవడం కాగా, రెండవది.. భారతీయ జనతాపార్టీ నుంచి ఎదురుకానున్న సవాళ్లను ఎదుర్కోవడం. కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తామనీ, జైలుకు పంపుతామనీ బీజేపీ నేతలు తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ హెచ్చరికలను ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. ఆ పార్టీ వ్యూహాలను ముందుగా పసిగట్టడం వల్లనే ఆయన జాతీయ రాజకీయాల ప్రతిపాదన తెర మీదకు తెచ్చారని భావించవచ్చు. బీజేపీ వల్ల ఎదురుకాబోయే ముప్పు నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఇతర ప్రాంతీయపార్టీల నాయకుల మద్దతు కూడగట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం కానున్నారని, నయా భారత్‌ పార్టీ పేరిట జాతీయ పార్టీ పెట్టబోతున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’లో వార్త వచ్చింది. కేసీఆర్‌ ఆలోచనలు ఒక రూపం సంతరించుకునే ముందు ఇలాంటి వార్తలు వస్తుంటాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ కేసీఆర్‌ చేసిన హడావిడిని మనం చూశాం. పశ్చిమ బెంగాల్‌, ఒడిసా ముఖ్యమంత్రులతో పాటు తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలిసి వారితో భోజనం చేసి రాజకీయ ముచ్చట్లు జరిపారు కూడా. అయితే ఆ ప్రతిపాదన పురిట్లోనే ఆగిపోయింది. ఇప్పుడు నయా భారత్‌ పేరిట కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుచేయడానికి సంబంధించి కేసీఆర్‌ స్వయంగా ప్రకటించకపోయినా, మీడియాకు తెలిసేలా చేశారు. జాతీయ పార్టీ విషయంలో ఆయన ఆలోచనలు ఇంకా కార్యరూపం సంతరించుకోకపోయినా.. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. దీనికి రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మొదటిది.. కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి వీలుగా తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవడం కాగా, రెండవది.. భారతీయ జనతాపార్టీ నుంచి ఎదురుకానున్న సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా ఆయన ఇటువంటి ఆలోచన చేస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భారతీయ జనతాపార్టీ ఇటీవలి కాలంలో తన దూకుడును పెంచింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ మధ్య కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తామనీ, జైలుకు పంపుతామనీ తరచుగా ప్రకటనలు చేస్తున్నారు.


ఈ హెచ్చరికలను ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్‌ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక కేంద్రంపై యుద్ధమే అన్నట్టుగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఈ మధ్య ప్రకటించారు. దీన్ని బట్టి బీజేపీ వ్యూహాలను ముందుగా పసిగట్టడం వల్లనే ఆయన జాతీయ రాజకీయాల ప్రతిపాదన తెర మీదకు తెచ్చారని భావించవచ్చు. లోక్‌సభ ఎన్నికలు జరిగిన నాటి నుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తమకు కనీసం మూడు స్థానాలైనా కేటాయించాలని అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా స్వయంగా కేసీఆర్‌ను ఒకటికి రెండు సార్లు ఫోన్‌ చేసి అడిగారు. ఇందుకు కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో బీజేపీ తెలంగాణలో తన వ్యూహాన్ని మార్చుకుంది. కేసీఆర్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి ఆ పార్టీ నిర్ణయించుకుంది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులలో భారీగా అవినీతి జరుగుతోందని బీజేపీ నాయకులు ఇటీవల విమర్శలు చేయడం మొదలుపెట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఒక సందర్భంలో.. తెలంగాణ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి కమీషన్లు తీసుకుంటోందని వ్యాఖ్యానించారట. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరికించడానికి అవసరమైన సమాచారాన్ని బీజేపీ అధినాయకత్వం సేకరించినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌పై ఫిర్యాదు చేయడానికి వస్తున్న తెలంగాణ నాయకులను ఉద్దేశించి– ‘‘మీ వద్ద ఉన్న సమాచారాన్ని సంబంధిత ఏజెన్సీలకు ఇవ్వండి.


నేరుగా మాకు ఇవ్వడం వల్ల లాభం లేదు. అవసరాన్ని బట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించండి’’ అని బీజేపీ కేంద్ర పెద్దలు సూచించారని చెబుతున్నారు. కేసీఆర్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని భారతీయ జనతాపార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఆధారాలు సేకరించగలిగితే లక్ష్యం నెరువేరుతుందని వారు భావిస్తున్నారు. తాము భావిస్తున్నట్టు సీబీఐ విచారణకు న్యాయస్థానం ఆదేశిస్తే.. ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేయవలసి వస్తుందనీ, అప్పుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తారనీ, అదే జరిగితే పార్టీలో చీలికను ప్రోత్సహించాలన్నది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. చీలిక వర్గంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జెండా ఎగురవేయాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఈ ఆలోచనలను పసిగట్టడం వల్లనే జాతీయ రాజకీయపార్టీ ఆలోచనను కేసీఆర్‌ తెర మీదకు తెచ్చి ఉంటారు. బీజేపీ నుంచి ఎదురుకాబోయే ముప్పు నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఇతర ప్రాంతీయపార్టీల నాయకుల మద్దతు కూడగట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా తనపై విచారణ జరిపించాలన్న బీజేపీ ఆలోచన కార్యరూపం దాల్చకముందే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయాలని కేసీఆర్‌ తలపోస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు భావిస్తున్నాయి. తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొంటానని కేసీఆర్‌ చాలాకాలంగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించాక.. తాను తొలి ముఖ్యమంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం, రైతుబంధు పథకం అమలుచేయడంతో పాటు యాదాద్రి నిర్మాణం పూర్తి చేశానన్న సంతృప్తితో అధికారం నుంచి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఇక తాను చేయగలిగింది, చేయాల్సింది ఏమీ లేదు కనుక ప్రజల్లో తన పరపతి పతాక స్థాయిలో ఉన్నప్పుడే అధికారం నుంచి తప్పుకొంటే తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవచ్చునని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారట.


అదే సమయంలో రాజకీయంగా తాను బలంగా ఉన్నప్పుడే.. కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే ఒడిదుడుకులు ఎదురైనా అడ్డుకోవడానికి తాను ఉంటానని ఆయన నమ్ముతున్నట్టుగా ఉంది. బీజేపీ నాయకులు భావిస్తున్నట్టుగా నిజంగా తనపై విచారణ జరిగి, ఆ కారణంగా రాజీనామా చేయాల్సి వస్తే అది తలవొంపుగా ఉంటుంది. కనుక వీలైనంత త్వరగా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనకు కేసీఆర్‌ వచ్చినట్టు చెబుతున్నారు. యాదాద్రిలో యాగం నిర్వహించిన తర్వాత లేదా నూతన సచివాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం ఖాయమని చెబుతున్నారు. నిజానికి కేటీఆర్‌ ఇప్పటికే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రుల పర్యటనల సందర్భంగా మంత్రులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో.. ఇప్పుడు కేటీఆర్‌ జిల్లాల పర్యటన సందర్భంగా అలాంటి ఏర్పాట్లే చేస్తున్నారు! అయితే ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేస్తే జాతీయ రాజకీయాల్లో ప్రొటోకాల్‌ సమస్య ఉత్పన్నమవుతుందని టీఆర్‌ఎస్‌ నాయకులు భావిస్తున్నారు. దీన్ని అధిగమించడం కోసం రాజ్యసభకు వెళ్లడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కుదురుకోవచ్చని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఎప్పుడు అనేదే ఇప్పుడు తెలంగాణలో మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఒకరినొకరు ఇరుకునపెట్టడం కోసం ఇటు కేసీఆర్‌, అటు బీజేపీ పెద్దలు వేస్తున్న ఈ ఎత్తుగడలలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. తెలంగాణ విషయం అలా ఉంచితే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా రాజకీయంగా బలపడటానికి బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. మతపరమైన భావోద్వేగాలను ప్రోత్సహించడం ద్వారా ఓటుబ్యాంకును అభివృద్ధి చేసుకోవడం కోసం ఆ పార్టీ పావులు కదుపుతోంది. అంతర్వేదిలో స్వామివారి రథం కాలిపోయిన దుర్ఘటనను ఆసరాగా చేసుకుని హిందువుల మనోభావాలను తమకు అనుకూలంగా మలచుకోవడం కోసం ఇప్పటికే రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలు, క్రైస్తవులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటున్నారు. మిగతా వర్గాలవారు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఈ కారణంగా బీజేపీకి ఓటుబ్యాంకు అంటూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మత ప్రాతిపదికన బలపడాలని బీజేపీ యోచిస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కులాల కుంపట్లు మండుతున్నాయి. ఇకపై రాష్ట్ర ప్రజలు మతపరంగా కూడా విడిపోతే ఆ రాష్ట్రం మరింత నష్టపోతుంది. రాజకీయాల్లో ఎవరి ప్రయోజనాలు వారికి ముఖ్యం కనుక విశాల ప్రయోజనాలకు తావుండదు. సమాజాన్ని మతపరంగా విడదీయగలిగితే తెలుగుదేశం పార్టీని కూడా దెబ్బతీయవచ్చని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తన బలాన్ని కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ఎటువంటి వ్యూహం అనుసరిస్తుందో వేచిచూడాలి.


నేతల భరతం పట్టేనా?

ఈ రాజకీయ క్రీడలను కాసేపు పక్కన పెడితే, ఆర్థికపరమైన నేరాలతోపాటు ఇతర క్రిమినల్‌ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న రాజకీయుల భరతం పట్టడానికి కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్న అశ్వనీకుమార్‌ అనే ఆయన 2015లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. రాజకీయ నాయకులపై నమోదైన కేసులలో విచారణ పూర్తికావడానికి ఏళ్లకు ఏళ్లు పడుతోందనీ, ఈ కారణంగా నేరస్థులు దర్జాగా పదవులు అనుభవిస్తున్నారనీ, ఈ పరిస్థితి పోవాలంటే సదరు కేసులను నిర్దిష్ట కాలపరిమితి లోపు పరిష్కరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలనీ ఆయన తన పిటిషన్‌లో కోరారు. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఈ పిటిషన్‌పై విచారణలో కదలిక వచ్చింది. తర్వాత ఆయన పదవీ విరమణ చేయడం, ఐదారు నెలలుగా కొవిడ్‌ కారణంగా ఈ పిటిషన్‌లో కదలిక లేకుండా పోయింది. అయితే ఇటీవలే అశ్వనీకుమార్‌ తన పిటిషన్‌ను పరిష్కరించవలసిందిగా న్యాయస్థానాన్ని అర్థించారు. ఈ నేపథ్యంలో కేసులు పెండింగులో ఉన్న, విచారణ ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులకు సంబంధించి సేకరించిన వివరాలతో కూడిన జాబితాను అమికస్‌ క్యూరీ సుప్రీంకోర్టుకు సమర్పించింది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపి కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రాజకీయ నాయకులపై పెండింగులో ఉన్న కేసులను సత్వరమే విచారించడానికి వీలుగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది.


ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని గుర్తుచేసుకుందాం. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపై విచారణను ఏడాదిలోగా పూర్తిచేసి జైలుకు పంపాల్సిన వాళ్లను పంపుతామని నరేంద్ర మోదీ అప్పట్లో హామీ ఇచ్చారు. ఆరేళ్లుగా ఈ విషయాన్ని ఆయన మరిచిపోయారు. తాజాగా తన పిటిషన్‌పై విచారణ జరపాల్సిందిగా అశ్వనీకుమార్‌ సుప్రీంకోర్టును కోరడాన్ని బట్టి, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి భరతం పట్టడానికి ప్రధాని మోదీ సిద్ధపడుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. కొవిడ్‌ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. జీడీపీ పడిపోయింది. పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దే చిట్కా ఏదీ కేంద్రప్రభుత్వం వద్ద లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఆకర్షణీయమైన మరో నినాదం కావలసి ఉంటుంది. ఈ కారణంగా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడానికి కేంద్రప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయవచ్చు. గతంలో ప్రకటించినట్టు ఏడాదిలోపు విచారణ పూర్తి కావడానికి చర్యలు తీసుకోవచ్చు. అదే జరిగితే బీజేపీకి చెందిన కొంతమంది నాయకులకు కూడా శిక్ష పడవచ్చు. అయితే రాజకీయాలలో నేరస్థులకు తావు లేదన్న నమ్మకాన్ని ప్రజలలో కల్పించగలిగితే కలిగే ప్రయోజనం ముందు.. కొంతమంది సొంత పార్టీ నాయకులను వదిలించుకుంటే కలిగే నష్టం స్వల్పంగా ఉంటుంది. అంతా సవ్యంగా జరిగితే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఉన్న హత్యానేరం కేసులను కూడా ఏడాదిలోపు పరిష్కరించవలసి ఉంటుంది. ఒకవేళ యోగికి శిక్ష పడినా బీజేపీకి మరో భోగి దొరుకుతాడు. రాజకీయాలను ప్రక్షాళన చేశామన్న కీర్తిని మాత్రం సొంతం చేసుకోవచ్చునని నరేంద్ర మోదీ భావించవచ్చు.


తెలుగునాట కూడా కొంతమంది మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలపై కేసులు పెండింగులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయనపై నమోదైన కేసులు దాదాపు పదేళ్లుగా పెండింగులో ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో కల్పించిన వెసులుబాట్లను ఉపయోగించుకొని విచారణ వేగవంతం కాకుండా జగన్‌ అండ్‌ కో నిలువరించగలిగారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం వైఖరిలో మార్పు వస్తోంది. కేంద్ర ప్రభుత్వ స్పందనను బట్టి రాజకీయాల్లోని నేరస్థులపై విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చే ఏడాది చివరినాటికి జగన్‌రెడ్డిపై ఉన్న కేసులలో విచారణను పూర్తిచేయాలి. అవినీతి ఆరోపణలు రుజువైన పక్షంలో ముఖ్యమంత్రికి శిక్ష పడుతుంది. లేనిపక్షంలో పులుకడిగిన ముత్యంలా ఆయన మెరిసిపోతారు. అయితే సుప్రీంకోర్టులో అశ్వనీకుమార్‌ పిటిషన్‌ విచారణకు రావడంతోనే అధికార వైసీపీ నాయకులలో గాబరా మొదలైంది. రాష్ట్రంలో బీజేపీ నాయకులు దూకుడు పెంచిన తరుణంలోనే ఈ ముప్పు వచ్చి పడిందని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మాత్రం గుంభనంగానే ఉన్నారు. ఇలాంటి ప్రమాదం వస్తుందని ఎప్పటినుంచో ఆయన భావిస్తున్నారు. ఆ కారణంగానే తన బెయిల్‌ రద్దయినా, అవినీతి కేసులలో శిక్ష పడినా తన స్థానంలో భార్య భారతిరెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది! అయితే జగన్‌రెడ్డికి భారతిరెడ్డి ప్రత్యామ్నాయం కాగలరా? అన్న సందేహం అధికార పార్టీ నాయకులను వేధిస్తోంది. పార్టీలో ఇప్పటికే సణుగుళ్లు, గొణుగుళ్లు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రిపై ఈగను కూడా వాలనివ్వని వీరవిధేయులైన ఎమ్మెల్యేలు కూడా జగన్‌ వ్యవహార శైలిని ఆక్షేపిస్తున్నారు. గాలిలో ఎమ్మెల్యేలం అయ్యామే గానీ పార్టీలో గుర్తింపు, గౌరవం ఉండటం లేదని వారు వాపోతున్నారు.


రెండేళ్ల తర్వాత ప్రస్తుత మంత్రులలో 90 శాతం మందిని తొలగిస్తానని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడే జగన్‌రెడ్డి ప్రకటించారు. ఈ కారణంగా అసంతృప్తితో ఉన్నవారు బయటపడకుండా మంత్రి పదవిపై ఆశతో ఎదురుచూస్తున్నారు. అయినా అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్న జగన్‌ను తామేమీ చేయలేమని కూడా అసంతృప్తితో ఉన్నవారు తమను తాము సమాధానపరుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అటు కేంద్రంలో, ఇటు సుప్రీంకోర్టులో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు విషయంలో కదలిక వచ్చింది. ఈ పరిణామంతో ఎవరి రాజకీయ భవిష్యత్‌ మసకబారుతుందో చూడాలి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెండింగ్‌లో ఉన్న కేసులలో కూడా కదలిక వస్తుంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా బలమైన నాయకులుగా చలామణి అవుతున్నవారి పరిస్థితి ఇబ్బందికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేక కోర్టుల వల్ల కొంతమంది నాయకులు తెరమరుగు కావొచ్చు గానీ, రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి. హత్యానేరం వంటి తీవ్ర అభియోగాలతో పాటు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నాయకులు ఇప్పుడు దర్జాగా పదవులు వెలగబెడుతున్నారు. ఈ పరిస్థితికి ఎప్పుడో ఒకప్పుడు ముగింపు పలకాల్సిన అవసరముంది. పనిలో పనిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అఖిల భారత సర్వీసు అధికారులను కూడా ఈ ప్రత్యేక కోర్టుల పరిధిలోకి తేవలసిన అవసరముంది. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడటం ద్వారా సంపాదించిన సొమ్ములో కొంతైనా తదుపరి ఎన్నికల్లో మళ్లీ గెలవడం కోసం ఖర్చు చేస్తారు.


బ్యూరోక్రాట్లకు ఆ అవసరం కూడా లేదు. రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు వస్తే.. వారి రాజకీయ భవిష్యత్‌ మసకబారుతుంది. అదే బ్యూరోక్రాట్ల విషయంలో తదుపరి చర్యలు పెద్దగా ఉండటం లేదు. అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కుకునే అఖిల భారత సర్వీసు అధికారులు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఐఏఎస్‌ల లాబీ బలంగా ఉన్నందున ప్రభుత్వాలు కూడా వారి జోలికి వెళ్లడానికి జంకుతాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అవినీతి కేసులలో చిక్కుకుని ఉద్యోగాలు కోల్పోయిన ఐఏఎస్‌ అధికారులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కొంతమంది బ్యూరోక్రాట్ల అక్రమ సంపాదన రాజకీయ నాయకులను మించి ఉంటోంది. ఒకరకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు అవినీతి విషయంలో శరీరాలు అతుక్కుని పుట్టిన కవలపిల్లల వంటివారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తే రాజకీయ నాయకుల ఆటలు కూడా సాగవు. అధికారులు కూడా చేతులు కలపడం వల్లే అవినీతి నానాటికీ పెరిగిపోతోంది. తెలుగునాట కొంతమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల అక్రమ సంపాదన వందల కోట్లకు చేరింది. ఇటువంటి అధికారులు తమ అక్రమ సంపాదనను రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు. పలువురు అఖిల భారత సర్వీసు అధికారులు హైదరాబాద్‌ చుట్టూ వందలాది ఎకరాలను సొంతం చేసుకున్నారు. ఈ భూముల విలువ ఇప్పుడు వేల కోట్లలో ఉంటుంది. ఈ నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారులు, ఇతర ఉన్నతాధికారులపై అవినీతి నిరోధక శాఖ నమోదు చేస్తున్న కేసుల విచారణను ప్రత్యేక కోర్టుల పరిధిలోకి తీసుకువచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం గానీ, సుప్రీంకోర్టు గానీ చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. రాజకీయాలతోపాటు బ్యూరోక్రసీని కూడా ప్రక్షాళన చేయగలిగితే దేశానికి అంతకంటే మంచి ఏముంటుంది!?

ఆర్కే

 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.