కాలుష్య రహిత విశాఖే లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-22T06:58:49+05:30 IST

రాష్ట్రంలో పెద్ద నగరం విశాఖలో కాలుష్యం పెరగడంపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, గనులు, విద్యుత్‌ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.

కాలుష్య రహిత విశాఖే లక్ష్యం
కలెక్టరేట్‌లో సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి, అధికారులు

పరిశ్రమల ఆవరణలో అటవీశాఖ మొక్కలు పెంచాలి

జూను తరలించే ప్రసక్తే లేదు

నగరంలో భూగర్భ విద్యుత్‌ పనులు పూర్తి చేయండి

అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశం

విశాఖపట్నం, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెద్ద నగరం విశాఖలో కాలుష్యం పెరగడంపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, గనులు, విద్యుత్‌ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. వాతావరణంలో పీఎం 10 ధూళి కణాలు 81 శాతంగా నమోదవుతున్నాయని పేర్కొంటూ విశాఖలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని అఽధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో కాలుష్య నియంత్రణ మండలి, అటవీ, విద్యుత్‌ శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ పరిసరాల్లో రెడ్‌ కేటగిరీ కింద 375 పరిశ్రమలు ఉన్నాయని పేర్కొంటూ వాటి నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు. వచ్చే ఏడాది కల్లా వాతావరణంలో పీఎం 10 ధూళి కణాలను 60 శాతానికి తగ్గించాలని, అప్పుడే నగరంలో స్వచ్ఛమైన వాతావరణం నెలకొంటుందన్నారు. సామాజిక సేవా కార్యక్రమం(సీఎస్‌ఆర్‌) కింద ప్రభుత్వ/ప్రైవేటు రంగ సంస్థలు అనుకున్న మేర మొక్కలు పెంచడం లేదని, అందువల్ల అటవీశాఖే ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి విశాఖ జాయింట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ రాజేంద్రనాథ్‌రెడ్డి బోర్డు ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 956 పరిశ్రమలు ఉండగా వాటిలో 375 వరకు రెడ్‌ కేటగిరీలో ఉన్నాయన్నారు. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాల శుద్ధి కోసం నాలుగు చోట్ల ప్లాంట్లు ఉన్నాయని వివరించారు. ఈ దశలో మంత్రి జోక్యం చేసుకుని జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రస్తావించారు. ఏపీ పీసీబీ చైర్మన్‌ ఏకే ఫరీదా స్పందిస్తూ ప్రమాదాలకు సంబంధించి ఫ్యాక్టరీస్‌ విభాగం పర్యవేక్షిస్తోందని, అయినా భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అనంతరం జేసీఈ రాజేంద్రనాథ్‌రెడ్డి బోర్టు కార్యకలాపాలు వివరిస్తూ... విశాఖలో రోజుకు 1000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నదని, ఇంకా 214 ఎంఎల్‌డీ వ్యర్థ జలాలు వస్తున్నాయన్నారు. చెత్త నుంచి విద్యుత్‌ తయారీకి  త్వరలో ప్లాంటు సిద్ధమతున్నదన్నారు. దీనిపై పీసీబీ చైర్మన్‌ ఫరీదా మాట్లాడుతూ రాష్ట్రంలో పట్టణాలు, నగరాల్లో రోజువారీ ఉత్పత్తి అయ్యే చెత్తను డిస్పోజల్‌ చేయడం పెద్ద సవాల్‌గా ఉందన్నారు. కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ. వచ్చే నెల ఐదో తేదీ నుంచి నగరంలో కొన్ని ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోక్యం చేసుకుని త్వరలో మునిసిపల్‌ శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించి నగరాలు, పట్ణణాల్లో కాలుష్యం, చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణకు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించాలని అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ను ఆదేశించారు. 

విశాఖ సర్కిల్‌ పరిధిలో మూడు జిల్లాల్లో అటవీశాఖ చేపడుతున్న కార్యక్రమాలపై సీఎఫ్‌ రామ్మోహనరావు వివరిస్తూ ఈ ప్రాంతంలో వెదురు, టేకు అమ్మకాల ద్వారా ఆదాయం వస్తోందన్నారు. విశాఖ పరిసరాల్లో కాలుష్యం తగ్గించడానికి చెట్లు పెంపకం చేపడుతున్నామన్నారు. అయితే విశాఖ పోర్టు ఇచ్చిన లక్ష్యాల మేరకు మొక్కలు పెంచడం లేదన్నారు. విశాఖ జంతు ప్రదర్శన శాలపై క్యూరేటర్‌ నందని సలారియా వివరిస్తూ జూలో ఉద్యోగుల కొరత ఉందన్నారు. ఈ సమయంలో మంత్రి జోక్యం చేసుకుని దేశంలో మిగిలిన జూల నిర్వహణ, ప్రవేశ రుసుం వంటి అంశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జూను తరలించి అక్కడ భూములు అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. ఒకవేళ అభివృద్ధి చేయకపోతే సింగ్‌పూర్‌ మాదిరిగా నైట్‌ సఫారికి అనువుగా మార్చాలన్నారు. దీనిపై సమీక్ష అనంతరం మంత్రి స్పందిస్తూ విశాఖ జూ ఎంతో వైవిధ్యమైనదని పేర్కొంటూ, జూను తరలించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 

విద్యుత్‌శాఖపై సమీక్షను ఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోషరావు ప్రారంభిస్తూ  ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడ విద్యుత్‌ ఉందన్నారు. విశాఖ నగరంలో రూ. 1100 కోట్లతో విద్యుత్‌ భూగర్భ కేబుల్స్‌ పనులు 80 శాతం వరకు పూర్తిచేశామని వివరించగా,  మిగిలిన పనులు త్వరలో పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు, రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి ప్రతీప్‌కుమార్‌, డీఎఫ్‌వో అనంత్‌శంకర్‌, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు కుమార్‌ రెడ్డి, భాస్కర్‌, రమేశ్‌, పీసీబీ ఈఈ ప్రమోద్‌కుమార్‌ రెడ్డి, గనులశాఖ అధికారులు డీవీఎస్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు. 










Updated Date - 2022-05-22T06:58:49+05:30 IST