పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యం

ABN , First Publish Date - 2021-06-17T06:35:46+05:30 IST

పేదల ముఖాల్లో చిరునవ్వే ప్రభుత్వ లక్ష్యమని, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే విధంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం రోడ్లు, భవన నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంతోపాటు రాచర్ల బొప్పాపూర్‌, రాచర్ల గొల్లపల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు.

పేదల ముఖాల్లో చిరునవ్వే లక్ష్యం
ఎల్లారెడ్డిపేటలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి

- ఆత్మగౌరవానికి ప్రతీక డబుల్‌బెడ్‌రూం ఇళ్లు

- అవినీతికి తావు లేకుండా పంపిణీ 

- ప్రాణవాయువును ఇచ్చే చెట్లను పెంచాలి

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు 

- మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ 

- టీ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌, ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పేదల ముఖాల్లో చిరునవ్వే ప్రభుత్వ లక్ష్యమని, వారి ఆత్మగౌరవానికి  ప్రతీకగా నిలిచే విధంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు  నిర్మించామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం   రోడ్లు, భవన నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంతోపాటు రాచర్ల బొప్పాపూర్‌, రాచర్ల గొల్లపల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు.   అనంతరం సిరిసిల్ల,  బోయినపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో ప్రారంభోత్సవాలు చేశారు.  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ  ఇళ్ల పంపిణీ పండుగ వాతావరణంలా ఉందన్నారు. గతంలో పిట్లగూడులా ఇళ్లు కట్టారని, ఒక గదితో కట్టిన ఇంటిలో తల్లిదండ్రులు, పిల్లలు అందరూ తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. చుట్టం వస్తే బయట పడుకునే పరిస్థితి ఉంటే, ఆడపిల్లలు దుస్తులు మార్చుకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో దశల వారీగా  ఇళ్లను నిర్మిస్తున్నామని, అవినీతికి తావులేకుండా కేటాయిస్తున్నామని అన్నారు.  ఇళ్లు రానివారికి అందిస్తామని, అసంతృప్తి చెందవద్దని అన్నారు. గతంలో పేదవాడి  ఇల్లు అంటే ఒక గదితో తూతూ మంత్రంగా కట్టి చేతులో పెట్టిపోయారని, దానికి మూడు రంగులు వేసి మూడు చెర్ల నీళ్లు తాగించి ఆగమాగం చేసినవారేని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారునికి ఒక్క పైసా ఖర్చు లేకుండా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇస్తోందన్నారు.  ఇంటింటికీ మిషన్‌ భగీరథ, ఉచిత కరెంటు, మురికి కాలువలు, సీసీ రోడ్లు వంటి సౌకర్యాలు కల్పించామన్నారు.  కరోనా వచ్చిన సమయంలో ఆక్సిజన్‌ కోసం తండ్లాడిన పరిస్థితులు చూశామని, ప్రాణవాయువు అందించే చెట్లను పెంచుకుంటే ఈ అడ్డమైన రోగాలు కూడా రావని అన్నారు. ఖాళీ స్థలంలో మొక్కలు నాటేలా ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. కేసీఆర్‌ చరిత్రలో ఊహించని కార్యక్రమాలు చేస్తున్నారని, గతంలో రూ.200 పింఛన్‌  వచ్చేదని,   తెలంగాణ ప్రభుత్వంలో పది రెట్లు పెరిగి రూ.2 వేలు అయ్యిందని అన్నారు.  ఇటీవల క్యాబినేట్‌ మీటింగ్‌లో సీఎం కేసీఆర్‌ కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారని, త్వరలోనే 4.70 లక్షల మందికి కొత్త రేషన్‌ కార్డులు రాబోతున్నాయని అన్నారు. గతంలో బీడిలు చుట్టే అక్కాచెల్లెళ్లకు పింఛన్‌ ఇవ్వాలనే ఆలోచన  ఏ ముఖ్యమంత్రీ చేయలేదని, కేసీఆర్‌ 4.50 లక్షల మంది బీడీ కార్మికులకు రూ. 2 వేల పింఛన్‌ అందిస్తున్నారని అన్నారు. జిల్లాకు వస్తూ మల్కపేట రిజర్వాయర్‌ తొమ్మిదో ప్యాకెజీ కాలువ పనులను మంత్రి ప్రశాంత్‌రెడ్డికి చూపిస్తే ఎలాంటి ప్రాంతం ఎలా అయ్యిందన్నారని, కేసీఆర్‌ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సిరిసిల్ల మరో కోనసీమలా మారబోతోందని సంతోష పడ్డారని అన్నారు.  కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, జడ్పీ  చైర్‌పర్సన్‌ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, న్యాప్స్‌ కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, ఎల్లారెడ్డిపేటలో నేవూరి వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ తోట ఆగయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు నర్సయ్య, గ్రంథాలయం జిల్లా చైర్మన్‌ శంకరయ్య, ఆర్డీవో శ్రీనివాస్‌రావు సర్పంచులు బాల్‌రెడ్డి, సరోజన, ఎంపీటీసీలు నాగరాణి, అనసూయ, శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, పీఏపీఎస్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో చిరంజీవి, ఆయా శాఖల అధికారులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఫార్మా హబ్‌గా తెలంగాణ 

- మంత్రి ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణ ఫార్మా హబ్‌గా మారబోతుందని, 19 వేల ఎకరాల్లో రూ.75 వేల కోట్లతో ఫార్మాకంపెనీలు రాబోతున్నాయని రోడ్లు, భవన నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలో  మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణను ఫార్మాహబ్‌గా తీర్చుదిద్దుతున్నారన్నారు. ఫార్మాహబ్‌తో 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయన్నారు.  సీఎం కేసీఆర్‌ గ్రామీణా ఆర్థికాభివృద్ధి పరిపుష్టి కోసం శ్రమిస్తే మరో వైపు ఉపాధి, ఉద్యోగ కల్పనకు మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారని అన్నారు.   ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద పరిశ్రమలు తెలంగాణలో అడుగు పెడుతున్నాయంటే అందుకు కారణం మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నీడ లేని పేదలకు రాష్ట్రవ్యాప్తంగా రూ.19 వేల కోట్లతో 2.67 లక్షల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి పంపిణీ చేస్తోందని, ఇప్పటికే 1.60 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని అన్నారు.  దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకాన్ని కేసీఆర్‌ అందించారన్నారు. 

 బాలుడికి వైద్యం చేయిస్తాం 

నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలం చించోళ్ల గ్రామానికి చెందిన నరేష్‌, లావణ్య దంపతులు తమ కుమారుడిని ఆదుకోవాలని కోరగా మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బుధవారం ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. రెండేళ్ల తమ కుమారుడు  శ్రీశాంత్‌రెడ్డి లివర్‌ వ్యాధితో బాధపడుతున్నాడని. ఇప్పటికే రూ 12 లక్షలు ఖర్చు చేశామని వాపోయారు.  స్పందించిన కేటీఆర్‌ ప్రభుత్వ పరంగా  ఆదుకుంటామని, వైద్యం చేయిస్తామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-06-17T06:35:46+05:30 IST