Air Arabia: అతి తక్కువ చార్జీలతో యూఏఈ నుంచి భారత్‌లోని 13 నగరాలకు విమానాలు!

ABN , First Publish Date - 2022-01-26T18:03:31+05:30 IST

షార్జాకు చెందిన లో-కాస్ట్ క్యారియర్ ఎయిర్ అరేబియా యూఏఈ నుంచి భారత్‌కు వచ్చే వారికి బంపరాఫర్ ప్రకటించింది.

Air Arabia: అతి తక్కువ చార్జీలతో యూఏఈ నుంచి భారత్‌లోని 13 నగరాలకు విమానాలు!

అబుధాబి: షార్జాకు చెందిన లో-కాస్ట్ క్యారియర్ ఎయిర్ అరేబియా యూఏఈ నుంచి భారత్‌కు వచ్చే వారికి బంపరాఫర్ ప్రకటించింది. కేవలం 250 దిర్హమ్(రూ.5,087)తో ఇండియాకు వచ్చే అవకాశం కల్పించింది. యూఏఈ నుంచి భారత్‌లోని 13 నగరాలకు ఈ ప్రత్యేక వన్‌వే సర్వీసులను నడిపిస్తామని ఎయిర్ అరేబియా తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, గోవా, కాలికట్, కొచ్చి, త్రివేండ్రం, చెన్నై, కోయంబత్తూర్, నాగ్‌పూర్ ఉన్నాయి. ఈ గమ్యస్థానాలకు యూఏఈ నుంచి విమాన చార్జీల ప్రారంభ ధర కేవలం రూ.5వేలు మాత్రమే. అలాగే షార్జా విమానాశ్రయం నుంచి రాస్ అల్ ఖైమా మధ్య షటిల్ బస్ సర్వీసులను కూడా ఎయిర్ అరేబియా తిరిగి ప్రారంభించింది. రోజుకు మూడు సర్వీసులు నడపనుంది. ఒక్కొ ప్రయాణికుడికి 30 దిర్హమ్(రూ.610) చార్జీ ఉంటుంది. 


ఇదిలాఉంటే.. ఈ నెల 7న భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రకటన అనంతరం విమాన చార్జీలు అమాంతం తగ్గిపోయినట్లు దుబాయ్‌లోని ట్రావెల్ ఏజెంట్లు వాపోయారు. అదే ప్రభావం ఇప్పటికీ కొనసాగుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం దుబాయ్ సహా యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులకు ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనను తొలగించింది. దీంతో ఇక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిర్ అరేబియా ప్రకటన స్వదేశానికి వచ్చే భారతీయులకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.    

Updated Date - 2022-01-26T18:03:31+05:30 IST