India to Dubai: యూఏఈ రెసిడెంట్స్‌కు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక సూచన!

ABN , First Publish Date - 2022-02-26T14:48:46+05:30 IST

భారత్ నుంచి దుబాయ్ వెళ్లే యూఏఈ రెసిడెంట్స్‌కు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక సూచన చేసింది.

India to Dubai: యూఏఈ రెసిడెంట్స్‌కు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక సూచన!

ఇంటర్నెట్ డెస్క్: భారత్ నుంచి దుబాయ్ వెళ్లే యూఏఈ రెసిడెంట్స్‌కు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక సూచన చేసింది. ఆ దేశంలో ప్రవేశానికి వీరికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) లేదా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్(ఐసీఏ) అనుమతి అవసరం లేదని ప్రకటించింది. అలాగే దుబాయ్ వచ్చే అతిథులకు యూఏఈ ఇతర పలు సడలింపులు కూడా ఇచ్చినట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ట్వీట్ చేసింది. అయితే, ప్రయాణికులకు విమానం ఎక్కడానికి 48 గంటల ముందు టెస్టు చేయించుకున్న పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని ఎయిర్‌లైన్ తెలియజేసింది. దీంతో పాటు నివాసితులు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే యూఏఈ రెసిడెంట్ వీసా కలిగి ఉండడం, వ్యాక్సినేషన్ పూర్తవ్వడం, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని పేర్కొంది. 




ఇక ఇటీవలే భారత్ నుంచి దుబాయ్ వెళ్లేవారికి పలు ఆంక్షలు సడలించింది యూఏఈ సర్కార్. దీనిలో భాగంగా మన దేశీయులు దుబాయ్‌కు బయలుదేరే ముందు ఇక్కడి విమానాశ్రయాల్లో ర్యాపిడ్‌ ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈమేరకు కొవిడ్‌ నిబంధనలను సవరిస్తూ దుబాయ్‌ నిర్ణయాన్ని తీసుకుంది. ఇది భారత్‌తో పాటు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకూ వర్తిస్తుందని వెల్లడించింది. కాగా, విమానం ఎక్కడానికి 48 గంటల ముందు చేయించుకున్న కొవిడ్‌ పరీక్షలో ‘నెగెటివ్‌’ వచ్చిన ధ్రువపత్రాన్ని సమర్పిస్తే సరిపోతుందని సూచించింది. కానీ దుబాయ్‌లో దిగగానే పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 


అటు షార్జా కూడా భారత్ సహా 8 దేశాల వారికి శుభవార్త చెప్పింది. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్, ర్యాపిడ్ టెస్టును తొలగించింది. ఇకపై షార్జా వెళ్లేవారు పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మేరకు షార్జాకు చెందిన బడ్జెట్ క్యారియర్ ఎయిర్ అరేబియా మంగళవారం కీలక ప్రకటన చేసింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, కెన్యా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఉగాండా దేశాల నుంచి షార్జా వచ్చే ప్రయాణికులకు పీసీఆర్, ర్యాపిడ్ పరీక్షను తొలగించినట్లు వెల్లడించింది. అయితే, విమానం ఎక్కడానికి 48 గంటల ముందు చేయించుకున్న కరోనా పరీక్ష తాలూకు ‘నెగెటివ్‌’ ధ్రువపత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్‌పై క్యూఆర్ కోడ్ ఉండడం తప్పనిసరి. అలాగే షార్జాలో దిగగానే పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.  

Updated Date - 2022-02-26T14:48:46+05:30 IST