Air India కు రూ.10 లక్షల జరిమానా విధించిన DGCA.. కారణం ఏంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-06-14T22:01:42+05:30 IST

ప్యాసింజర్ల వద్ద వ్యాలిడ్ టికెట్లు ఉన్నా బోర్డింగ్‌ బోర్డింగ్ వైఫల్యానికి కారణమైన దేశీయ విమానయాన దిగ్గజం ఎయిరిండియా(Air India)కు రూ.10 లక్షల జరిమానా పడింది.

Air India కు రూ.10 లక్షల జరిమానా విధించిన DGCA.. కారణం ఏంటో తెలుసా..

న్యూఢిల్లీ: ప్యాసింజర్ల వద్ద వ్యాలిడ్ టికెట్లు ఉన్నా బోర్డింగ్‌ తిరస్కరణకు బాధ్యత వహించని దేశీయ విమానయాన దిగ్గజం ఎయిరిండియా(Air India)కు రూ.10 లక్షల జరిమానా పడింది. ఈ మేరకు పౌరవిమానయాన నియంత్రణ సంస్థ DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా నుంచి వివరణ తీసుకున్న తర్వాతే ఈ జరిమానా విధించినట్టు వెల్లడించింది. బోర్డింగ్ వైఫల్యం సమస్యను పరిష్కరించేందుకు తగిన వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని, లేదంటే   తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

 

ఎయిరిండియా ఘటన విషయానికి వస్తే.. బోర్డింగ్ వైఫల్యంపై వివరణ ఇవ్వాలని కోరినా ఎయిరిండియా సరైన రీతిలో సమాధానం చెప్పలేదు. తిరస్కరణకు గురయిన ప్యాసింజర్లకు గంట వ్యవధిలోనే ప్రత్యమ్నాయ ప్రయాణాన్ని సిద్ధం చేయగల అవకాశం ఉన్నా ఎయిరిండియా పట్టించుకోలేదు. ఇక నష్టంపరిహారం చెల్లింపునకు సంబంధించిన పాలసీ ఏమీ లేదని ఎయిరిండియా పేర్కొందని తేలింది. మార్గదర్శకాల ప్రకారం.. బోర్డింగ్ తిరస్కరణకు గురయితే 24 గంటల వ్యవధిలో విమాన ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలి. లేదా రూ.10 వేల పరిహారం చెల్లించాలి. 24 గంటలు దాటితే రూ.20 వేల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని డీజీసీఏ ప్రస్తావించింది.


వ్యాలిడ్ టికెట్లు కలిగివున్నా, సమయానుగుణంగానే టికెట్లు చూపించినా బోర్డింగ్ తిరస్కరణ కారణంగా ఇబ్బంది పడుతున్నామని, కొన్ని విమానయాన సంస్థల నుంచి ఈ సమస్య ఎదురవుతోందని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందిన తర్వాత డీజీసీఏ రంగంలోకి దిగింది. మార్గదర్శకాలు ఉన్నా కొన్ని విమానయాన సంస్థలు వాటిని పాటించడం లేదని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-06-14T22:01:42+05:30 IST