ఉక్రెయిన్ వెళ్లిన ఎయిరిండియా విమానం.. మధ్యలోనే వెనక్కి.. ఆందోళనలో భారతీయులు!

ABN , First Publish Date - 2022-02-24T17:14:21+05:30 IST

ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు గురువారం ఢిల్లీ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే వెనక్కి వచ్చేసింది.

ఉక్రెయిన్ వెళ్లిన ఎయిరిండియా విమానం.. మధ్యలోనే వెనక్కి.. ఆందోళనలో భారతీయులు!

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు గురువారం ఢిల్లీ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే వెనక్కి వచ్చేసింది. దీనికి కారణం ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేయడం. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్‌కు దిగింది. దీంతో ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది. ఈ నేపథ్యంలో మనోళ్లను స్వదేశానికి తీసుకురావడానికి వెళ్లిన ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లీంది. ఉక్రెయిన్‌కు వెళ్లే అన్ని విమానాలకు నోటామ్(NOTAM) లేదా ఎయిర్‌మెన్‌లకు నోటీసు పంపిన తర్వాత ఎయిర్ ఇండియా విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇక విమానం వెనక్కి రావడంతో ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చేందుకు ఎదురుచూస్తున్న భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 


వేల సంఖ్యలో భారత విద్యార్థులు వైద్య విద్యా తదితర కోర్సుల కోసం అక్కడ ఉన్నారు. వీరు వెంటనే స్వదేశానికి రావాలని ఇటీవలే భారత్ కోరింది. కాగా, అక్కడ చిక్కుకుపోయిన మనోళ్లను తరలించేందుకు ఈ నెల 22, 24, 26 తేదీల్లో భారత ప్రభుత్వం మూడు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగానే బుధవారం కొంతమంది భారత విద్యార్థులను అధికారులు స్వదేశానికి తీసుకొచ్చారు. ఇదిలాఉంటే.. గురువారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలెట్టింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ దేశంపై మిలటరీ ఆపరేషన్‌ మొదలైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇప్పటికే రష్యా బలగాలు కీవ్‌ విమానాశ్రయాన్ని అక్రమించినట్లు తెలుస్తోంది. అటు రష్యా దాడులను ఉక్రెయిన్ సేనలు తిప్పి కొడుతున్నాయి.  

Updated Date - 2022-02-24T17:14:21+05:30 IST