ఎయిరిండియా విక్రయం కోసం ‘టాటా’తో కేంద్రం ఒప్పందం

ABN , First Publish Date - 2021-10-26T08:28:55+05:30 IST

ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిరిండియాను రూ.18,000 కోట్లకు విక్రయించేందుకు గాను కేంద్ర సర్కారు టాటా సన్స్‌తో షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌పీఏ) కుదుర్చుకుంది.

ఎయిరిండియా విక్రయం కోసం  ‘టాటా’తో కేంద్రం ఒప్పందం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమాన సంస్థ ఎయిరిండియాను రూ.18,000 కోట్లకు విక్రయించేందుకు గాను కేంద్ర సర్కారు టాటా సన్స్‌తో షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌పీఏ) కుదుర్చుకుంది. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ ఽశాఖ (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఎయిరిండియా  ఫైనాన్స్‌ విభాగం డైరెక్టర్‌ వినోద్‌ హెజ్మదీ, విమాన శాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర మిశ్రా, టాటా గ్రూప్‌ ప్రతినిధి సూర్యప్రకాశ్‌ ముఖోపాధ్యాయ్‌ ఎస్‌పీఏపై సంతకాలు చేశారు. ఎయిర్‌లైన్స్‌ పగ్గాలు చేపట్టే ముందు టాటా సన్స్‌.. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) సహా పలు నియంత్రణ మండళ్ల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు నాటికి యాజమాన్య హక్కులబదిలీ పూర్తి కావచ్చని అంచనా. ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా టాటా సన్స్‌ అనుబంధ కంపెనీ టాలేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సమర్పించిన బిడ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-10-26T08:28:55+05:30 IST