UAE to India: విమాన ఛార్జీలకు రెక్కలు.. స్వదేశానికి రావాలంటే రెట్టింపు చెల్లించాల్సిందే!

ABN , First Publish Date - 2021-11-11T17:15:27+05:30 IST

దుబాయ్ నుంచి భారత్‌లోని వివిధ నగరాలకు డిసెంబర్‌లో విమాన ఛార్జీల మోత మోగింది.

UAE to India: విమాన ఛార్జీలకు రెక్కలు.. స్వదేశానికి రావాలంటే రెట్టింపు చెల్లించాల్సిందే!

యూఏఈ: దుబాయ్ నుంచి భారత్‌లోని వివిధ నగరాలకు డిసెంబర్‌లో విమాన ఛార్జీల మోత మోగింది. ప్రస్తుతం ఉన్న ఛార్జీలు దాదాపుగా రెట్టింపు అయ్యాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, దుబాయ్ ఎక్స్‌పో-2020, దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ వంటి మెగా ఈవెంట్లకు వచ్చిన ప్రవాసులు తిరుగు పయనం అవుతున్న నేపథ్యంలో ఛార్జీలు భారీగా పెరిగాయి. ప్రయాణికుల రద్దీ కారణంగా డిసెంబర్‌లో దుబాయ్ నుంచి భారత్‌లోని వివిధ నగరాలకు విమాన ఛార్జీలు దాదాపు రెట్టింపు అయ్యాయని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి. 


"భారత్, పాకిస్తాన్ నుంచి దుబాయ్‌కి ఇన్‌బౌండ్ వన్-వే ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కార్పొరేట్‌ల గ్రూప్ విజిట్‌లు దుబాయ్‌కి కూడా ప్రారంభమయ్యాయి. ప్రజలు మొదట్లో అక్టోబర్‌లో ప్రయాణాలు చేయడానికి కొంచెం సంశయించారు. కానీ ఇప్పుడు రద్దీ బాగా పెరుగుతోంది. భారత్, పాకిస్తాన్ నుంచి కార్పొరేట్ సంస్థలు వారి ఉద్యోగులు, భాగస్వాములను దుబాయ్‌కి భారీ సంఖ్యలో పంపుతున్నాయి. ఈ అంశాలన్నింటి కారణంగానే ధరలు బాగా పెరిగాయి" అని Musafir.com చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ రహీష్ బాబు తెలిపారు.


అటు ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా పరిమిత సంఖ్యలోనే విమాన సర్వీసులు నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాబోయే కొన్ని నెలలు భారతీయ ఉపఖండానికి విమాన ఛార్జీలు ఎక్కువగానే ఉంటాయని విమానయాన వర్గాల సమాచారం. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో చాలామంది భారతీయ ఫ్యామిలీలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కోసం స్వదేశానికి తరలి రానున్నాయి. ఈ కారణంగానే డిసెంబర్‌లో యూఏఈ నుంచి భారత్‌లోని కొన్ని విమాన మార్గాల్లో ఛార్జీలు 1,200-1,300 దిర్హమ్స్(సుమారు రూ.24వేలు) నుంచి 2,300 దిర్హమ్స్‌కు(సుమారు రూ.46వేలు) పెరిగాయి. డిసెంబర్ నెలకు సంబంధించి చాలా విమాన సర్వీసుల్లో ఇప్పటికే దాదాపు టికెట్లు అన్ని అమ్ముడుపోయినట్లు ట్రావెల్ ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ నెలకు సంబంధించిన విమాన టికెట్లు హట్‌కేకుల్లా సేల్ అవుతున్నట్లు విమానయాన సంస్థలు పేర్కొంటున్నాయి.  

Updated Date - 2021-11-11T17:15:27+05:30 IST