ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు ఊరట

ABN , First Publish Date - 2020-11-18T06:30:10+05:30 IST

విమానాశ్రయ విస్తరణ నిర్వాసితుల సమస్య పరిష్కారానికి అడుగు పడింది.

ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు ఊరట

ఆర్‌ అండ్‌ ఆర్‌కు కదలిక

రూ.100 కోట్లకు ఎంఏయూడీ ఆమోదం 

ఇంటి నిర్మాణానికి నిర్వాసితులకే డబ్బు

ఒక్కో కుటుంబానికి రూ.9 లక్షలు

క్షేత్రస్థాయిలో పనులకు రెవెన్యూ శ్రీకారం 

అద్దెకుంటున్న వారికి మూడు విడతలుగా చెల్లింపులు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

విమానాశ్రయ విస్తరణ నిర్వాసితుల సమస్య పరిష్కారానికి అడుగు పడింది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం రూ.100 కోట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మునిసిపల్‌ పరిపాలనా విభాగం నుంచి కూడా ఆమోద ం లభించడంతో జిల్లా యంత్రాంగం ప్యాకేజీ కల్పనపై దృష్టి సారించింది. ఈ ప్యాకేజీ కింద బుద్ధవరం, దావాజీగూడెం, కేసరపల్లి, అజ్జంపూడి గ్రామాలకు చెందిన దాదాపు 425 మంది నిర్వాసితులకు ఇళ్లను నిర్మించాల్సి ఉంది. గన్నవరం రెవెన్యూ అధికారులు ఆ దిశగా కసరత్తులు చేస్తున్నారు. చిన్న అవుటపల్లిలో నిర్వాసితులందరికీ  ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఇళ్లను నిర్మించేందుకు 49 ఎకరాల భూములను గతంలో సేకరించి, లే అవుట్‌ వేశారు. పెగ్‌ మార్కింగ్‌ చేసి, ప్లాట్లను విభజించారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇళ్ల నిర్మాణంలో జాప్యం చోటు చేసుకోవటం వల్ల ఇప్పటికీ ప్రజలు ఎయిర్‌పోర్టుకు అప్పగించిన భూముల నుంచి తరలి వెళ్లలేదు. విమానాశ్రయ విస్తరణ నిర్వాసితుల్లో అత్యధికంగా బుద్ధవరం గ్రామ ఎస్సీ కాలనీ వాసులే ఉన్నారు. తర్వాత వరసలో అల్లాపురం, దావాజీగూడెం ప్రజలున్నారు. అజ్జంపూడిలో ఒకరిద్దరు ఉన్నారు. 


ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద గతంలో మోడల్‌ గృహాలను నిర్మిస్తామన్నది జిల్లా యంత్రాంగం ప్రతిపాదన. ఇళ్లను కేటాయించిన తర్వాత గృహ ప్రవేశాలు చేసే, ఈ భూములను ఖాళీ చేస్తామని అప్పట్లో బాధితులు స్పష్టం చేశారు. మూడొంతుల మంది ఇప్పటికీ ఎయిర్‌పోర్టు స్వాధీన భూముల్లోనే నివశిస్తున్నారు. ఒక వంతు మంది మాత్రం ఖాళీ చేసి అద్దె గృహాల్లో ఉంటున్నారు. వారికి అద్దె పరిహారాన్నిస్తామని ప్రకటించినా, ఇప్పటి వరకు వారికి ఏమీ అందలేదు. 


నిర్వాసితులకు ఆర్థిక పరిహారం  

నిర్వాసితుల్లో అత్యధికులు డబ్బులయినా ఇస్తే ఇళ్లను నిర్మించుకుంటామని కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నిర్వాసితులే ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా రూ.9 లక్షలు చొప్పున ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ముందుగా ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.4.50 లక్షలు ఇచ్చి, మిగిలిన రూ.4.50 లక్షలను మూడు నెలల్లోపు జమ చేయాలని నిర్ణయించింది. 


 అద్దె బకాయిల చెల్లింపునకు మార్గం సుగమం  

అద్దె బకాయిలు చెల్లించేందుకు కూడా మార్గం సుగమమయింది. దాదాపు 50 మందికి పైగా నిర్వాసితులకు మూడు విడతలుగా అద్దె బకాయిలను చెల్లించాల్సి ఉండగా.. ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్దేశించింది. 


మౌలిక సదుపాయాల కల్పన  

 చిన్న అవుటపల్లిలోని స్థలాల్లో నిలిచిపోయిన రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్ల పనులను ప్రారంభించటానికి రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

పరిష్కారం లభించింది :  సీహెచ్‌ నరసింహారావు, తహసీల్దారు

నిర్వాసితుల సమస్యకు పరిష్కారం లభించింది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని పూర్తి చేయటానికి ప్రభుత్వం నుంచి సహకారం అందింది. నిర్వాసితులు తామే ఇళ్లు నిర్మించుకుంటామంటున్నారు కాబట్టి వారికి రూ.9 లక్షల చొప్పున డబ్బు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం లే అవుట్‌లో మౌలిక సదుపాయాల విస్తరణ పనులు పూర్తి చేయటానికి చర్యలు చేపట్టారు. ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహకారాన్ని కూడా అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. 


రూ.15 లక్షలు చెల్లించాలి : ఏసుబాబు, నిర్వాసితుడు 

ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి, గృహ ప్రవేశాలు చేయిస్తే మంచిగా ఉండేది. డబ్బులే ఇవ్వాలనుకుంటే రూ.15 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నాం. ప్లాట్లు కూడా రిజిస్ర్టేషన్‌ చేసి ఇవ్వాలి. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్లు, వీధిలైట్లు అన్నీ పూర్తి చేసిన తర్వాతే ప్లాట్లు కేటాయించాలి.

Updated Date - 2020-11-18T06:30:10+05:30 IST