Airportలో విదేశీ జంతువుల స్వాధీనం

ABN , First Publish Date - 2022-05-17T15:46:07+05:30 IST

స్థానిక మీనంబాక్కంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న రెండు విదేశీ జంతువులను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం

Airportలో విదేశీ జంతువుల స్వాధీనం

చెన్నై: స్థానిక మీనంబాక్కంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న రెండు విదేశీ జంతువులను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్థరాత్రి థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి ఓ విమానం చెన్నై విమానాశ్రయానికి వచ్చింది. అందులో నుంచి దిగిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో చెన్నైకి చెందిన ఓ వ్యక్తి దగ్గరున్న అట్టపెట్టె, సంచి తెరచి చూడగా అందులో తెలుపురంగు అడవి పంది, టామరిన్‌ తెగకు చెందిన కోతిపిల్ల కనిపించాయి.. ఆ ప్రయాణికుడిని ప్రశ్నించగా ఆ రెండు జంతువులను పెంచుకోవడానికి తీసుకువచ్చినట్లు చెప్పాడు. అయితే ఆ జంతువుల కొనుగోలు చేసిన రసీదులు, అటవీ శాఖ అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటిని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుని ఈ విషయాన్ని స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ జంతువులను పరిశీలించారు. ఈ రెండు విదేశీ జంతువుల కారణంగా అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో వాటిని మళ్ళీ బ్యాంకాక్‌కు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2022-05-17T15:46:07+05:30 IST