ఎయిర్‌పోర్టు భూసేకరణ వేగవంతం

ABN , First Publish Date - 2021-02-28T05:46:18+05:30 IST

భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి భూసేకరణలో ఉన్న సమస్యలను పరిష్కరించి వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్‌ ఆదేశించారు.

ఎయిర్‌పోర్టు భూసేకరణ వేగవంతం
ఎ.రాయవలస సమీపంలో ట్రంప్‌పెట్‌ గురించి కలెక్టర్‌తో చర్చిస్తున్న వలెవన్‌

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలెవన్‌

భోగాపురం, ఫిబ్రవరి 27: భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి  భూసేకరణలో ఉన్న సమస్యలను పరిష్కరించి వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్‌ ఆదేశించారు. కవులవాడ సమీపంలో ఎయిర్‌పోర్టు కోసం సేకరించిన స్థలాన్ని ఆయన శనివారం అధికారులతో పాటు పరిశీలించారు. ఎయిర్‌పోర్టుకు ఎంతభూమి సేకరించారు? ఇంకా ఎంత సేకరించాలి? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములపైనా ఆరా తీశారు. 15 కేసుల్లో సుమారు 167 ఎకరాల పీవోటీ భూమి ఉందని, 123 ఎకరాల జిరాయితీ భూమి సేకరణ కూడా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉందని అధికారులు వివరించారు. రైతులతో మాట్లాడి వీలైనంత తొందరగా భూములు సేకరించాలని వలెవన్‌ సూచించారు. ఎయిర్‌పోర్టుకు సేకరించిన భూమిని ఏపీఐడీసీఎల్‌ ద్వారా జిఎంఆర్‌కు అప్పగిస్తున్నామని అధికారులు వివరించారు. నాలుగైదు వారాల్లో భూసేకరణ పూర్తిచేసి జీఎంఆర్‌కు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితుల కాలనీల్లో పనుల గురించి కూడా అడిగారు. అమటాంరాయవలస సమీప జాతీయరహదారిపై ట్రంప్‌పెట్‌ నిర్మాణానికి సంబంధించి జాతీయరహదారిపై పరిశీలించారు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, జేసీ కిషోర్‌కుమార్‌, ఆర్డీవో భవానీశంకర్‌, తహసీల్దార్‌ డి.రాజేశ్వరరావు, జిఎంఆర్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రామరాజు, ఎయిర్‌పోర్టు ప్రత్యేక ఉపకలెక్టర్‌ సీహెచ్‌ రామకృష్ణ, జి.అప్పనాయుడు, సర్వేయర్‌ శివాజి, ఆర్‌ఐ రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-02-28T05:46:18+05:30 IST