5G: దేశంలో 5జి మేనియా.. మీరు రెడీనా?.. చెక్ చేసుకోండిలా!

ABN , First Publish Date - 2022-09-27T01:46:57+05:30 IST

దేశ ప్రజలందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 5జీ (5G) సేవలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో 5జి సేవలు అందుబాటులోకి

5G: దేశంలో 5జి మేనియా.. మీరు రెడీనా?.. చెక్ చేసుకోండిలా!

న్యూఢిల్లీ:  దేశ ప్రజలందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 5జీ (5G) సేవలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబరు 1న ఢిల్లీలో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సులో 5జి సేవలను లాంఛనంగా ప్రారంభిస్తారు. రిలయన్స్ జియో (Jio), భారతి ఎయిర్‌టెల్ (Bharti Airtel) ఈ సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండగా వొడాఫోన్ ఐడియా (Vi)కి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మెట్రో నగర వాసులకు తొలుత ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 5జి (5G) సేవలు అందుబాటులోకి వస్తున్నాయి సరే.. మరి వీటిని అందుకోవడమెలా అన్న కొన్ని ప్రశ్నలు వినియోగదారులను వేధిస్తున్నాయి. 5జి సేవలకు తన ఫోన్ సపోర్ట్ చేస్తుందా? లేదా? కొత్తది తీసుకుంటే ఏది తీసుకోవాలి? ఇప్పుడున్న సిమ్‌కార్డు పనిచేస్తుందా? లేదంటే కొత్తది తీసుకోవాలా? వంటి ప్రశ్నలు వినియోగదారుల మెదళ్లను తొలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవేంటో తెలుసుకుందాం. 


బఫరింగ్ లేని కనెక్షన్ కోసం

మన జీవనశైలి నిత్యం మారుతోంది. వేగం జీవితంలో భాగమైంది. 2జి నుంచి నేడు 4 వరకు అభివృద్ధి చెందిన మొబైల్ సేవల్లో 5జి (5G) అరంగేట్రం ద్వారా మరింత వేగం పుంజుకోనుంది. ఇంటర్నెట్ వేగంగా ఉండడం వల్ల హైక్వాలిటీ వీడియోలను ఎలాంటి బఫరింగ్ లేకుండా ఎంచక్కా చూసుకోవచ్చు. అతి తక్కువ లాటెన్సీ కారణంగా హైగ్రాఫిక్స్ గేమ్స్‌ను ప్లే చేసుకోవచ్చు. కనెక్షన్ స్లో అవుతుందన్న బాధ లేకుండానే పలు రకాల ఉపకరణాలను ఉపయోగించుకోవచ్చు. 


4జి కంటే 5జి వేగం 10 శాతం అధికం

అధ్యయనాలు చెబుతున్న దాని ప్రకారం 4జితో పోలిస్తే 5జి వేగంగా 7 నుంచి 10 శాతం అధికంగా ఉంటుంది. ఫలితంగా హై డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్, మొబైల్ గేమింగ్, వీడియో కాల్స్ వంటి సేవలకు అంతరాయం ఉండదు. యాక్సెస్‌ కోసం అవసరమైన బ్యాండ్ విడ్త్, లాటెన్సీని 5జి (5G) అందిస్తుంది. నెట్‌వర్క్‌లో వేగం వల్ల మొబైల్ సేవలు కూడా మెరుగుపడతాయని 42 శాతం మంది భావిస్తున్నట్టు ఓ సర్వే పేర్కొంది.  


అప్‌గ్రేడ్ చేసుకునే వారికి ప్రోత్సాహకాలు

రిలయన్స్ జియో (Reliance Jio) టెలికం రంగంలో వస్తూనే 4జితో సంచలనం సృష్టించింది. టెలికం మార్కెట్‌ను షేక్ చేసింది. ఈ సందర్భంగా జియో (Jio) ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇతర ఆపరేటర్లను వణికించాయి. దేశంలో ప్రస్తుతం 5జి (5G) ఫీవర్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 5జి సేవల విషయంలోనూ ప్రోత్సాహకాలు ప్రకటించాలని ఆపరేటర్లు యోచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ‘ట్రూ 5జి’ సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇప్పటికే ప్రకటించారు. 

 

మన ఫోన్ 5జికి సపోర్ట్ చేస్తుందా? లేదా? తెలుసుకోండిలా

చాలామంది మొబైల్ వినియోగదారుల వద్ద ఇప్పటికే అప్‌గ్రేడెడ్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. మరి 5జి(5G) సేవలకు అది సపోర్ట్ చేస్తుందా? లేదా? అని తెలుసుకోవడమెలా? ఈ ప్రశ్నకు కూడా సమాధానం ఉంది. నిజానికి దేశంలో 2019లోనే 5జి ఫోన్ వచ్చింది. ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్స్, లేదంటే సిమ్‌కార్డుకు సంబంధించిన ప్రిఫర్డ్ నెట్‌వర్క్‌ను పరిశీలించడం ద్వారా ఫోన్ 5జి సేవలకు సపోర్టు చేస్తున్నదీ, లేనిదీ తెలుసుకోవచ్చు. ప్రిఫర్డ్ నెట్‌వర్క్ 5జి అని సూచిస్తే ఫోన్ 5జికి సపోర్ట్ చేస్తున్నట్టే.  మొబైల్ నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌లో 5జి అని కనిపించకపోతే అది 5జికి సపోర్ట్ చేయదని అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రం 5జిని సపోర్ట్ చేసే ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 


కొత్త 5జి ఫోన్ అవసరమా?

వచ్చే నెలలో మెట్రో నగరాల వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానున్న 5జి సేవలు వచ్చే ఏడాది నాటికి దేశంలోని అన్ని నగరాల ఖాతాదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో కనుక మీరు ఉంటున్నట్టు అయితే వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్  అనుభూతి పొందేందుకు 5జి ఫోన్ ఉండాల్సిందే. అహ్మదాబాద్, లక్నో, చండీగఢ్, గురుగ్రామ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ఇతర నగరాల్లో 5జి కనెక్టివిటీకి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. దేశంలో తొలుత 5జిని ఆవిష్కరించే 13 నగరాల పేర్లను టెలి కమ్యూనికేషన్స్ శాఖ ఇప్పటికే ప్రకటించింది. టాప్- 100 నగరాల్లో 5జి కవరేజ్ ప్లానింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసి నట్లుగా జియో ప్రకటించింది. 2024 నాటికి దేశంలో గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని నగరాల్లోనూ కవర్ చేయాలన్న సంకల్పంతో ఎయిర్‌టెల్ ముందుకు సాగుతోంది.


రూ. 15 వేల లోపు అందుబాటులో ఉండే ఫోన్లు ఇవే..

మొబైల్ తయారీ సంస్థలన్నీ ప్రస్తుతం 5జి ఫోన్ల తయారీపైనే దృష్టిసారించాయి. యాపిల్, శాంసంగ్, షావోమి, పోకో, రియల్‌మి, వివో వంటి సంస్థల నుంచి ఇప్పటికే 5జి ఫోన్లు వచ్చేశాయి. వీటిలో కొన్ని బ్రాండ్లు రూ. 15వేలు అంతకంటే తక్కువ ధరకే 5జి ఫోన్లను అందుబాటులోకి తెచ్చాయి. రియల్‌మి అయితే రూ. 10 వేల లోపే 5జి ఫోన్ తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.  


ఫోన్ కొనేటప్పుడు ఇవి తప్పనిసరి

కొత్తగా 5జి ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నప్పుడు కొన్ని ఇతర అంశాలపైనా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఫోన్ బాక్సులపై ‘5జ’ అని ముద్రించి ఉన్నంత మాత్రాన సరిపోదు. అది ఎలాంటి 5జి బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తుందో చెక్ చేసుకోవాలి. 5 స్పెక్ట్రమ్‌లో లో–బ్యాండ్, మిడ్-బ్యాండ్, హై-బ్యాండ్ ఉంటాయి. లో-బ్యాండ్‌ 700MHz స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంటుంది. దీనినే n28గా కూడా టెలికం కంపెనీలు వ్యవహరిస్తారు. మిడ్ బ్యాండ్ 3500MHz ను కలిగి ఉంటుంది. దీనిని n78 గా పిలుస్తారు. దాదాపు ప్రతీ 5జి ఫోన్ n78 ను సపోర్ట్ చేస్తుంది. అయితే,  ఖరీదైన ఫోన్లలోనే n28ను అందుబాటులో ఉంటుంది. 700MHz అనేది స్టాండ్ ఎలోన్ 5జి సేవలకు ఉద్దేశించింది. రిలయన్స్ జియో ఒక్కటి మాత్రమే దీనిని అందిస్తోంది. హై-బ్యాండ్ అనేది 26GHz స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంటుంది. దీన్ని mmWave గా, n258గా వ్యవహరిస్తారు. కొన్ని ఫోన్లు మాత్రమే n258ను సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే, ఇది mmWave కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ 5జి ఆరంభంలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు.


5జి నెట్‌వర్క్ వేగమెంత?

ప్రపంచవ్యాప్తంగా 5 నెట్‌వర్క్‌లు 1జీబీపీఎస్‌కు మించిన వేగాన్ని అందించగలుగుతున్నాయి. 5జి స్పీడ్ అనేది ఆపరేటర్ పై కాకుండా లొకేషన్‌పైనా ఆధారపడి ఉంటుంది. చాలామందికి 5జి ఫోన్లలో 4జి సిమ్‌కార్డు పనిచేస్తుందా? అన్న సందేహం కూడా ఉంది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు తావులేదు. ఎందుకంటే కచ్చితంగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఎస్ఎంఎస్, వాయిస్ కాలింగ్ వంటి 4జి, 5జి సేవలను పొందొచ్చు.  

Updated Date - 2022-09-27T01:46:57+05:30 IST