ఎయిర్‌టెల్‌లోకి గూగుల్‌!

ABN , First Publish Date - 2022-01-29T08:52:16+05:30 IST

దేశీయ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ 100 కోట్ల డాలర్ల (రూ.7,500 కోట్లు) వరకు పెట్టుబడులు పెట్టనుంది. ..

ఎయిర్‌టెల్‌లోకి గూగుల్‌!

రూ.7,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్న టెక్‌ దిగ్గజం 

కంపెనీలో 1.28 శాతం వాటా కొనుగోలు 

న్యూఢిల్లీ: దేశీయ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ 100 కోట్ల డాలర్ల (రూ.7,500 కోట్లు) వరకు పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్‌టెల్‌లో 1.28 శాతం వాటా కోసం గూగుల్‌ 70 కోట్ల డాలర్లు చెల్లించనుంది. మిగతా 30 కోట్ల డాలర్లను మున్ముందు సంవత్సరాల్లో ఇరువురి భాగస్వామ్య ప్రణాళికల కోసం వెచ్చించనుంది. వినియోగదారులకు తమ కంపె నీ ఆఫర్‌ చేసే ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారిత డివైజ్‌లు, డిజిటల్‌ సేవలను మరింత చౌకగా అందుబాటులోకి తేవడంతో పాటు భారత్‌ కోసం ప్రత్యేకంగా 5జీ యూజ్‌ కేస్‌లను అభివృద్ధి చేయడం కూడా ఈ ప్రణాళికల్లో భాగమని ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. కంపెనీ 5జీ సేవల ప్రణాళికలతోపాటు జియోకు మరింత గట్టిపోటీ ఇచ్చేందుకు ఎయిర్‌టెల్‌కు ఈ పెట్టుబడులు దోహదపడనున్నాయి. వాటా విక్రయ ఒప్పందంలో భాగంగా రూ.5 ముఖ విలువ కలిగిన 7,11,76,839 ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటీ రూ.734 చొప్పున గూగుల్‌ ఇంటర్నేషనల్‌ ఎల్‌ఎల్‌సీకి కేటాయించేందుకు ఎయిర్‌టెల్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రిఫరెన్షియల్‌ కేటాయింపుల మొత్తం విలువ రూ.5,224.3 కోట్లు. 


‘సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ ద్వారా భారత్‌కు మరింతగా డిజిటల్‌ ప్రతిఫలాలందించాలన్నది మా రెండు కంపెనీల లక్ష్యం. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా కంపెనీ అభివృద్ధి చేసిన నెట్‌వర్క్‌, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌, పటిష్ఠ డిస్ట్రిబ్యూషన్‌, పేమెంట్‌ వ్యవస్థ ద్వారా భారత డిజిటల్‌ సేవలను మరింత విస్తృతం చేసేందుకు గూగుల్‌తో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నామ’ని ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ అన్నారు. !


గూగుల్‌కిది రెండో పెట్టుబడి

డిజిటైజేషన్‌ ఫండ్‌ ద్వారా ఈక్విటీ కొనుగోళ్లు, భాగస్వామ్యాల కోసం 5-7 ఏళ్ల కాలంలో భారత్‌లో 1,000 కోట్ల డాలర్లు (రూ.75,000 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు రెండేళ్లక్రితం గూగుల్‌ ప్రకటించింది. 2020 జూలైలో ముకేశ్‌ అంబానీకి చెందిన డిజిటల్‌ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.73 శాతం వాటాను 450 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత భారత్‌లో గూగుల్‌కిది రెండో భారీ పెట్టుబడి.  

Updated Date - 2022-01-29T08:52:16+05:30 IST