సంస్కరణల పేరుతో విద్యారంగం విధ్వంసం

ABN , First Publish Date - 2022-07-01T06:32:54+05:30 IST

నూతన విద్యా విధానం-2020 పేరుతో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వాలు విద్యారంగాన్ని విధ్వంసం చేస్తున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

సంస్కరణల పేరుతో విద్యారంగం విధ్వంసం
నేటి విద్యారంగం-సమస్యలు-పరిష్కార మార్గాలు సదస్సులో ప్రసంగిస్తున్న రమేష్‌ పట్నాయక్‌

జగన్‌, మోదీ నిర్ణయాలపై ఏఐఎ్‌సఎఫ్‌ ఆందోళన

గవర్నర్‌పేట, జూన్‌ 30 : నూతన విద్యా విధానం-2020 పేరుతో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వాలు విద్యారంగాన్ని విధ్వంసం చేస్తున్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎ్‌సఎఫ్‌) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం ఏలూరు రోడ్డులోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) హాలులో ‘నేటి విద్యారంగం-సమస్యలు-పరిష్కార మార్గాలు’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వి.జాన్సన్‌బాబు అధ్యక్షత జరిగిన సదస్సుకు 26 జిల్లాల నుంచి సమాఖ్య ప్రతినిధులు, వివిధ విద్యార్థి, యువజన సంఘాల నేతలు హాజరయ్యారు. ప్రధాన వక్తలుగా ఎమ్మెల్సీలు కేఎస్‌ లక్ష్మణరావు, కత్తి నరసింహారెడ్డి, విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ రమేష్‌ పట్నాయక్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం అధికార కేంద్రీకరణను వేగంగా అమలు చేస్తోందన్నారు. విద్యను రాష్ట్రాల జాబితాలోనే ఉంచాలనే డిమాండ్‌తో వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కలిసి రాజకీయ ఉద్యమం నిర్మించాలని సూచించారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అటు పాఠశాలలు అభివృద్ధి చేస్తూనే ఇటు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా విద్యను నిర్వీర్యం చేస్తోందన్నారు. తక్షణమే 30వేల ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు భర్తీకి డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యారంగంలో కేంద్ర ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. 50శాతం విద్యారంగాన్ని కార్పొరేట్‌ పరం చేసిందన్నారు. విద్యారంగంలో మతతత్వాన్ని, ఆర్‌ఎ్‌సఎస్‌ భావజాలాన్ని జోడిస్తోందన్నారు. విద్యారంగాన్ని కాపాడుకునేందుకు విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన దేశాలే ప్రపంచంలో అగ్రగామిగా నిలిచాయన్నారు. ఎన్‌ఈసీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 117తో రాష్ట్రంలోని పాఠశాల విద్య అస్తవ్యస్తంగా మారి ఎలిమెంటరీ విద్య కనుమరుగౌతోందన్నారు. బైజూస్‌ ఒప్పందంతో భవిష్యత్తులో పాఠశాలల్లో ఉపాధ్యాయులను తగ్గించే ప్రమాదముందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యావ్యవస్థలో విభిన్న సంస్కరణల్ని తెస్తూ కాషాయీకరణకు ప్రయత్నిస్తోందన్నారు. ఉన్నత విద్య విధ్వంసం, ఇంటర్‌ విద్య కార్పొరేట్‌ పరం, ప్రాథమిక విద్య విచ్ఛిన్నం తరహాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలుంటున్నాయన్నారు. శ్రీకాకుళం విద్యార్థులు, తల్లిదండ్రులతో నిర్వహించిన సభలో నన్నెవ్వరూ పీకలేరంటూ సీఎం మాట్లాడటాన్ని తప్పుపట్టారు. సదస్సులో ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, మాజీ జాతీయ కార్యదర్శి జి.ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎన్‌ లెనిన్‌బాబు ప్రసంగించారు.

Updated Date - 2022-07-01T06:32:54+05:30 IST