చెన్నైలో ఉంటున్నా మావన్నీ తెలుగు పద్ధతులే! -ఐశ్వర్యా రాజేశ్‌

Sep 26 2021 @ 23:56PM

‘‘నాకు సౌకర్యంగా అనిపించదు కాబట్టే ఎక్కువగా గ్లామర్‌ పాత్రల్లో కనిపించను. గ్లామర్‌ హంగులకు దూరంగా, నటనా ప్రాధాన్య పాత్రలతో ప్రేక్షకులకు గుర్తుండాలని కోరుకుంటా. కథలో కొత్తదనం ఉంటే చిన్న పాత్రలోనైనా నటిస్తా’’ అని ఐశ్వర్యా రాజేశ్‌ అన్నారు. సాయితేజ్‌ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో జె. భగవాన్‌, జె. పుల్లారావు నిర్మించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. అందులో ఆమె కథానాయికగా నటించారు. అక్టోబర్‌ 1న సినిమా విడుదల కానున్న సందర్భంగా ఐశ్వర్యా రాజేశ్‌ చెప్పిన సంగతులివీ...


‘‘లాక్‌డౌన్‌లో దేవ కట్టా గారు ఫోన్‌ చేసి ‘రిపబ్లిక్‌’ కథ, అందులో మైరా పాత్రను గురించి చెప్పారు. హైదరాబాద్‌ వచ్చి కలిశాక ఐదారు గంటలు కథ చెప్పారు. హీరో హీరోయిన్‌ అని కాకుండా పాత్రేమిటి? ప్రాధాన్యతేమిటి? అని చూస్తారు. పూర్తి స్పష్టతతో సినిమా తెరకెక్కిస్తారు. 


‘రిపబ్లిక్‌’లో ఎన్నారై అమ్మాయి మైరాగా కనిపిస్తా. కథను మలుపు తిప్పే సమస్య వల్ల ఆమె అమెరికా నుంచి ఇండియాకు తిరిగొస్తుంది. నేను అమెరికా యాసలో మాట్లాడడానికి చాలా కష్టపడ్డాను. షూటింగ్‌కు 22 రోజులు పడితే డబ్బింగ్‌కు 15 రోజుల సమయం పట్టింది. సినిమాలో పరిణతి చెందిన ప్రేమకథ ఉంటుంది. ప్రేమ అనేది అంతర్లీనంగా ఉంటుంది తప్ప హీరో, హీరోయిన్ల మధ్య రొటీన్‌ లవ్‌సాంగ్స్‌, ప్రపోజ్‌ చేసే సన్నివేశాలు ఉండవు.


సాయితేజ్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ప్రజల తరపున పోరాడే వ్యక్తిగా కనిపిస్తారు. ఓ పుస్తకంలో డైలాగ్స్‌ రాసుకొని ప్రతి రోజూ గంటల తరబడి ప్రాక్టీస్‌ చేశాడు. కోర్ట్‌రూమ్‌లో పది నిమిషాల సీన్‌ను తేజ్‌ సింగిల్‌ టేక్‌లో పూర్తి చేశారు. తన కెరీర్‌లో ఇది బెస్ట్‌ మూవీ అవుతుంద నుకుంటున్నాను. జగపతిబాబు, రమ్మకృష్ణ మిగతా పాత్రలకు కూడా బలమైన నేపథ్యం ఉంటుంది. 


ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్నాను. తెలుగులో ‘గతం’ దర్శకుడు కిరణ్‌ రెడ్డితో ఓ చిత్రం చర్చల దశలో ఉంది. 


మేము ఉండేది చెన్నైలో అయినా... మావన్నీ తెలుగు పద్ధతులే. తెలుగువారి ఆహారపు అలవాట్లనే కొనసాగిస్తున్నాం. ఉదాహరణకు... తమిళులు సాంబార్‌లో కూరలు కలుపుకొని తింటారు. మన తెలుగువాళ్లు అన్నంలో కలుపుకొని తింటారు. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కు వెళ్లినప్పుడు మనలా తింటుంటే... విచిత్రంగా చూస్తుంటారు. నాకు వంట కూడా వచ్చు. చికెన్‌, చేపల పులుసు చేయడంలో నాకు మంచి ప్రావీణ్యం ఉంది.’’

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.