అజరామరం అమరావతి పోరాటం

ABN , First Publish Date - 2020-10-11T06:13:57+05:30 IST

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతే ఉండాలని రైతులు ఉద్యమం ప్రారంభించి అక్టోబర్‌ 12తో 300 రోజులు పూర్తవుతాయి. రాష్ట్రం కోసం భూమి ఇచ్చిన పాపానికి...

అజరామరం అమరావతి పోరాటం

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే రాజధానులు మార్చాల్సిన అవసరం ఏమిటన్నది సగటు జనావళి మదిలో మెదలాడుతున్న మౌలిక ప్రశ్న. రాష్ట్రానికి రాజకీయ చీడపీడలు సోకి వ్యవస్థలు గుల్లబారిపోకుండా కాచుకోవడం ప్రజాతంత్ర బాధ్యత. సామాన్య జనావళి మాత్రం ప్రస్తుత పరిణామాలను నిష్క్రియగా గమనిస్తున్నారు. రాజధానిపై లక్ష్యశుద్ధి చూపకపోతే ప్రజలు సహించే రోజులు నెమ్మనెమ్మదిగా సన్నగిల్లిపోతాయి. ౧51 సీట్లు వచ్చాయని విర్రవీగుతున్న అధికార పక్షం అమరావతి అంశంతోనే మట్టికరుస్తుంది.


నవ్యాంధ్ర రాజధానిగా అమరావతే ఉండాలని రైతులు ఉద్యమం ప్రారంభించి అక్టోబర్‌ 12తో 300 రోజులు పూర్తవుతాయి. రాష్ట్రం కోసం భూమి ఇచ్చిన పాపానికి పాలకుల చేతుల్లో రైతులు ఎన్నెన్నో అవమానాలకు గురవుతున్నారు. లాఠీచార్జీలు, అక్రమకేసులు ఎదుర్కొంటున్నారు. జైళ్ల పాలవుతున్నారు. ఊపిరి సలపకుండా ప్రభుత్వం భౌతికదాడులకు పాల్పడుతున్నా, బెదిరింపులకు దిగుతున్నా అదరకుండా, బెదరకుండా ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవితవ్యం కోసం రాజధాని రైతులు మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని కొనసాగించడం మహాద్భుత విషయం. కరోనాను సైతం లెక్కచేయకుండా 300 రోజుల నుంచి రైతులు, మహిళలు, చిన్నారులు నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటు. ఈ పోరాటంలో ఇప్పటివరకు 91 మంది రైతులు నేలకొరిగారు. వీటిని ప్రభుత్వ హత్యలుగానే చూడాలా? లేక రైతులు పోరాటంలో అలసిసొలసి కన్నుమూశారనుకోవాలా? 


రైతుల ఘోష ప్రభుత్వం చెవిన పడుతున్నా ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని, మౌనం వీడకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. అవిరామంగా ఉద్యమిస్తున్న వారి పట్ల  చిన్నచూపుతో మంత్రులు, నాయకులు వారి మనస్సులు గాయపరిచేలా సూటిపోటి మాటలు రువ్వుతూ, మహిళా రైతులు అని కూడా చూడకుండా పోలీసులతో దాడి చేయిస్తుంటే దిక్కులు పిక్కటిల్లేలా చేసిన వారి హాహాకారాలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర రాజధానిని కాపాడుకోవడమనే అంశం కేవలం ఆ 29 గ్రామాలకు చెందింది కాదు. ప్రతి ఒక్క తెలుగు వాడికి సంబంధించింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా తగ్గేది లేదంటూ వాటిని తిప్పి కొడుతూ అందరిలోనూ రైతులు ఉద్యమస్ఫూర్తిని నింపుతున్నారు. మహిళా రైతులు దానిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు.


అధికారంలోకి వస్తే అమరావతే రాజధానిగా ఉంటుందని జగన్మోహన్‌ రెడ్డి మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేయడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నాయకుడి మీద ఉన్న కక్షతో ఐదున్నర కోట్ల మంది ప్రజలకు ఆయన అన్యాయం చేస్తున్నారు. వైసీపీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందంటూ పుస్తకాలు అచ్చు వేసి మరి తప్పుడు ప్రచారాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక దాన్ని నిరూపించలేక ఆపసోపాలు పడుతున్నారు. నేడు మాట మార్చి 4వేల ఎకరాల దోపిడి అంటున్నారు. దాన్ని సైతం నిరూపించలేకపోతున్నారు. ప్రభుత్వం ఎంతగా తెగించిందంటే, న్యాయమూర్తులు కూడా రాజధాని పరిధిలో భూములు కొనుగోలు చేశారంటూ తప్పుడు ప్రచారం చేయిస్తోంది. తాము ఏం చేసినా న్యాయస్థానాలు చివాట్లు పెడుతున్నాయనే అక్కసుతో ఉదాత్తమైన న్యాయవ్యవస్థను ఢీకొనే దుస్సాహసం చేస్తోంది.


ప్రజలు అభివృద్ధి లేమిని ప్రశ్నించినప్పుడు పాలకులు వారి మధ్య విద్వేషాలు రెచ్చగొడతారని రాజకీయ పెద్దలు చెబుతారు. నేడు నవ్యాంధ్రప్రదేశ్‌లో అధికారపక్షం పనితీరు చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాజధానిని మార్చాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అయినా అంతకు ముందే అభివృద్ధి జరిగిన చోటకు రాజధానిని తరలించి అదే అభివృద్ధి వికేంద్రీకరణ అని భ్రమింపచేయాలనుకోవడం అవివేకం కాదా? వివాదరహితంగా పరిష్కరమయ్యే రాజధాని అంశాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రే మరింత వివాదాస్పదం చేస్తున్నారు. పాలకుడు మారిన ప్రతిసారీ రాజధాని మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు, విచ్ఛిన్నం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం ఓ రాజకీయక్రీడ. జగన్‌ అమరావతిని కొనసాగించి ఉంటే రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసి ఉండేది కాదు. రాష్ట్ర ఆదాయానికి ఈ ప్రాంతం తలమానికంగా మారుతున్న తరుణంలో ఆయన వ్యక్తిగత, రాజకీయ కారణాలతో ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. అధికార పక్షనేతలకు విశాఖలో వేలాది ఎకరాలు ఉన్నాయి. ఆ నగరంలో భూదందాలు, కబ్జాలు పెరిగిపోయాయి. రాజధాని పేరుతో అక్కడ అధికారపక్షం చేస్తున్న ఆగడాలే ఇందుకు నిదర్శనం. పాలకపక్షానికే చెందిన కొయా ప్రసాద్ వంద ఎకరాల కబ్జాకు పాల్పడిన సంగతి వెలుగులోకి వచ్చింది. వైసీపీ నేతులు ఇళ్లస్థలాల పేరుతో వందల కోట్లు దండుకోవడం సాక్ష్యాధారాలతో బయటపడింది. ఇలాంటివి మున్ముందు ఇంకెన్ని బయటపడతాయో చూడాలి. 


హైదరాబాద్‌, బెంగళూరు నగరాలను తలదన్నే రీతిలో అమరావతి నిర్మాణం జరుగుతుందని, 13 జిల్లాల అభివృద్ధికి పుష్కలంగా నిధులు అందించే పారిశ్రామిక కేంద్రంగా నిలుస్తుందని ఆశిస్తే వైసీపీ అధికారంలోకి రాగానే పరిస్థితిని తారుమారు చేసేసింది. పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్ర యువత ఉద్యోగావకాశాలు కోల్పోయింది. అమరావతి స్వయం ప్రాధారిత ప్రాజెక్టు. రాజధాని నిర్మాణానికి రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, పార్కులు, పరిశ్రమలకు భూ కేటాయింపులు పోగా ప్రభుత్వం వద్ద 10 వేల ఎకరాలు ఉంటుంది. దీన్ని దశల వారీగా విక్రయిస్తే రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అమరావతి నిర్మాణానికి తొలి దశగా కేవలం రూ.56 వేల కోట్లు ఖర్చు పెడితే చాలు. ఈ రూ.56 వేల కోట్లు పోనూ లక్షా 44 వేల కోట్లు నికర మిగులు రాష్ట్ర ఖజానాకు లభించేది. ఈ నిధుల్ని వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి వినియోగించుకునే అవకాశం ఉండేది. సింగపూర్ కన్సార్టియం ఒప్పందాలు కొనసాగి రాష్ట్రానికి 130 సంస్థలు వచ్చి ఉంటే 12.50 లక్షల ఉద్యోగాలు యువతకు లభించేవి. 2050 నాటకి 20 లక్షల మంది ఉద్యోగాలు పొందేవాళ్లు. కానీ అధికార పక్షపు స్వార్థరాజకీయాల వల్ల నేడు ఏ ఒక్క ఉపాధి అవకాశం లేకుండాపోయింది. పైగా ప్రభుత్వం ప్రతి ఒక్క వ్యక్తిపై రూ.25 వేల ఆర్ధిక భారాన్ని మోపింది. అప్పుల కోసం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వెతుకులాట మొదలుపెట్టింది. 


అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే రాజధానులు మార్చాల్సిన అవసరం ఏముంటదని సగటు జనావళి మదిలో మెదలాడుతున్న మౌలిక ప్రశ్న. రాష్ట్రానికి రాజకీయ చీడపీడలు సోకి వ్యవస్థలు గుల్లబారిపోకుండా కాచుకోవడం ప్రజాతంత్ర బాధ్యత. సామాన్య జనావళి మాత్రం ప్రస్తుత పరిణామాలను నిష్క్రియగా గమనిస్తున్నారు. రాజధానిపై లక్ష్యశుద్ధి చూపకపోతే ప్రజలు సహించే రోజులు నెమ్మనెమ్మదిగా సన్నగిల్లిపోతాయి. ౧51 సీట్లు వచ్చాయని విర్రవీగుతున్న అధికార పక్షం అమరావతి అంశంతోనే మట్టికరుస్తుంది.


ప్రపంచవ్యాప్తంగా జరిగిన అహింసా పోరాటాలు ఆయా దేశాలకు స్వాతంత్ర్యం రావడానికి దోహదపడ్డాయి. మహాత్మాగాంధీ, మార్టిన్ లూధర్ కింగ్, నెల్సన్ మండేలాలు పాటించిన అహింసా వాదాన్ని నమ్ముకుంటే ఎంతటి ప్రభుత్వాలైనా దిగరాక తప్పలేదు. పోరాటం అహింసాయుతంగా జరిగితే తప్పకుండా విజయ లక్ష్యాన్ని చేరుకుంటామని చరిత్ర చెబుతోంది. రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు, పోరాటం ఒక్క రాజధాని నిర్ణయం మార్పు గురించి మాత్రమే కాదు; రాష్ట్రంలో జరుగుతున్న కక్షపూరిత విధానాలు, అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, అకృత్యాలపైన జరుగుతున్న పోరాటంగా పరిగణించాలి. 

మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్

Updated Date - 2020-10-11T06:13:57+05:30 IST