Rajya Sabha polls : హర్యానాలో కాంగ్రెస్‌కు పరీక్షా కాలం

ABN , First Publish Date - 2022-06-10T19:23:46+05:30 IST

రాజ్యసభ ఎన్నికల్లో హర్యానా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్

Rajya Sabha polls : హర్యానాలో కాంగ్రెస్‌కు పరీక్షా కాలం

న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల్లో హర్యానా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారు. ఆయన హర్యానాకు చెందినవారు కాదని, బయటి వ్యక్తి అని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి రాజ్య సభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. 


కాంగ్రెస్ (Congress) నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హుడా (Bhoopinder Hooda) నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు  శుక్రవారం ఉదయం విధాన సభకు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్యసభ (Rajya Sabha)కు పోటీ చేస్తున్న అజయ్ మాకెన్ (Ajay Maken) కూడా వారితోపాటు ఉన్నారు. 


ఇదిలావుండగా, స్వతంత్ర ఎమ్మెల్యే రణధీర్ గొల్లెన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ హర్యానాకు చెందినవారు కాదని, ఆయన బయటి వ్యక్తి అని, అందువల్ల ఆయన ఈ ఎన్నికల్లో గెలవబోరని చెప్పారు. ఈ ఎన్నికల్లో హర్యానాకు చెందిన వ్యక్తిని అభ్యర్థిగా నిలిపి ఉంటే బాగుండేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అనుకుంటున్నారన్నారు. సాయంత్రం ఐదు గంటలకు అన్ని విషయాలు తేటతెల్లమవుతాయని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్‌కు ఓటు వేయబోరని, మరొక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటు అనర్హతకు గురైందని చెప్పారు. 


ఐఎన్ఎల్‌డీ నేత అభయ్ చౌతాలా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను తానే నమ్మడం లేదన్నారు. తాను కార్తికేయ శర్మకు ఓటు వేశానని చెప్పారు. ఆయనను తాను అభినందించానన్నారు. 


ఇదిలావుండగా, రెండు కాంగ్రెస్ ఓట్ల చెల్లుబాటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది. 


ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్

కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జనతాదళ్-సెక్యులర్ (జేడీఎస్)కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ, శ్రీనివాస్ గుబ్బి క్రాస్ ఓటింగ్ చేశారు. వీరిద్దరూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేశారు. బీజేపీని ఓడిస్తామని ప్రతిజ్ఞ చేసిన కాంగ్రెస్, జేడీఎస్‌లకు ఈ క్రాస్ ఓటింగ్ చాలా ముఖ్యమైనది. 


శ్రీనివాస్ గౌడ ఓటు వేసిన అనంతరం శాసన సభ నుంచి బయటకు వస్తూ, మీడియాతో మాట్లాడారు. ‘మీరు ఎవరికి ఓటు వేశారు?’ అని అడిగినపుడు ఆయన స్పందిస్తూ, తాను కాంగ్రెస్‌కు ఓటు వేశానని చెప్పారు. ఎందుకు? అని అడిగినపుడు బదులిస్తూ, ‘కాంగ్రెస్ అంటే నాకు ఇష్టం కనుక’ అన్నారు. ఆయన గతంలో మాట్లాడుతూ, తాను జేడీఎస్‌ను వదిలిపెట్టి కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. 


ఈ నేపథ్యంలో జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ కుమార స్వామి మాట్లాడుతూ, తమ పార్టీకి చెందిన 32 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్నారు. వీరిద్దరూ కాంగ్రెస్‌కు ఓట్లు వేశారన్నారు. జేడీఎస్ వంటి లౌకికవాద పార్టీకి మద్దతివ్వడానికి బదులుగా బీజేపీని కాంగ్రెస్ బలోపేతం చేస్తోందని మండిపడ్డారు. 


కర్ణాటక నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు శుక్రవారం జరుగుతున్నాయి. మొత్తం ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గెలవాలంటే ఒక్కొక్క అభ్యర్థికి 45 ఓట్లు అవసరం. బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలిపింది. ఆ పార్టీకిగల ఎమ్మెల్యేల సంఖ్యనుబట్టి వీరిలో ఇద్దరు సునాయాసంగా గెలుస్తారు. కాంగ్రెస్‌ ఒక రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకోగలదు, కానీ ఇద్దరిని నిలిపింది. 


మూడు స్థానాల్లో అభ్యర్థులు సునాయాసంగా గెలుస్తారు. నాలుగో స్థానాన్ని గెలుచుకోవాలంటే అవసరమైన 45 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీకీ లేరు. బీజేపీకి 32 ఓట్లు, కాంగ్రెస్‌కు 24 ఓట్లు, జేడీఎస్‌కు 32 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం బహిరంగంగానే జేడీఎస్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. జేడీఎస్, కాంగ్రెస్ లౌకికవాద సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాయని, అందువల్ల తమ పార్టీ అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్‌కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. జేడీఎస్ కేవలం ఒక అభ్యర్థిని మాత్రమే బరిలో నిలిపింది. 



Updated Date - 2022-06-10T19:23:46+05:30 IST