సాధించిన అజిత్‌ దోభాల్‌

ABN , First Publish Date - 2020-07-07T07:55:20+05:30 IST

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ మరోసారి రంగంలోకి దిగడంతో భారత్‌- చైనా మధ్య ఘనీభవించిన మంచు కరిగిపోయింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యూతో ఆదివారం ఆయన దాదాపు రెండు గంటలపాటు ఫోన్లో కీలక చర్చలు జరిపారు...

సాధించిన అజిత్‌ దోభాల్‌

న్యూఢిల్లీ, జూలై 6: జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ మరోసారి రంగంలోకి దిగడంతో భారత్‌- చైనా మధ్య ఘనీభవించిన మంచు కరిగిపోయింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యూతో ఆదివారం ఆయన దాదాపు రెండు గంటలపాటు ఫోన్లో కీలక చర్చలు జరిపారు. అనంతరం, ఇరు దేశాల సైనికులు మోహరించిన పీపీ 14, పీపీ 15, హాట్‌ స్ర్పింగ్స్‌, ఫింగర్‌ ఏరియాల నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లడం ప్రారంభమవుతుందని, మోహరించిన భార త దళాలు కూడా వెనక్కి వస్తాయని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.


సోమవారం మధ్యాహ్నానికే ఇరు దేశాల మధ్య గత నెల రోజులుగా ఏర్పడిన యుద్ధ వాతావరణం సద్దు మణిగింది. ఈ చర్చల తర్వాత గల్వాన్‌ లోయ నుంచి కిలోమీటరుకుపైగా వెనక్కి తమ బలగాలను, శిబిరాలను ఉపసంహరించుకోవడం చైనా ప్రారంభించింది. దోభాల్‌, వాంగ్‌ యీ మధ్య చర్చలు ప్రధానంగా వాస్తవాధీన రేఖ వెం బడి శాంతిని పునరుద్ధరించడంపై కేంద్రీకృతమయ్యాయని, భవిష్యత్తులో హింసాత్మక ఘర్షణలు పునరావృతం కాకుండా కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారని విదేశాంగశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల ప్రతినిధులు నిర్మొహమాటంగా, లోతుగా సరిహద్దు అంశంపై చర్చించారని వెల్లడించింది. ఏకాభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని, ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా సాగాలంటే విభేదాలు వివాదాలుగా మారేందుకు అనుమతించరాదని దోభా ల్‌, వాంగ్‌ పరస్పరం అంగీకరించారని తెలిపింది. ఇరు వర్గా లు తమ వాస్తవ అధీన రేఖను గౌరవించాలని, యథాతథ స్థితిని మార్చేందుకు ఎవరూ ఏకపక్షంగా చర్యలు తీసుకోరాదని అంగీకారానికి వచ్చినట్లు పేర్కొంది. భారత్‌-చైనా సరిహద్దు వ్యవహారాలపై సమన్వయానికి ఏర్పర్చిన కార్యాచరణ యంత్రాంగం (డబ్ల్యూఎంసీసీ) పరిధిలో చర్చలు సాగాలని ఇరువురు నిర్ణయించినట్లు తెలిపింది. తమ మధ్య చర్చలను ఇదే విధంగా కొనసాగిస్తూ శాంతియుత వాతావరణం భగ్నం కాకుండా చూసుకోవాలని దోభాల్‌, వాంగ్‌ నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.

Updated Date - 2020-07-07T07:55:20+05:30 IST