అజిత్‌ సినీ కెరీర్‌కు 28 వసంతాలు

Jun 5 2021 @ 23:04PM

తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని, కోట్లాది మంది అభిమానులతో ముద్దుగా ‘‘తల’’ అని పిలిపించుకునే హీరో అజిత్‌. ఈయన సినీ జీవితానికి 28 యేళ్ళు. 1993లో జూన్‌ 4వ తేదీన అజిత్‌ ‘అమరావతి’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. కానీ, తమిళ చిత్ర పరిశ్రమకు ఓ అందమైన కుర్రోడు వచ్చాడు అని ప్రతి ఒక్కరూ కామెంట్స్‌ చేశారు. ఆ తర్వాత అజిత్‌ పలు వరుస పరాజయాలు చవిచూశారు. ‘ఆశై’ అనే చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్న అజిత్‌... ఆ తర్వాత ‘కాదల్‌ కోట్టై’ సినిమా.. అజిత్‌ రేంజ్‌ను మరో స్థాయికి చేర్చింది. ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్‌, మరికొన్ని హిట్స్‌ అజిత్‌ ఖాతాలో ఉన్నాయి. 


ఈనేపథ్యంలో 1999లో ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో వచ్చిన ‘వాలి’ చిత్రం అజిత్‌ను స్టార్‌ హీరోని చేసింది. ఇందులోని ఒక పాత్రలో అజిత్‌ నటనకు సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ‘దీనా’ చిత్రం ద్వారా యాక్షన్‌ హీరోగాను రాణించగలరని నిరూపించారు. అయితే, ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ... అజిత్‌ ఇమేజ్‌ మాత్రం ఎక్కడా చెక్కుచెదరలేదు. ఆయన నటించిన పలు చిత్రాలు ఫెయిల్యూర్స్‌ను మూట గట్టుకున్నప్పటికీ... బాక్సాఫీస్‌ వద్ద భారీ ఓపెనింగ్స్‌ రాబట్టి సంచలనం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఇటీవలి కాలంలో ఆయన నటించిన ‘వేదాళం’, ‘విశ్వాసం’ వంటి చిత్రాలు అజిత్‌ను మరింత ఉన్నతస్థానానికి చేర్చాయి. గత యేడాది ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కాలేదు. దీంతో ప్రస్తుతం నటిస్తున్న ‘వలిమై’ చిత్రం అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ నానా హంగామా చేశారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి... ఉన్నత శిఖరాలకు చేరుకున్న.. అజిత్‌కు ఆరంభంలో ఒక్కరంటే ఒక్క అభిమాని కూడా లేరు. ఇప్పుడు ఆయనంటే ప్రాణం ఇచ్చే అభిమానులు లక్షలాది మంది ఉన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.