కరోనా మరణాలను దాయడం లేదు: ఏకే సింఘాల్‌

ABN , First Publish Date - 2021-04-23T10:55:56+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు, కొవిడ్‌ మరణాల తీవ్రతను తగ్గించి చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటూ వస్తున్న కథనాలపై ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి

కరోనా మరణాలను దాయడం లేదు: ఏకే సింఘాల్‌

అమరావతి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు, కొవిడ్‌ మరణాల తీవ్రతను తగ్గించి చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటూ వస్తున్న కథనాలపై ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ గురువారం స్పందించారు. కరోనా మరణాలను దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చెప్పారు. ‘‘కొవిడ్‌ కారణంగా మరణిస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు ప్రకటిస్తున్నారు. కొవిడ్‌ మరణాలు కానివాటిని కూడా ఆ కేసులుగా చూపుతున్నామనేది వాస్తవం లేదు’’ అని వివరించారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ బాగానే జరుగుతోందని, రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్‌ తెప్పించే విషయంలో సీఎం జగన్‌ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.


రాష్ట్రంలో ఎక్కడా వ్యాక్సిన్‌ కొరత లేదని, అన్ని జిల్లాల్లో ఆక్సిజన్‌ అందుబాటులో ఉందన్నారు. అవసరం మేర 320 టన్నుల ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని చెప్పారు. ఆక్సిజన్‌ నిల్వలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్న ఆయన.. ఆక్సిజన్‌ ప్లాంట్ల నుంచి ట్యాంకర్లు ఆస్పత్రులకు వెళ్లే సమయంలో కొంత ఆలస్యం అవుతోందన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T10:55:56+05:30 IST