అకాల వర్షం.. తడిసిన ధాన్యం

ABN , First Publish Date - 2021-05-07T04:40:09+05:30 IST

వైరా మండలంలోని బుధవారం అర్దరాత్రి బారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం
రాష్ట్రీయ ప్రధాన రహదారిపై విరిగిపడిన చెట్లు

వైరా, మే 6: వైరా మండలంలోని బుధవారం అర్దరాత్రి బారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. దాంతో కల్లాలు, రోడ్లపై ఆరబోసి ఉన్న ధాన్యం రాశులు, కాంటా వేసిన బస్తాలు తడిసిపోయాయి. రాత్రి 10గంటల వరకు నిర్మలంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మెరుపులు, ఈదురుగాలులతో ఉన్నఫళంగా వర్షం కురిసింది. ఆసమయంలో రైసతులు ధాన్యం రాశులు, బస్తాలు తడవకుండా కాపాడుకొనేందుకు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పటికీ అనేకమంది రైతులకు చెందిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 


తడిసిన ధాన్యానికి కొనుగోలు చేయాలి: బొంతు డిమాండ్‌


అకాల వర్షంతో తడిసిన ధాన్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేయాలని రైతుసంఘం జి ల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు డిమాండ్‌ చేశారు. గురువారం వైరా ఏఎంసీలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు.ప్రభుత్వం యాసంగి సీజన్‌లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగటం లేదని విమర్శించారు. గత వారంరోజులుగా వాతావరణంలో మార్పులు సంభవిస్తూ వర్షాలు కురుస్తున్నాయని అయినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అందువలన తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని లేనట్లయితే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాయకులు సుంకర సుధాకర్‌, తోట నాగేశ్వరరావు పాల్గొన్నారు.


ఈదురుగాలులతో నేలకూలిన భారీ వృక్షాలు: స్తంభించిన ట్రాఫిక్‌


తల్లాడ: తల్లాడ మండలంలో బుధవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి భారీ వృక్షాలు నేలకూలాయి. తల్లాడ-దేవరపల్లి రాష్ట్రీయ ప్రధాన రహదారిలో నూతనకల్‌ నుంచి రంగంబంజర్‌ వరకు రోడ్డు పొడవునా వృక్షాలు నేలకూలాయి. దీంతో బుధవారం రాత్రి 11గంటల నుంచి గురువారం ఉదయం 10గంటల వరకు రాష్ట్రీయ ప్రధాన రహదారిలో రాకపోకలు స్తంభించిపోయాయి. వందలాది వాహనాల నిల్చిపోయాయి. తల్లాడ పోలీసులు జేసీబీ సహాయంతో రోడ్డుపై పడిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మండలంలోని పలు గ్రామాల్లో మామిడితోటల్లో కాయలు నేలరాలాయి.


Updated Date - 2021-05-07T04:40:09+05:30 IST