ఆకేరు పరవళ్లు

ABN , First Publish Date - 2022-07-07T06:16:59+05:30 IST

ఆకేరు పరవళ్లు

ఆకేరు పరవళ్లు
ఆకేరు చెక్‌ డ్యాంపై నుంచి పరవళ్లు తొక్కుతున్న వరద నీరు

తనగంపాడు వద్ద పూర్తయిన చెక్‌డ్యాం

తుమ్మల కృషితో ఏళ్ల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం

ఐదు గ్రామాలు, సుమారు 500 ఎకరాలకు తాగు, సాగునీరు

హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు, ప్రజలు

ఖమ్మం రూరల్‌, జూలై 6: ‘ప్రతీ రెండు కిలోమీటర్లకు  ఒక చెక్‌ డ్యాం నిర్మించి.. ప్రతీ వర్షపుచుక్కను ఒడిసిపట్టాలి. వేసవిలోనూ మున్నేరు, ఆకేరు కళకళలాడాలి. ఈ క్రమంలో మున్నేరు, ఆకేరు పరివాహకంలో మూడు పంట లు పండాలి. అదే నా ఆకాంక్ష’ అంటూ తుమ్మల నాగేశ్వరరావు ప్రతీ సమావేశంలో పేర్కొనేవారు. ఈ క్రమంలో గూడూరుపాడు, తనగంపాడు రైతులు అడిగిందే తడవుగా ఖమ్మం రూరల్‌ మండలంలోని ఆకేరుపై చెక్‌డ్యాం మంజూ రు చేయించి దాని నిర్మాణానికి రూ.4.29కోట్లు నిధులు మంజురు చేయించారు. అలా రూపుదిద్దుకున్న ఆ చెక్‌ డ్యాం ప్రస్తుతం పూర్తయి.. పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది. 


రూ.4.29కోట్లతో చెక్‌ డ్యాం నిర్మాణం

వేసవిలో సాగు, తాగు నీటి ఎద్దడిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. మున్నేరు, ఆకేరులపైనా పలు చోట్ల చెక్‌డ్యాం నిర్మాణానికి నిధులు మంజురు చేసింది. అందులో భాగంగా గూడురుపాడు, తనగంపాడు గ్రామాల మధ్య ఆకేరులో 2017లో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో చెక్‌ డ్యాంకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అనంతరం పాలేరులో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గత ఎన్నికల్లో తుమ్మల ఓటమితో ఆకేరులో చెక్‌ డ్యాం నిర్మాణానికి కొంత ఆలస్యమైంది. అనంతరం ఈ ప్రాంత రైతుల వినతి మేరకు మాజీమంత్రిగా తుమ్మల రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి ఆకేరు చెక్‌డ్యాంను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. దీంతో కొద్ది రోజుల క్రితం ఆకేరులో చెక్‌ డ్యాంను పూర్తిచేశారు. 


హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజలు

గూడురుపాడు, తనగంపాడు, పిట్టలవారిగూడెం, కస్నాతండా, గోళ్లపాడు గ్రామాల్లో సాగు, తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది. వేసవి వస్తే ఇక్కడి ప్రజలు తాగునీటి కోసం అల్లాడి పోతారు. పక్కనే ఈ గ్రామాల మధ్య నుంచి ఆకేరు పారుతున్నా నీటి కష్టాలు తీరడంలేదు. గూడురుపాడు గ్రామంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోళ్లపాడు చెరువులో ఓ బావిని తీయించి అక్కడినుంచి పైపు లైను ద్వారా నీటిని సరఫరాచేస్తున్నారు. ఈ కష్టాలను చూసిన తుమ్మల తాను మంత్రిగా ఉన్నప్పుడు రెండు గ్రామాల మధ్య ఆకేరుపై చెక్‌ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అదికారులను ఆదేశించారు. దీనిలో భాగంగానే సుమారు 500ఎకరాలకు సాగునీరు, ఐదు గ్రామాలకు తాగునీరందిచేలా తనగంపాడు వద్ద ఆకేరుపై చెక్‌డ్యాంను నిర్మించారు. ఏళ్లనాటి సాగు, తాగు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు, రైతులు.. తుమ్మల కృషితో తమ సాగునీటి కల సాకారమైందని, తాగునీటి కష్టాలు తీరాయని హర్షం వ్యక్తం చేస్తూ.. ఆయనకు కృతజ్ఝతలు తెలుపుతున్నారు. 

Updated Date - 2022-07-07T06:16:59+05:30 IST