Advertisement

అఖిలప్రియను పట్టించిన ఫోన్‌కాల్‌

Jan 12 2021 @ 02:48AM

కిడ్నాప్‌నకు 6 కొత్త సిమ్‌కార్డులు
వాడిన కార్లకూ నకిలీ నంబర్‌ ప్లేట్లు
మీడియా హంగామాతో కిడ్నాపర్ల బెదురు
ప్రవీణ్‌, సోదరులను వదలాలని నిర్ణయం
నిందితుల సెల్‌ నుంచి డీసీపీకి కాల్‌
ఆ నంబర్‌పై విచారణకు డీసీపీ ఆదేశం
ఓ కాల్‌ అఖిల వ్యక్తిగత నంబర్‌కు: సీపీ
అఖిలప్రియకు బెయిల్‌ నిరాకరణ
మూడు రోజుల పోలీసు కస్టడీకి తరలింపు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కటికనేని ప్రవీణ్‌కుమార్‌ (ప్రవీణ్‌రావు), అతని సోదరుల కిడ్నాప్‌ వ్యవహారంలో.. పోలీసులు తొలుత నిందితులు ఎవరో అంచనావేయలేని స్థితిని ఎదుర్కొన్నారు. అనుమానితుల్లో ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మాత్రమే ఉన్నారు. అయినా.. ఆధారాల్లేకుండా, కేవలం అనుమానంతో వారిని అరెస్టు చేస్తే.. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌లో తెలంగాణ పోలీసులకు మచ్చపడే ప్రమాదం. సరిగ్గా ఆ సమయంలో.. ఓ ఫోన్‌కాల్‌ పోలీసులకు క్లూ ఇచ్చింది. కిడ్నాపర్లను పట్టించింది. కిడ్నా్‌పనకు ముందు.. ఎక్కడా దొరకొద్దనే ఉద్దేశంతో.. నిందితులు కొత్తగా కొన్న ఆరు సిమ్‌కార్డుల్లో ఒక దాని నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌ అది. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఈ వివరాలను వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించామన్న సీపీ.. కిడ్నాప్‌ స్కెచ్‌ మొదలు, నిందితుల అరెస్టు వరకు జరిగిన పరిణామాలను వివరించారు.

కిడ్నాప్‌ జరిగిన రోజు రాత్రి టీవీ చానళ్లలో కథనాల ప్రసారంతో కిడ్నాపర్లు బెదిరిపోయారు. సీఎం బంధువుల కిడ్నాప్‌ అని.. సీఎం పీఏ బంధువుల కిడ్నాప్‌ అని, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గాలిస్తున్నారని వార్తలు ప్రసారమవ్వడంతో.. వారిని విడిచిపెట్టాలని నిర్ణయించారు. దాంతో.. తాము క్షేమంగానే ఉన్నామని.. ఇంటికి వస్తున్నామని ప్రవీణ్‌ సోదుడు సునీల్‌ ద్వారా ఉత్తర మండలం డీసీపీకి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తమ ఫోన్‌తో కాల్‌ చేయించారు. వారు క్షేమంగానే ఇంటికి వస్తున్నారని ఊపిరి పీల్చుకున్న పోలీసులకు.. కిడ్నాపర్లకు సంబంధించిన క్లూ ఒక్కటీ దొరకలేదు. కారణం.. కిడ్నాపర్లు ఉపయోగించిన కార్లకు నకిలీ నంబర్‌ప్లేట్లు పెట్టడం.. వారిని బాధితులు గుర్తించకపోవడమే. దాంతో.. డీసీపీ తనకు వచ్చిన ఫోన్‌ నంబర్‌ ఎవరిది? అనే కోణంలో విచారించారు. అది బాధితులకు చెందినది కాదని తేలడంతో.. ఆ ఒక్క క్లూతోనే కిడ్నాపర్లను అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలో.. ఆ నంబర్‌ కాల్‌డేటాను సేకరించారు. అందులో ఓ కాల్‌.. అఖిలప్రియకు వెళ్లినట్లు తేలడం.. అనుమానితుల్లో ఆమె కూడా ఉండడంతో.. వెంటనే అరెస్టు చేశారు. కిడ్నాప్‌ వ్యవహారంలో ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో.. కాల్‌డేటాలో మిగతా నంబర్లపై దృష్టిపెట్టారు. తీగలాగితే.. కిడ్నాప్‌ డొంక కదిలింది.

మరో ముగ్గురి అరెస్టు..
ఈ కేసులో ఏ1 అఖిలప్రియ ఇప్పటికే అరెస్టవ్వగా.. ఏ2 సుబ్బారెడ్డిని విచారించి, వదిలేశారు. అయితే.. డీసీపీకి ఫోన్‌కాల్‌ వచ్చిన నంబరు మల్లికార్జున్‌రెడ్డి అనే వ్యక్తి పేరిట ఉన్నట్లు గుర్తించారు. ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మల్లికార్జున్‌.. మియాపూర్‌లో ఉంటూ.. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ వద్ద పీఏగా పనిచేస్తున్నట్లు నిర్ధారించి, అరెస్టు చేశారు. అతడితోపాటు.. ఏపీలోని అనంతపురం జిల్లా ఆళ్లగడ్డకు చెందిన బోయ సంపత్‌కుమార్‌, కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ దొర్లు బాలచెన్నయ్యకు కూడా ఫోన్‌కాల్స్‌ వెళ్లడంతో.. వారిద్దరినీ అరెస్టు చేశారు. తదుపరి విచారణలో వారు కిడ్నాప్‌ స్కెచ్‌ మొదలు.. పథకం అమలు దాకా జరిగిన పరిణామాలను పోలీసులకు వివరించారు. అఖిలప్రియతోపాటు.. మొత్తం 19 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నిందితుల విచారణ మేరకు పాత్రధారుల సంఖ్య, అరెస్టులు పెరిగే అవకాశాలున్నాయని సీపీ అన్నారు.

ఆరు సిమ్‌కార్డులు.. పక్కాగా ప్లాన్‌ అమలు
ప్రవీణ్‌రావును కిడ్నాప్‌ చేయాలని నిర్ణయించిన అఖిలప్రియ, భార్గవరామ్‌.. పక్కా స్కెచ్‌ వేశారని, ఇందులో గుంటూరు శ్రీను కీలక సూత్రధారి అని సీపీ తెలిపారు. గుంటూరు శ్రీను ఆదేశాలతో.. మల్లికార్జున్‌ తన ఐడీ కార్డులతో ఆరు సిమ్‌కార్డులు కొనుగోలు చేశాడు. వాటిలో ఒకటి అఖిలప్రియ వినియోగించారు. రెండు సిమ్‌లను గుంటూరు శ్రీను, మరో ముగ్గురు నిందితులు మూడు సిమ్‌లను వాడారు. కిడ్నాప్‌ కోసమే వీటిని కొనుగోలు చేశారు. కిడ్నా్‌పనకు ఐదు రోజుల ముందు కూకట్‌పల్లిలోని ఓ హోటల్‌లో పక్కా స్కెచ్‌ వేశారు. సంపత్‌కుమార్‌, బాలచెన్నయ్య ఒక రోజంతా ప్రవీణ్‌రావు ఇంటిముందు రెక్కీ వేశారు. ఇందుకోసం.. నకిలీ నంబర్‌ప్లేటు అమర్చిన బైక్‌ను ఉపయోగించారు. కిడ్నాప్‌ జరిగిన రోజు (5వ తేదీ).. మధ్యాహ్నం ఒంటి గంటకు లోధా అపార్ట్‌మెంట్‌ నుంచి భార్గవరామ్‌, గుంటూరు శ్రీను, ఇతర నిందితులు బయలుదేరి.. యూసు్‌ఫగూడలోని ఎంజీఎం స్కూల్‌కు చేరుకున్నారు. అక్కడ ఐదు ఎస్‌యూవీలు, రెండు కార్లకు నకిలీ నంబర్‌ప్లేట్లను బిగించారు.

అదే సమయంలో.. భార్గవ్‌రామ్‌, గుంటూరు శ్రీనులు ఫోన్లో అఖిలప్రియతో నాన్‌స్టా్‌పగా మాట్లాడారు. ఆ సమయంలో అఖిలప్రియ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. నిందితులు యూసు్‌ఫగూడ నుంచి నేరుగా బోయిన్‌పల్లిలోని ప్రవీణ్‌రావు ఇంటికి వెళ్లారు. ఆదాయపన్ను శాఖ అధికారులమంటూ తనిఖీలు చేసి.. ప్రవీణ్‌రావు, అతని సోదరులను కిడ్నాప్‌ చేశారు. మిగతా నిందితులను త్వరలో పట్టుకుంటామని సీపీ వెల్లడించారు. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితులు భార్గవరామ్‌, గుంటూరు శ్రీనుల ఆచూకీని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. వారిని ఒకట్రెండు రోజుల్లో అరెస్టు చేస్తారని తెలిసింది.

ఆరోపణలను ఖండించిన సీపీ
అఖిలప్రియ అరెస్టు సమయంలో మహిళా పోలీసులు లేరనే ఆరోపణలను సీపీ ఖండించారు. అరెస్టు చేసిన బృందంలో మహిళా పోలీ్‌సస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జ్యోత్స్న, ఆమె సిబ్బంది ఉన్నారని చెప్పారు. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఉందన్నారు. ఆమె అనారోగ్యంతో ఉన్నా పట్టించుకోలేదనే ఆరోపణపై స్పందిస్తూ.. అఖిలప్రియకు పరీక్షలు నిర్వహించిన, వైద్యులు ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు నిర్ధారించారని వివరించారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.