ప్రజలకు దేవుడే దిక్కయ్యాడు: బీజేపీపై అఖిలేష్ విమర్శలు

ABN , First Publish Date - 2022-04-29T00:46:54+05:30 IST

ప్రజల పట్ల పాలనా యంత్రాంగం దురుసుగా ప్రవర్తిస్తోంది. ప్రజాప్రతినిధులే ప్రభుత్వానికి ఆటంకంగా మారారు. ఇక యూపీ ప్రజల కష్టాలు ఎవరు పట్టించుకుంటారు? వారిప్పుడు దేవుడిపైనే భారం వేసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది

ప్రజలకు దేవుడే దిక్కయ్యాడు: బీజేపీపై అఖిలేష్ విమర్శలు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అడుగంటి పోయాయని, బీజేపీకి అధికార అహంకారం తలకెక్కిందని, ప్రస్తుతం ప్రజలకు దేవుడే దిక్కని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. చట్టాలు, శాసనాలు బీజేపీకి ఏమాత్రం పట్టింపు లేవని, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా జంగిల్‌రాజ్ పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.


‘‘ప్రజల పట్ల పాలనా యంత్రాంగం దురుసుగా ప్రవర్తిస్తోంది. ప్రజాప్రతినిధులే ప్రభుత్వానికి ఆటంకంగా మారారు. ఇక యూపీ ప్రజల కష్టాలు ఎవరు పట్టించుకుంటారు? వారిప్పుడు దేవుడిపైనే భారం వేసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది’’ అని అన్నారు. ఇక యూపీలో జరుగుతున్న కొన్ని ఉదహారణలు ఆయన వివరిస్తూ ‘‘బల్లియాలోని సహత్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ భూమి ఆక్రమణను తొలగించేందుకు వచ్చిన తహసీల్దార్‌ను బీజేపీ ఎమ్మెల్యే ప్రజలను రెచ్చగొట్టి అడ్డుకున్నారు. అక్రమ నిర్మాణాలకు రక్షణ కల్పించడం బీజేపీకి ఇదేం కొత్త కాదు. లఖ్‌నవూలో బహిరంగ ప్రదేశాల్లో పొగతాడానికి నిరాకరించినందుకు ఒక ఇన్‌స్పెక్టర్‌ను బీజేపీ నాయకులు దుర్భషలాడారు. ప్రభుత్వ అధికారుల పట్ల ప్రభుత్వ వ్యవస్థల పట్ల బీజేపీ ఎంత మాత్రం గౌరవంగా ఉండదు. పోలీసులపై దాడులు, అధికారులపై దాడులు.. ఎక్కడా చూసినా ఇంతే’’ అని అఖిలేష్ పేర్కొన్నారు.

Updated Date - 2022-04-29T00:46:54+05:30 IST