Kapil Sibal and Samajwadi Party : కపిల్ సిబల్‌కు మద్దతుపై అఖిలేశ్ యాదవ్ స్పందన

ABN , First Publish Date - 2022-05-25T19:43:57+05:30 IST

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కపిల్

Kapil Sibal and Samajwadi Party : కపిల్ సిబల్‌కు మద్దతుపై అఖిలేశ్ యాదవ్ స్పందన

లక్నో : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కపిల్ సిబల్‌ రాజ్యసభ సభ్యత్వం పొందడానికి మద్దతిస్తుండటంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. బుధవారం అఖిలేశ్ మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ మద్దతుతో కపిల్ సిబల్ రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారని తెలిపారు. తమ పార్టీ నుంచి మరో ఇద్దరు రాజ్యసభ సభ్యత్వం పొందబోతున్నారని చెప్పారు. కపిల్ సిబల్ చాలా అనుభవజ్ఞుడైన న్యాయవాది అని, ఆయన తన అభిప్రాయాలను, అదేవిధంగా సమాజ్‌వాదీ పార్టీ అభిప్రాయాలను పార్లమెంటులో వ్యక్తం చేస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. 


కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది నేతల్లో కపిల్ సిబల్ ఒకరు. ఆయన బుధవారం అఖిలేశ్ యాదవ్, ఇతర సమాజ్‌వాదీ పార్టీ నేతల సమక్షంలో రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కపిల్ మీడియాతో మాట్లాడుతూ, తాను స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. దేశంలో స్వతంత్ర గళంగా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకునేవాడినని చెప్పారు. తాను మే 16న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించానని చెప్పారు. తనకు మద్దతిచ్చినందుకు అఖిలేశ్ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటులో స్వతంత్ర గళం ఉండటం చాలా అవసరమని చెప్పారు. ఓ స్వతంత్ర గళం మాట్లాడితే ఆ మాటలు ఏదైనా రాజకీయ పార్టీ నుంచి వచ్చినవి కాదని ప్రజలు విశ్వసిస్తారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘ప్రతిపక్షంలో ఉంటూ, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మోదీ ప్రభుత్వ తప్పులు ప్రజలకు చేరే వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నాం. దాని కోసం మేం ప్రయత్నిస్తాం’’ అని కపిల్ సిబల్ అన్నారు. 


సిబల్‌కు మద్దతు వెనుక...

సమాజ్‌వాదీ పార్టీ తరపున కపిల్ సిబల్‌కు రాజ్యసభ సభ్యత్వం రాబోతున్నట్లు ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ తరపున ఓ కేసులో న్యాయవాదిగా వ్యవహరించారు.  దాదాపు రెండేళ్ళు జైలులో గడిపిన ఆజం ఖాన్‌కు ఇటీవల సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. దీంతో సిబల్‌పై ఆజం ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. రాజ్యసభ సభ్యత్వం కోసం ఎన్నికల బరిలో సిబల్‌ను నిలపడానికి తమ పార్టీ ఆలోచిస్తే తాను చాలా సంతోషిస్తానని చెప్పారు. ఆయన చాలా సమర్థుడని, ఆ పదవికి అర్హుడని చెప్పారు. 


సమాజ్‌వాదీ పార్టీలో చీలిక వచ్చినపుడు ఎన్నికల గుర్తు ‘సైకిల్’ అఖిలేశ్ వర్గానికి దక్కే విధంగా చేయడంలో కపిల్ సిబల్ 2017లో సఫలమయ్యారు. ఇటువంటి అంశాలు కపిల్‌కు కలిసివచ్చాయి. 


57 రాజ్యసభ స్థానాలకు  15 రాష్ట్రాల్లో జూన్ 10న ఎన్నికలు జరుగుతాయి. ఉత్తర ప్రదేశ్‌లోని 11 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం జూలై 4న ముగుస్తుంది. 


‘చెయ్యి’స్తున్న కీలక నేతలు

ఎన్నికల్లో వరుస పరాజయాలతోపాటు కీలక నేతలు ‘చెయ్యి’ వదలడం వల్ల కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది. ఇటీవలే గుజరాత్‌ యువ నేత హార్దిక్ పటేల్, పంజాబ్ సీనియర్ నేత సునీల్ జక్కర్ ఆ పార్టీని వదిలిపెట్టారు. అంతకుముందు హిమంత బిశ్వ శర్మ, పెమా ఖండు, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, అదితి సింగ్, కీర్తి ఆజాద్, రీటా బహుగుణ జోషీ వంటివారు ఆ పార్టీకి రాజీనామా చేశారు. 


Updated Date - 2022-05-25T19:43:57+05:30 IST