చమురు మంత్రిత్వ శాఖను రద్దు చేయండి : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2022-04-09T18:30:58+05:30 IST

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్

చమురు మంత్రిత్వ శాఖను రద్దు చేయండి : అఖిలేశ్ యాదవ్

లక్నో : భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలను నిరుపేదలుగా మార్చుతోందని, వారిని దోచుకుంటోందని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. చమురు మంత్రిత్వ శాఖను రద్దు చేయాలని సలహా ఇచ్చారు. 


అఖిలేశ్ యాదవ్ శనివారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, దురుసుతనంతో పెరుగుతున్న ఇంధనం ధరలను ప్రభుత్వ నియంత్రణలు, చట్టం,  పరిపాలన లేదా నిర్వహణ నియంత్రించలేకపోతే, అంతా మార్కెట్‌కే ఆధీనంలోనే ఉంటే, పెట్రోలియం మంత్రిత్వ శాఖ వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే ఈ మంత్రిత్వ శాఖను రద్దు చేయాలన్నారు. 


అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం

పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ఇటీవల లోక్‌సభలో మాట్లాడుతూ, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ ధరలు పెరగడం వల్ల మన దేశంలో పెట్రోలు ధరలు పెరుగుతున్నాయని చెప్పారు.  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం కేవలం మన దేశంపైనే కాకుండా ఇతర దేశాలపై కూడా ఉందని చెప్పారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరల విషయంలో ఇతర దేశాల్లో పెరిగిన ధరలో పదో వంతు మాత్రమే మన దేశంలో పెరుగుతోందని చెప్పారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లో వీటి ధరల పెరుగుదల 51 శాతం ఉందని, మన దేశంలో మాత్రం 5 శాతం మాత్రమే పెరిగిందని తెలిపారు.


పెరుగుదల అనివార్యం

అంతకుముందు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనం ధరలు అనేకసార్లు పెరిగాయని, అందువల్ల మన దేశంలో ఇంధనం ధరల పెరుగుదల అనివార్యమని తెలిపారు. 


మూడు రోజుల నుంచి మార్పు లేదు

ఇదిలావుండగా, గురువారం నుంచి శనివారం వరకు వరుసగా మూడు రోజులపాటు పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పు లేదు. బుధవారం పెట్రోలు, డీజిల్ ధరలు  లీటరుకు 80 పైసల చొప్పున పెరిగాయి. అంటే 16 రోజుల్లో లీటరుకు రూ.10 చొప్పున పెరిగింది. 


Updated Date - 2022-04-09T18:30:58+05:30 IST