అఖిలేష్ యాదవ్ పోటీకి రెడీ... సీటు సస్పెన్స్

ABN , First Publish Date - 2022-01-19T17:04:04+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు..

అఖిలేష్ యాదవ్ పోటీకి రెడీ... సీటు సస్పెన్స్

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ  అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన అజాంగఢ్ ఎంపీగా ఉన్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీకి నిర్ణయించుకున్నారు. అయితే, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని మాత్రం ఇంకా బయటకు వెల్లడించడం లేదు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు  లక్నోలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో తన పోటీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.


కాగా, ఇప్పటికే తమ పార్టీ సీఎం అభ్యర్థిగా సిట్టింగ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరును బీజేపీ ప్రకటించింది. అఖిలేష్, మాయవతి, ప్రియాంక వాద్రా గాంధీ పోటీ చేస్తున్నారో, ఓడిపోతామనే భయంతో పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నారో ప్రజలకు వివరించాలని బీజేపీ సవాలు చేసింది. మాయావతి పోటీ చేయడం లేదని బీఎస్‌పీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఎన్నికల బరిలోకి దిగితే పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి. యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు 7 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10తో మొదలై మార్చి 7తో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లతో ఘనవిజయం సాధించగా, ఎస్‌పీ 47 సీట్లు, బీఎస్‌పీ 19 సీట్లు, కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకున్నాయి.

Updated Date - 2022-01-19T17:04:04+05:30 IST