కాంగ్రెస్ బాటలో బీజేపీ : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2021-12-18T17:49:54+05:30 IST

బెదిరింపు రాజకీయాల్లో కాంగ్రెస్‌ను బీజేపీ అనుసరిస్తోందని

కాంగ్రెస్ బాటలో బీజేపీ : అఖిలేశ్ యాదవ్

లక్నో : బెదిరింపు రాజకీయాల్లో కాంగ్రెస్‌ను బీజేపీ అనుసరిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలు, మద్దతుదారుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడుల నేపథ్యంలో అఖిలేశ్ స్పందిస్తూ బీజేపీ ప్రతిపక్షాలను బెదిరించేందుకు కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందన్నారు. 


అఖిలేశ్ శనివారం విలేకర్లతో మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్ మాదిరిగా బీజేపీ కూడా అదే దారిలో వెళ్తోంది. కాంగ్రెస్ గత చరిత్రను చూడండి, ఎవరినైనా బెదిరించాలనుకుంటే, కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటూ ఉండేది. నేడు బీజేపీ కూడా అదే చేస్తోంది’’ అని అన్నారు. రాష్ట్రంలో రామ రాజ్యాన్ని తెస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో బీజేపీ విఫలమైందని చెప్పారు. రామరాజ్యాన్ని తీసుకొస్తామని బీజేపీ చెప్పేదని, అయితే సామ్యవాద మార్గమే రామరాజ్యాన్ని తీసుకొస్తుందని తెలిపారు. సామ్యవాదం వస్తే రామ రాజ్యం వస్తుందని తెలిపారు. 


ఆదాయపు పన్ను శాఖ అధికారులు శనివారం ఉదయం వారణాసి నుంచి మావు చేరుకుని,  సహదత్ పురలోని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ నివాసంలో సోదాలు చేశారు. ఆయన పన్ను ఎగవేసినట్లు అనుమానంతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకుని నినాదాలు చేశారు. పోలీసులు స్పందిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని ప్రజలను కోరారు. 


మయిన్‌పురిలోని ఆర్‌సీఎల్ గ్రూప్ యజమాని మనోజ్ యాదవ్‌ నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. అదేవిధంగా లక్నోలోని జైనేంద్ర యాదవ్ నివాసంలో కూడా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి. వీరిద్దరూ అఖిలేశ్ యాదవ్‌కు సన్నిహితులేనని తెలుస్తోంది. 



Updated Date - 2021-12-18T17:49:54+05:30 IST