న్యాయంగా అయితే కృష్ణుడి వేషానికి ఎన్టీఆర్ కంటే నేనే బెటర్

ABN , First Publish Date - 2020-02-08T07:16:25+05:30 IST

ఎవర్‌గ్రీన్‌ హీరో అని ఎవరన్నారో గానీ, ఆయన అక్షరాలా ఎవర్‌గ్రీనే. 86 ఏళ్ల వయసులోనూ దసరా బుల్లోడిలాగే ఉంటారు. రూపమే కాదు. ఆలోచనల్లోనూ అంతే స్పష్టత. కళాకారుడిగా దాదాపు ఏడు దశాబ్దాలు నడిచిన

న్యాయంగా అయితే కృష్ణుడి వేషానికి ఎన్టీఆర్ కంటే నేనే బెటర్

ఎవర్‌గ్రీన్‌ హీరో అని ఎవరన్నారో గానీ, ఆయన అక్షరాలా ఎవర్‌గ్రీనే. 86 ఏళ్ల వయసులోనూ దసరా బుల్లోడిలాగే ఉంటారు. రూపమే కాదు. ఆలోచనల్లోనూ అంతే స్పష్టత. కళాకారుడిగా దాదాపు ఏడు దశాబ్దాలు నడిచిన ఈ బహుదూరపు బాటసారి, లివింగ్‌ లెజండ్‌ ఏఎన్నార్‌... 28-12-2009న ఓపెన్‌ హార్ట్‌ విత ఆర్కేలో తన అనుభవాలు పంచుకున్నారు. ‘‘హీరోయిన్లను మేకప్‌కు ముందు, తర్వాత చూసేవాళ్లం మేము. మీకున్న మోజులు మాకుంటాయనుకోవడం పొరపాటు. అమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడే ఎవర్నీ ముట్టుకోలేదు. మిత్రులు పార్టీ పేరుతో బుక్‌చేస్తే మందు మాత్రం ఒకటి రెండు సార్లు తాగాను’’ అని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమ పరిస్థితి చూస్తే వేదన కలగడం వాస్తవమే అయినా.. ఎదిగిన బిడ్డగా ఇపుడు సినీ తల్లిని తిట్టలేను, పొగడలేనని చెప్పారు. ఎన్టీ రామారావు, తాను పరిశ్రమలో చాలా స్నేహంగా ఉండేవాళ్లమని... ఆయన సీఎం అయ్యాక ఓసారి తానేదో మాట్లాడితే గిట్టనివారు ఆయనకు కల్పించి చెప్పడంతో విభేదాలు మొదలయ్యాయన్నారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎప్పుడూ లేదన్న అక్కినేని అంతరంగం..


నమస్కారం నాగేశ్వరరావు గారు..

నమస్కారం... నా ఓపెన్‌హార్ట్‌ కొంచెం అటూఇటూగా ఉంటుంది. నా గుండెమీద ఓ మచ్చ ఉంది. అందువల్ల నా గుండెలో కొన్ని డిఫెక్టులున్నాయి. వాటిని అటూ ఇటూ సర్దుకోవాలి.


ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేయించుకున్న వాళ్లలో ఇంత ఆరోగ్యంగా ఇన్నాళ్లు ఉన్నవారు అరుదు కదా?

నాకు ఆపరేషన్‌ 1974 అక్టోబర్‌ 18న జరిగింది. తర్వాత ఓసారి గుండెపోటు వచ్చి పడిపోయాను. యాంజియోగ్రామ్‌ చేస్తే 35 సామర్థ్యంతో గుండె పనిచేస్తోందన్నారు. 1988లో అమెరికా వెళ్లాను. అక్కడ వారు తెరిచిన తర్వాత.. గుండె పనితీరు చూసి, ఆపరేషన్‌ వద్దనుకున్నారు. వారి లెక్క ప్రకారం.. మహా అయితే మూడు నాలుగేళ్లు పనిచేయాలి. ఇప్పటికీ ఉన్నా.


అప్పుడు, ఇప్పుడు సినిమా పరిస్థితిలో తేడా ఏముంది?

ఏ తల్లిలోనూ లోపాలుండవు. ఆ తల్లి పాలు తాగి, ఎదిగి, వృద్ధిలోకొచ్చినా మనం ఆ తల్లి పిల్లలమే. ఎదిగిన బిడ్డగా ఇపుడు నా తల్లిని తిట్టలేను. ఇండస్ట్రీని తిట్టలేను, పొగడలేను, మీరడిగితే సమాధానం చెప్పలేను. వేదన కలగడంలో సందేహం లేదు. ఇపుడు ఆడపిల్లల బట్టలు చూస్తుంటే అమ్మకాల్లేక మిల్లులు దెబ్బతినేలా ఉన్నాయి.


ఇలా ఉండాలని గైడ్‌ చేయాలన్న భావన ఎపుడైనా వచ్చిందా?

ఎవరిని గైడ్‌ చేయాలి? ఎవరైనా అడిగితే చెబుతాను గానీ, ఎవరూ అడగరు. నా పిల్లలే కొన్నిసార్లు అడక్కపోవచ్చు. ఓసారి నాగార్జున మూమెంట్స్‌లో అసభ్యత ఉందని అంటే, ‘‘నాన్నా.. మీరు మిగతా సినిమాలు చూడట్లేదు. మీరు అంతా ఒకేలా ఉండేవారు. ఇపుడు పోటీలో నిలబడాలంటే కొంత తప్పదు. వాళ్లు చేసినంత కాకపోయినా కొంత చేయాలికదా’’ అన్నాడు.


నాడు మీకున్న అర్హతలు ఇప్పుడు వస్తున్నవారికీ ఉన్నాయా?

ఆ రోజు ఏ పాత్రలో నటించాలంటే.. ఆ లక్షణాలు తప్పనిసరి. కానీ వాళ్లకు పుట్టిన బిడ్డలందరికీ అవే లక్షణాలుండాలని లేదు కదా. మా కుటుంబంలో నాగార్జున, నాగచైతన్య ఎంతో శిక్షణ పొందిన తరువాతే ఈ రంగంలోకి వచ్చారు.


రామారావుగారికి, మీకు పోటీ అని ఎప్పుడు అనుకున్నారు?

పోటీ అని నిర్మాతలే అనేవారు. ఆయన నాకంటే పొడవు, అందగాడు, మంచి కంఠం ఉంది. దాంతో పాత్రల ఎంపికలో జాగ్రత్త పడేవాడిని. ఆయన రావణాసురుడి వేషం, దుర్యోధనుడి వేషం వేశారు. నన్ను కర్ణుడి వేషం వేయాలని ఆనే అడిగారు. న్యాయంగా అయితే కృష్ణుడి పాత్రకు ఆయనకంటే నేనే బెటర్‌. కృష్ణుడు పొట్టివాడు. మాయలమరాఠీ. నేను పనికొస్తాను. అయినా ఆయన పాపులర్‌ అయ్యారు కాబట్టి నేను ఆ జోలికి వెళ్లలేదు. ఇద్దరం చాలా స్నేహంగా ఉండేవాళ్లం.


ఆ స్నేహం ఎక్కడ దెబ్బతింది? మధ్యలో ఎవరైనా చెడగొట్టారా?

ఎక్కడా చెడిపోలేదు. నేను, రామారావుగారు కలిసి 15కుపైగా సినిమాల్లో కలిసి నటించాం.


ఆ స్నేహం ఎక్కడ దెబ్బతింది? మధ్యలో ఎవరైనా చెడగొట్టారా?

ఎక్కడా చెడిపోలేదు. నేను, రామారావుగారు కలిసి 15కుపైగా సినిమాల్లో కలిసి నటించాం.


అవకాశాల గురించి ఇద్దరి మధ్య సమస్యలొచ్చాయా?

పోటీ అంటే ఉంటుంది. ఇందులో త్యాగాలకు స్థానం లేదు. అయితే.. అవకాశాల విషయంలో మాకెప్పుడూ తేడాలు రాలేదు.


వ్యక్తిత్వాల విషయంలో.. మీకు, ఆయనకు వ్యత్యాసం ఏమిటి?

ఆయన కాస్త ఆవేశపరుడు. నాకు కోపతాపాలున్నాయి కానీ ఆలోచన కూడా ఉంది. ఒకసారి మా మధ్య ఓ పేచీ వచ్చింది. ఆదిశంకరుడిది ఓ శ్లోకముంది. ‘ముంగీలుంచిత కేశాః కాషాయాంబర’ కాషాయ వసా్త్రలు ధరించి, గడ్డాలు, మీసాలు పెంచినంత మాత్రాన అందరూ ఉత్తములైపోరని, ఇవన్నీ పొట్ట కోసం వేసే వేషాలని దానర్థం. రవీంద్రభారతిలో నేను ఈ శ్లోకం చదివితే జనం నవ్వారు. అప్పుడే ఎన్టీఆర్‌ సీఎంగా వివేకానందుడి వేషంలో ఉన్నాడు. వారు నవ్వితే గానీ నాకా విషయం గుర్తురాలేదు. నేను ఆయననే అన్నానని ఎవరో ఎక్కించేశారు. ఆయన ఆలోచించలేదు. నేను మాట్లాడిన క్యాసెట్‌ తనకు పంపాలని హుకుం వేశారట. ఆ విషయం నాకు తెలిసి ముఖ్యమంత్రి అధికారం చలాయించడం మొదలు పెట్టినట్టుందే అనుకున్నా. తరువాత స్టూడియో మీదకు వచ్చాడు. అప్పటినుంచి నేను పక్కన పెట్టడం మొదలుపెట్టాను. రెండోసారి సీఎం అయినపుడు సినీ ప్రముఖులు అంతా ఆయనను కలవాలని వెళ్లారు. తరువాత ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్లాను. అక్కడ జరిగిందేదో జరిగిపోయిందని ఇద్దరమూ అనుకున్నాం. తరువాత నేనూ వారిని ఆహ్వానించాను.


స్టూడియో వివాదం ఏమైంది?

కొంతకాలం కొనసాగింది. నేను హై కోర్టుకు వెళ్తే న్యాయం జరిగింది. అప్పుడు ఎన్టీఆర్‌ అధికారంలో ఉంటే.. సుప్రీం కోర్టుకు వెళ్లేవాడు. దానికీ నేను సిద్ధపడ్డాను.


మీరు ఫోర్త్‌క్లాస్‌తో ప్రపంచాన్ని చదివిన మనిషి. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడే శక్తి ఎలా సాధించారు?

ఇదంతా ఓ బాధతో, కసితో వచ్చింది. ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఓసారి నేను, అన్నపూర్ణ సిలోన్‌ వెళ్లాం. వాళ్లు నన్ను తమిళహీరో అనుకున్నారు. నాకు ఇంగ్లీషు రాదు. ఏదోలా తిప్పలు పడి ఇంగ్లీషులో మాట్లాడితే, కాదు.. తమిళంలో మాట్లాడాలని కోరారు. నాకు అదీ రాదు. ఏదో మాట్లాడితే నవ్వారు. దాంతో హేళన చేస్తున్నారని అర్థమై బాత్రూంకు వెళ్లి ఏడ్చేశాను. మళ్లీ తేరుకుని.. పట్టుదల పెంచుకున్నాను. ఓసారి బీఎన్‌ రెడ్డిగారు నీకు చాలా భవిష్యత్తుంది, ఇంగ్లీషు రావట్లేదు కాబట్టి ఇబ్బంది పడతావు. టీచర్‌ని పెట్టుకో అన్నారు. టైం లేదంటే హిందూ పేపర్‌ కొని డిక్షనరీ చూసి నేర్చుకొమ్మన్నారు. 64లో నన్ను అమెరికా పిలిచారు. శివాజీ గణేశన్‌ 63లో ఓ అనువాదకుడిని తీసుకెళ్లారు. నేను అలా లేకుండా వెళ్దామనుకున్నాను. వెళ్లి, చిన్న చిన్న మాటలతో కొన్నాళ్లు కాల క్షేపం చేశాను. మిచిగన్‌ యూనివర్సిటీలో పావుగంట మాట్లాడాల్సి వచ్చింది. ధైర్యంగా మాట్లాడితే అంతా బాగుందన్నారు. అక్కడినుంచి వచ్చేసరికి గంటపాటు ఇంగ్లీషులో మాట్లాడే సామర్థ్యం వచ్చింది.


మేనమామలు పిల్లనివ్వడానికి ఏ వయసులో నిరాకరించారు?

నా 19వ సంవత్సరం. 1944 మే 8న మద్రాసు వెళ్లాను. ఈలోపు పెళ్లిచేసి పంపితే మంచిది, అక్కడికెళ్తే చెడిపోతారని అమ్మ అనుకుంది. మావయ్య అప్పుడే ఎందుకు, చిన్నపిల్లలు కదా అన్నారు. ఆయన భార్య అక్కినేని వారి ఆడపడుచు. మగబిడ్డ తల్లిదండ్రులకే అనుమానమొస్తే ఇక ఆడపిల్ల తల్లిని నాకెంత అనుమానం ఉండాలి అంది. తర్వాత మా అమ్మ, మావయ్య విడిపోతున్నామని ఏడుస్తున్నారు. ఎందుకని అడిగితే ఇలా అనుకుంటున్నారని అమ్మ చెప్పింది. అమ్మా.. నీకు ఒట్టు పెడుతున్నాను. నేనలాంటి పనులు చేయను. అని చెప్పాను. పరిశ్రమలో చాలామంది గేలి చేశారు. నపుంసకుడిని అన్నారు.


ఎన్టీఆర్‌ అడిగితే రాజకీయాల్లోకి రానన్నారు. తరువాత ఎప్పుడైనా వెళ్తే బాగుండేదనిపించిందా?

నేను మొదటినుంచి మానసికంగా చాలా దృఢంగా ఉన్నాను. పిల్లల సాక్షిగా చెప్తున్నాను. నాకు.


ఎన్టీఆర్‌ అడిగితే రాజకీయాల్లోకి రానన్నారు. తరువాత ఎప్పుడైనా వెళ్తే బాగుండేదనిపించిందా?

నేను మొదటినుంచి మానసికంగా చాలా దృఢంగా ఉన్నాను. పిల్లల సాక్షిగా చెప్తున్నాను. నాకు.. ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనే లేదు. దర్శకత్వ బాధ్యతలకూ అంతే దూరంగా ఉన్నాను.


చంద్రబాబుతో మంచి రిలేషన్స్‌ ఏర్పడ్డాయి కదా?

చంద్రబాబు యువకుడు.. నన్ను గౌరవించేవాడు. అంతమాత్రాన నాది టీడీపీ కాదు. నేను మొదటినుంచి కాంగ్రెస్‌వాణ్ని. నన్ను రాజ్యసభ సభ్యునిగా నామినేట్‌ చేయాలని ప్రయత్నించినట్టు తెలిసింది. కానీ.. ఇష్టంలేదు.


మీ అమ్మగారికి ఇచ్చిన మాట కోసం ఏ హీరోయిన్‌నీ మీరు టచ్‌ చేయలేదా?

టచ్‌ అంటే.. సినిమాల్లో ముట్టుకుంటాం. ఏం.. మీరనే టచ్‌ మీరు చేయలేదా? (నేను హీరోని కాను కదా) బయటివాళ్లే ఎక్కువ టచ్‌ చేస్తారు సార్‌.. అవకాశాలు కాస్త ఎక్కువుంటాయి. అవకాశాలు లేని ప్రతివాడూ శ్రీరామచంద్రుడే అంటాను. నేను అవకాశం ఉండీ అంటుకోలేదు. పైగా పాపులారిటీ. ఎప్పుడైనా ఆశపుట్టినా, మనసు లాగినా.. మన కెరీర్‌ ఏమవుతుంది? అమ్మకిచ్చిన మాట ఏమవుతుంది? నలుగురూ ఏమనుకుంటారన్న భయం ఉంటుంది.


అయితే మీరు శ్రీరామచంద్రుడినంటారన్న మాట..

శ్రీరామచంద్రుడంటే ఏకపత్నీవ్రతుడే కాదు. మనల్ని కట్టుదిట్టం చేయడానికి ఆయన్ని అలా క్రియేట్‌ చేసింది వాల్మీకి. అదో పాత్ర అంతే. ఇది ప్రయోజనం లేదని కృష్ణుడిని క్రియేట్‌చేశారు. నాలో కృష్ణుడి భావాలున్నాయి, రామచంద్రుడి లక్షణాలున్నాయి. నేను ఊహల్లో కూడా ఈ అమ్మాయి భలే బాగుంటుంది అనుకోకుండా లేను. అలా చెప్పను. ఎవరైనా చెప్పినా అది హిపోక్రసీ అంతే. నాకు ఎవరిమీదైనా కోరిక కలిగినా ఎక్కడకు తీసుకెళ్లగలను? అందరూ గుర్తుపడతారు కాబట్టి మాలాంటి వాళ్లకు తప్పులు చేయడం కూడా కుదరదు. కలలో కూడా ఎరగం అంటే శుద్ధ అబద్ధాల కోరులన్నమాటే.


అంటే.. ఒక్కరంటే ఒక్కరు కూడా మిమ్మల్ని గట్టిగా ఆకర్షించలేదా?

కచ్చితంగా లేదు. హీరోయిన్లను మేకప్‌కు ముందు, తరువాత చూసేవాళ్లం మేము. మీకున్న మోజులు మాకుంటాయనుకోవడం పొరపాటు.


ఏబీఎన్‌ ప్రేక్షకుల కోసం.. మీరు మరిచిపోలేని అనుభూతి..

తాగను.. పిచ్చివేషాలు వేయనని అమ్మకు మాటిచ్చాను. అందుకే వాటికి దూరంగా ఉన్నాను. మందు మాత్రం ఒకటి రెండు సార్లు తాగాను. కోవెలమూడి ప్రకాశరావు నా దగ్గర అప్పుడప్పుడూ డబ్బులు తీసుకునేవారు. ఓరోజు వచ్చి.. వెయ్యి కావాలంటే ఇచ్చాను. తర్వాత ఇది అప్పు కాదు.. దీపావళి మామూలు అన్నారు. ప్రతి దీపావళికి వాళ్ల మిత్ర బృందం ఇలాగే వసూలు చేసి మందుపార్టీ పెట్టుకుంటారట. సరే.. మందెలా ఉంటుందో చూడాలని సరదాపుట్టి నేనూ వెళ్లాను. బాత్రూంకి వెళ్లి వస్తూ వాళ్ల మాటలు విన్నాను. ఫుల్లుగా మందు కొట్టించి నా రహస్యాలన్నీ కక్కించాలని ప్లాన్‌ చేశారు. మళ్లీ వచ్చి వారితో చేరాను. కాసేపటికి ఫుల్‌ అయిపోయినట్టు నటించాను. అసలు విషయం బయటపెట్టారు. ముందు వాళ్లని చెప్పమన్నాను. అందరూ చెప్పేశాక, నాకు అలాంటివేమీ లేవని చెప్పేసి బయటికొచ్చేశాను.


అప్పట్లో ఒక హీరోయిన్‌ కోసం మీరు, ఎన్టీఆర్‌ పోటీపడేవారని ఇండస్ట్రీలో చెప్పుకునేవారు.. నిజమేనా?

హీరోయిన్‌లతో చనువుగా ఉండేవాడిని. అంతే. పోటీ మాత్రం ఎప్పుడూ లేదు. మేం ఇండసీ్ట్రకి వెళ్లిన కొత్తలో భానుమతి గారంటేభయం. ఆమె సీనియర్‌. ఆమెతో నటించేప్పుడు చేయి వేయాలంటే.


అప్పట్లో ఒక హీరోయిన్‌ కోసం మీరు, ఎన్టీఆర్‌ పోటీపడేవారని ఇండస్ట్రీలో చెప్పుకునేవారు.. నిజమేనా?

హీరోయిన్‌లతో చనువుగా ఉండేవాడిని. అంతే. పోటీ మాత్రం ఎప్పుడూ లేదు. మేం ఇండస్ట్రీకి వెళ్లిన కొత్తలో భానుమతి గారంటేభయం. ఆమె సీనియర్‌. ఆమెతో నటించేప్పుడు చేయి వేయాలంటే.. వణికిపోయేవాణ్ని. ఆ బిడియం పోయి.. ఈ చిలిపి లక్షణాలు వచ్చేందుకు చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. సావిత్రి విషయంలోనూ అంతే. ఈ సారి ఆమె భయపడింది. ఆమె భయం వల్ల ఓ సినిమా మధ్యలో ఆమెను తీసేశారు. అప్పటి నుంచే నేను హీరోయిన్లతో కాస్త చనువు మొదలుపెట్టాను.


మీకు సంతోషం కలిగించిన సంఘటన

కాళిదాసు కౌస్తుభం.. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఈ అవార్డు ఇస్తుంది. 200 మంది సంస్కృత పండితులు, ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. అది నేను ఊహించలేదు. అవార్డు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఫీలయ్యాను. పద్మశ్రీ, పద్మభూషణ్‌, ఇక ఆ తరువాత అల్టిమేట్‌ అంటే దాదాసాహెబ్‌ ఫాల్కే.


ఆవేదన కలిగించిన సంఘటన

పెద్దకుమార్తె చనిపోయినప్పుడు బాగా బాధపడ్డాను. జీవితంలో అన్నీ నా దగ్గరకే నడిచివచ్చాయి. అన్నీ సంతోషించదగ్గవే.


మీ కుటుంబంలో మీరు అభిమానించే వ్యక్తి

ఇంకెవరు నా శ్రీమతి. ఆమె నాకు భార్యకంటే ఎంతో ఎక్కువ. నేను తప్ప కుటుంబంలో అంతా పేదలే. వాళ్లని, వాళ్ల పిల్లల్ని ఎంతగానో ఆమె అభిమానించేది.


అభిమాన నటీనటులు ఎవరు?

చిన్నప్పుడు అశోక్‌కుమార్‌ అంటే చాలా ఇష్టం. గ్రిగరీ పెక్‌, మార్లన్‌ బ్రాండో అంటే ఇష్టం. నర్గీస్‌, సావిత్రి అంటే ఇష్టం. సహజనటి జయసుధ అంటే ఇష్టం. నిజానికి వారిద్దరూ అంత అందంగా ఉండరు. అయినా అందం ఒకటే.. పారామీటర్‌ కాదు.

Updated Date - 2020-02-08T07:16:25+05:30 IST