అక్రమార్కులపై టాస్క్‌ఫోర్స్‌

ABN , First Publish Date - 2020-11-28T05:58:13+05:30 IST

అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిన నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వాటిని అరికట్టేందుకు పోలీ్‌సశాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది.

అక్రమార్కులపై టాస్క్‌ఫోర్స్‌
నల్లగొండ, సూర్యాపేట ఎస్పీలు రంగనాథ్‌, భాస్కరన్‌

నల్లగొండ, పేట జిల్లాల్లో ఇప్పటికే ప్రత్యేక బృందాల ఏర్పాటు

పారదర్శకత కోసం ఎస్‌బీ,  టాస్క్‌ఫోర్స్‌ విభాగాల ప్రక్షాళన

కొత్త సిబ్బంది నియామకం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిన నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వాటిని అరికట్టేందుకు పోలీ్‌సశాఖ ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇప్పటికే ప్రత్యేక బృందాల నిఘా, ఆకస్మిక దాడులతో అక్రమార్కుల ఆటకట్టిస్తున్నారు. పలు పోలీ్‌సస్టేషన్లలో పని చేస్తున్న చురుకైన సిబ్బంది, ఎస్‌ఐలు, ఒక ఇన్‌స్పెక్టర్‌తో టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌ టీంలు ఏర్పాటయ్యాయి. కాగా, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌బ్రాంచ్‌(ఎ్‌సబీ) విభాగాల్లో పారదర్శకత పెంచేందుకు నల్లగొండ జిల్లాలో ప్రక్షాళన మొదలైంది. ఈ విభాగాల్లో కొత్తవారి నియామకం, విధుల్లో సైతం మార్పులకు ఎస్పీ రంగనాథ్‌ శ్రీకారం చుట్టారు. సూర్యాపేటలో ఎస్పీ భాస్కరన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాలు చురుకుగా పనిచేస్తున్నాయి.

శాంతి భద్రతలకు ఎస్‌బీ వెన్నుముక. శాఖలో, బయట ఏం జరుగుతోంది, ఏం జరగనుందో ఈ విభాగం పసిగడుతుంది. అంతేగాక పాస్‌పోర్టులు, కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన వారి ట్రాక్‌ రికార్డు, స్థానిక పోలీసు సిబ్బంది ఏం చేస్తున్నారు, ఫిర్యాదులపై ఎలా స్పందిస్తున్నారు, మావోయిస్టులు, ఐఎ్‌సఐ తీవ్రవాదులు, రౌడీ షీటర్ల కదలికలను గమనించి ప్రతీ వారం ఎస్పీకి నివేదిక ఇవ్వాలి. ఎస్పీకి వచ్చిన దరఖాస్తులను స్థానికంగా విచారించి వాస్తవాలు ఏంటో నివేదించాలి. ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఈ సిబ్బంది, వీరందరిపైనా ఒక డీఎస్పీ, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఓ ఆఫీసు ఉంటుంది. కానిస్టేబు ళ్లు ఎస్‌బీ డీఎస్పీకి నివేదిస్తే ఆయన ప్రతి రోజు ఎస్పీకి వివరిస్తారు. అయితే కింది నుంచి వచ్చే సమాచారం ఎస్పీకి పూర్తిగా చేరకపోవ డం, కానిస్టేబుళ్లు సుదీర్ఘకాలంగా ఒకే చోట పాతుకుపోవడంతో అసాంఘిక శక్తులతో చేతులు కలపడం వంటివి జరుగుతున్నట్టు ఎస్పీకి సమాచారం ఉంది. దీంతో 30 మంది సిబ్బందితో ఉండే ఈ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని మారుస్తున్నామని సమీక్ష సమావేశంలో ప్రకటించి ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీలు నర్మద, సతీష్‌ ఆ దరఖాస్తులను విచారించి అర్హుల జాబితాను ఎస్పీకి పంపితే ఆయన తుది జాబితాను ఖరారు చేస్తారు. వీరు ఇక నుంచి సమాచారం నేరుగా ఎస్పీతో పంచుకోవాల్సి ఉంటుంది. గతంలో సమాచారం తీసుకురావడంతోపాటు క్షేత్రస్థాయికి వెళ్లి విచారించేవారు ఒక్కరే ఉండేవారు. అయితే ప్రస్తుతం ఒకరు సమాచారం సేకరిస్తే, మరొకరు విచారణకు వెళ్తారు. వారు ఎవరనేది ఎస్పీ నిర్ణయిస్తారు.


టాస్క్‌ఫోర్స్‌లో స్థానిక సిబ్బంది

టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది జిల్లాలోని ఏ మూలకైనా వెళ్లి దాడులు చేసి, నేరస్థులను విచారించి అంతా పూర్తయ్యాక అరెస్టులు చూపించే ముందు స్థానిక సిబ్బందికి అప్పగిస్తారు. నేరస్థులను విచారించే క్రమంలో స్థానిక పోలీసుల పాత్ర కూడా వెలుగులోకి వస్తుండటంతో వీరు టాస్క్‌పోర్స్‌పై ఆరోపణలకు దిగుతున్నారు. టాస్క్‌ఫోర్స్‌ సైతం కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లకు తలొగ్గి కొన్ని కేసుల తీవ్రతను తగ్గిస్తున్నా రు. దీంతో ఈ విభాగంలోని మొత్తం 15 మందిని మార్చాలని ఎస్పీ నిర్ణయించారు. ఇక నుంచి ఎస్‌బీ బృందాన్ని ప్రతి రెండేళ్లకు, టాస్క్‌ఫోర్స్‌ను ఏటా మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. స్థానిక సిబ్బందిపై ఎటువంటి ఆరోపణలు లేనప్పుడు టాస్క్‌ఫోర్స్‌తో కలిసి వారు కేసులను విచారిస్తారు. స్థానిక పోలీసులపై ఆరోపణలు ఉంటే టాస్క్‌ఫోర్సే కేసును విచారిస్తుంది.


పేటలో గంజాయి, గుట్కా, పేకాటపై ప్రత్యేక దృష్టి

సూర్యాపేటక్రైం: జిల్లాలో గంజాయి, గుట్కా విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, తిరుమలగిరి, మద్దిరాల, నూతనకల్‌, గరిడేపల్లి, మేళ్లచెర్వు, మఠంపల్లి, పెన్‌పహాడ్‌, మోతె మండలాల పరిధిలో ఈ అక్రమ దందాలు ఎక్కువగా ఉంది. సూర్యాపేట పట్టణంతోపాటు నేరేడుచర్ల, గరిడేపల్లి, కోదాడ, హుజూర్‌నగర్‌, మేళ్లచెర్వు, చింతలపాలెం, నడిగూడెం, మఠంపల్లి, పాలకీడు ప్రాంతాల్లో పేకాట జోరుగా నడుస్తోంది. ఏపీ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పేకాట ఆడుతున్నట్లు సమాచారం. ఇలా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న దందాలపై ఎస్పీ ప్రత్యేక నజర్‌పెట్టారు.


పలువురిపై పీడీయాక్ట్‌

అక్రమ వ్యాపారులపై పోలీసులు పీడీయాక్టు నమోదు చేస్తున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న పెన్‌పహాడ్‌ మండలానికి చెందిన ఇద్దరు యువకులపై పీడీ యాక్టు నమోదు చేశారు. అక్రమ వ్యాపారాలు చేస్తున్నారనే అనుమానంతో మరో 28మందిపై సస్పెక్ట్‌ షీట్లు తెరిచారు. ఆరుగురిపై రౌడీ షీట్‌ నమోదు చేశారు. ఆరు నెలల కాలంలో 290 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని 13 కేసులుపెట్టి 24మందిని అరెస్ట్‌ చేశారు. 76 గుట్కాల కేసులు, 80 పేకాట కేసుల్లో రూ.11లక్షలు సీజ్‌ చేశారు. పెన్‌పహాడ్‌ మండలంలోని పలు తండాలకు చెందిన గిరిజన యువకులు కొంతమంది ఉన్నత విద్యనభ్యసించి కూడా గంజాయి రవాణా చేస్తున్నారు. అంతేగాక ఓ యువకుడు పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికై కూడా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో యువతలో మార్పు తెచ్చేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్‌ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.


అక్రమ దందాలకు చెక్‌పెడతాం:ఆర్‌.భాస్కరన్‌, సూర్యాపేట జిల్లా ఎస్పీ

జిల్లాలో సాగుతున్న అక్రమ దందాలకు చెక్‌పెడతాం. అందుకోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే గంజాయి, గుట్కాలను అక్రమంగా తరలించి విక్రయించే వారిపై కేసులు నమోదు చేశాం. క్షేత్రస్థాయిలో విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అక్రమ దందాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదు. అందుకు ప్రజలు పోలీసులకు సహకరించి సమాచారం ఇవ్వాలి.

Updated Date - 2020-11-28T05:58:13+05:30 IST