నా జీవితంలో మరిచిపోలేని రోజు: అక్షయ్‌ కుమార్‌

Jun 17 2021 @ 19:32PM

నిజమైన హీరోలను కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని రోజని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లోని లోక్‌ గ్రామాన్ని సందర్శించిన అక్షయ్‌.. అక్కడి విధులు నిర్వహిస్తున్న బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) జవాన్లతో ఉల్లాసంగా గడిపారు. ముందుగా దేశం కోసం ప్రాణాలను అర్పించిన జవాన్ల స్మారక స్థూపంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి జవాన్లతో కలిసి డ్యాన్సులు చేశారు. సరదాగా వారితో వాలీబాల్‌ ఆడటమే కాకుండా.. ఓ జవాన్‌తో రెజ్లింగ్‌ కూడా చేశారు. అనంతరం అక్కడి స్థానికులు, భద్రతా బలగాలతో ముచ్చటించిన అక్షయ్‌.. మారుమూల ప్రాంతమైన తులైల్‌ గ్రామ ప్రాంతంలో ఉన్న పాఠశాల భవనానికి రూ. కోటి విరాళంగా అందజేశారు. ఈ పర్యటన గురించి తెలియజేస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా జవాన్లతో దిగిన ఫొటోలను, వీడియోను షేర్‌ చేశారు అక్షయ్‌ కుమార్‌. 


''దేశ సరిహద్దుల్లో మనల్ని రక్షిస్తున్న జవాన్లతో మరిచిపోలేని రోజును గడిపాను. దేశ సరిహద్దులకు రావడం, ఇక్కడి నిజమైన హీరోలను కలుసుకోవడం ఎప్పుడూ సంతోషాన్నిస్తుంది. నా హృదయం జవాన్ల పట్ల గౌరవంతో నిండిపోయి ఉంది.." అని అక్షయ్‌ కుమార్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడనే కాదు.. సైనికుల విషయంలో ఎటువంటి సహాయానికైనా అక్షయ్‌ ముందుంటాడని అనేకమార్లు ఆయన నిరూపించుకున్నారు. ఉరి ఉగ్రదాడి జరిగినప్పుడు.. అమరవీరుల కుటుంబాలకు ఎవరూ ఊహించని విధంగా కోట్లలో సాయం అందించి.. భారత సైన్యంపై తనకున్న ప్రేమను తెలియజేశాడీ 'కేసరి'.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.